close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. విశాఖ ఉత్తర ఫలితంపై వీడిన ఉత్కంఠ

విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన ఫలితంపై ఉత్కంఠ వీడింది. తెదేపా అభ్యర్థి, మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటన చేశారు. గురువారం రాత్రి వీవీప్యాట్లను లెక్కించే సమయంలో అందులో పోలైన ఓట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 42వ పోలింగ్‌బూత్‌కి సంబంధించిన వీవీప్యాట్‌లో 371 ఓట్లు పోలైతే కేవలం 107 మాత్రమే పోలైనట్లు చూపిస్తుండటంతో వైకాపా అభ్యర్థి కేకే రాజు, ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికారులు ఫలితాన్ని పెండింగులో పెట్టడంతో పాటు నియోజకవర్గ చివరి రౌండ్‌ వివరాలను వెల్లడించలేదు. తాజాగా గంటా విజయం సాధించినట్లు ప్రకటించారు.

2. జగన్‌ ప్రమాణస్వీకారం కోసం ఏర్పాట్లు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియాన్ని ప్రమాణస్వీకార వేదికగా ఖరారు చేశారు. 30న ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రమాణస్వీకారానికి పెద్దసంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను జగన్‌ ఆదేశించారు. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు జగన్‌ను కలిసి ప్రమాణస్వీకార ఏర్పాట్లపై చర్చించారు.

3. పార్టీ నేతలతో పవన్‌ కీలక భేటీ

ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాల సరళి, రాజకీయ పరిణామాలు, తదుపరి కార్యాచరణపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. తమ పరిశీలనకు వచ్చిన వివిధ అంశాలను నేతలు పవన్‌కు వివరించారు. వచ్చే నెల నుంచి మంగళగిరిలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి జనసేన అభ్యర్థులు వచ్చి పవన్‌ను కలిశారు. ఎన్నికల సరళి, కౌంటింగ్‌ జరిగిన విధానాన్ని పవన్‌కు వివరించారు.

4. 30న మోదీ ప్రమాణ స్వీకారం!

భారత దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ తంతు కంటే ముందు ఆయన ఈనెల 28న వారణాసిలో పర్యటిస్తారు. అక్కడ ఆయన భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 28న వారణాసి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. 29న సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటిస్తారు. అక్కడ తన తల్లి హీరాబెన్‌ వద్ద ఆశీర్వాదం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

5. ఈవీఎం మాయం కావడంపై బొత్స ఫిర్యాదు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల క్రిష్ణ ద్వివేదిని వైకాపా నేత బొత్స సత్యనారాయణ కలిశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈవీఎం మాయం కావటంపై ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడ రీపోలింగ్ జరిపి న్యాయం చేయాలని సీఈఓకి బొత్స విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్‌కు నాలుగు రోజుల ముందు విశాఖ నార్త్‌ ఆర్వోని మార్చటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే విశాఖ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని బొత్స ఆరోపించారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఈవీఎంలలో నమోదైన ఓట్లు వీవీప్యాట్లలో ఉన్న స్లిప్పులకు వ్యత్యాసం ఉందని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

6. మరోసారి ప్రతిపక్ష హోదాకు కాంగ్రెస్ దూరం!

సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనానికి కాంగ్రెస్‌ కుదేలై కేవలం 52 స్థానాలకే పరిమితమైంది. 2014తో పోలిస్తే స్వల్పంగా పుంజుకున్నప్పటికీ సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన పార్టీకి ఈ ఫలితాలు పరాభవమనే చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్.. ఈసారి కూడా అదే పరంపరను కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా అర్హత సాధించాలంటే లోక్‌సభలో కనీసం 10శాతం అంటే 55 సీట్లు సాధించాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్‌ 52 సీట్లకే పరిమితమవడంతో దాదాపు ఆ ఆశలు గల్లంతయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

7. ఆ సత్తా ఉన్న పార్టీ మాదే: మురళీధర్‌రావు

తెలంగాణలో తెరాస ప్రోత్సహిస్తోన్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను వ్యతిరేకించే సత్తా ఉన్న పార్టీ భాజపా మాత్రమేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. తెరాస నియంతృత్వ విధానాలకు, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడేది తామేనన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని సిద్ధాంతాల కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారని, నాలుగు స్థానాల్లో పార్టీ గెలుపుతో కార్యకర్తల కళ్లల్లో నేడు వెలుగులు చూస్తున్నామని నేతలు అన్నారు.

8. ‘తెరాసను ఎప్పటికైనా గద్దెదించేది మేమే’

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీయే తెరాసకు ప్రత్యామ్నాయమని, ఆ పార్టీని ఎప్పటికైనా గద్దె దించేది తామేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. భాజపాకు ఆ స్థాయి లేకపోయినప్పటికీ అదృష్టం కొద్దీ నాలుగు స్థానాల్లో గెలిచిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100స్థానాల్లో భాజపాకు డిపాజిట్‌ కూడా దక్కలేదని.. ఈ అంశమే స్థానికంగా భాజపాకు ఉన్న బలమేంటో తెలియజేస్తోందన్నారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంనుంచి గెలుపొందిన ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో పలు అంశాలపై మాట్లాడారు.

9. నాతొలి ప్రాధాన్యమదే.. గళం విన్పిస్తా: రేవంత్‌

తెలంగాణను సీఎం కేసీఆర్‌ ఓ రాష్ట్రం కాకుండా రాజ్యమనుకున్నారని.. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తెరాసకు తగిన బుద్ధి చెప్పారని మల్కాజ్‌గిరి ఎంపీగా గెలుపొందిన కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. తండ్రీ కొడుకుల అహంకారం అణిచేందుకే ప్రజలు ఈ విధమైన ఫలితాలు ఇచ్చారని చెప్పారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును బాధ్యతగా భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు ఇచ్చిన అధికారంతో కుటుంబ పాలన చేస్తున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు. తన తొలి ప్రాధాన్యత నియోజకవర్గంలో సమస్యల్ని పరిష్కరించడమేనన్నారు. అలాగే, రాష్ట్ర విభజన హక్కులపై పార్లమెంట్‌లో గళమెత్తుతానని చెప్పారు.

10. మార్కెట్లకు  జోష్‌!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఎన్‌డీఏ ప్రభుత్వ విజయాన్ని మార్కెట్లు ఇంకా ఆస్వాదిస్తున్నాయి. నేడు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 623 పాయింట్లు పెరిగి 39,434 వద్ద, నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి 11,844 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడికాప్‌ సూచీ 1.54శాతం లాభపడింది. ఇక స్మాల్‌కాప్‌ సూచీ కూడా 1.92శాతం లాభపడింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.