close

తాజా వార్తలు

ఇలా అయితే విడిపోదాం!

చిన్న కారణాలకే దూరమవుదామంటున్న నవ జంటలు
అహం అడ్డుగోడగా మారుతున్న వైనం

హైదరాబాద్‌: ‘మేడం.. మాకు 8 నెలల క్రితం పెళ్లయింది. ఇద్దరం ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నాం. 3 నెలల నుంచి నాతో సరిగా ఉండడం లేదు. విధులు ముగించుకుని నేను ఇంటికి వెళ్తే స్నేహితులను కలిసేందుకు రాత్రి వెళ్లి తెల్లవారుజామున వస్తున్నాడు. ఎందుకు మద్యం తాగుతున్నావ్‌? అని అడిగితే స్నేహితులతో పార్టీ చేసుకుని వస్తే ఎందుకు ప్రశ్నిస్తావంటూ కొట్టాడు. అతడి ప్రవర్తనపై నా భర్త స్నేహితులను వాకబు చేయగా వారాంతాలతోపాటు ఇతర కారణాలు చెప్పుకొని మద్యం తాగుతున్నాడని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే నా ఇష్టం నేను ఖర్చుపెడతా.. అడగడానికి నువ్వెవరు? అంటూ మళ్లీ కొట్టాడు. ఇలాగైతే నేను వెళ్లిపోతా అంటే.. నీ దిక్కున్నచోటకు పోవే అన్నాడు. ఇక అతడితో కలిసి ఉండడం వల్లకాదు... కేసు నమోదుచేసి అరెస్ట్‌ చేయండి..’

భరోసా కేంద్రంలో యువతికి, కౌన్సెలర్‌ మధ్య కొద్దిరోజుల క్రితం జరిగిన సంభాషణ సారాంశమిది. ఇక్కడికి భర్తల చేతుల్లో చిత్రహింసలు ఎదుర్కొంటున్నవారు, ఇద్దరి మధ్య సఖ్యత లేనివారు, అహం (ఇగో) సమస్యలున్నవారు పదుల సంఖ్యలో వస్తున్నారు. వీరందరితో సామరస్యంగా మాట్లాడాక వ్యక్తిగతంగా మానసిక నిపుణులు, న్యాయాధికారులు, పోలీసులు వేర్వేరుగా కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. బాధితుల భర్తలు, వారి బంధువులను పిలిచి విషయాలను వివరిస్తున్నారు. భరోసా కేంద్రానికి వస్తున్న బాధితుల వ్యక్తిగత ఫిర్యాదులు నమోదు చేస్తున్న పోలీస్‌ అధికారులు, కౌన్సెలర్లు వాటిని కంప్యూటరీకరిస్తున్నారు. భర్తల ప్రవర్తనల్లో మార్పుల వల్ల 75 శాతం మంది భార్యలు సమస్యలు ఎదుర్కొంటుండగా 25 శాతం మంది భార్యలు తాము ఊహించుకున్నట్టుగా జీవితం ఉండకపోవడంతో వాటిని సమస్యలుగా భావించి ఫిర్యాదులు చేసేందుకు వస్తున్నారు. అహం, ఆర్థికాంశాలు, మద్యం అలవాట్ల వంటి మూడు అంశాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగి తీవ్రంగా మారుతున్నాయని విశ్లేషించారు. వీటిల్లో సాధ్యమైనన్ని పరిష్కరించి భార్యాభర్తలకు సర్దిచెప్పి పంపుతున్నారు.

మెట్టినింట్లో ఇమడలేక..
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ పెళ్లిచేసుకున్న యువతుల్లో 60 శాతం మంది అత్తారింటికి వెళ్లిన కొద్దిరోజులకే అక్కడ ఉండలేకపోతున్నారు. అత్తమామలు వారి నుంచి సేవలు ఆశిస్తుండడం, కోడలికి ఇవన్నీ కొత్త కావడంతో సూటిపోటి మాటలు మొదలవుతున్నాయి. అత్తమామలకు వంట చేసిపెట్టడంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఆఫీస్‌కు వెళ్లేప్పుడు, వచ్చేప్పుడు అత్తమామలు చూసే చూపులను యువతులు ఇబ్బందికరంగా భావిస్తున్నారు. ఉద్యోగంతో రూ.లక్షలు సంపాదిస్తున్నావా? ఇంట్లో కూర్చుంటే సరిపోతుందని చెబుతున్నారు. ఇంట్లో ఉంటే వంటపని, ఇంటిపని కూడా చేయించుకోవాలన్న ఆలోచనలతో ఉద్యోగం మాన్పించేందుకు పరోక్షంగా అంటున్నారు. ఒకటి, రెండు సందర్భాల్లో ఇంటిపనికి మనిషిని నియమించుకుందాం అని వివరించినా ససేమిరా అనడమే కాకుండా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని కొత్తగా పెళ్లైన యువతులు పోలీసులకు చెబుతున్నారు. మరోవైపు తనకు అండగా ఉండాల్సిన ఉన్న భర్త ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అలాంటివారిలో అసంతృప్తి పెరిగిపోతోంది. పెళ్లికి ముందు వరకు తనకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా అత్తమామలున్న ఇంట్లో వ్యక్తిగత స్వేచ్ఛ లేదని భర్తకు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులు షురూ..
కొత్తగా పెళ్లైన యువతులు, మహిళా ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లలో కొందరికి మెట్టినింట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలవుతున్నాయి. 75 శాతం మంది వద్ద వారి ఏటీఎం కార్డు ఉండడం లేదు. పెళ్లైన కొద్దిరోజులకు డబ్బు అవసరం ఉందంటూ వారి భర్తలు ఏటీఎం కార్డులను తీసుకుని ఇక ఇవ్వడం లేదు. భర్తే తీసుకున్నాడు కదా అని వీరు కూడా పట్టించుకోవడం లేదు. పైగా ఎప్పుడైనా డబ్బు తీసుకోవాలన్నా, ఏదైనా కొనాలన్నా ఏటీఎంకు వెళ్లి నగదు తీసుకోలేం కదా అనే భావనతో ఉంటున్నారు. తక్కువ ధరలకే చీరలు, అలంకరణ వస్తువులు అంటూ రాయితీలు వచ్చినప్పుడు ఏటీఎం కార్డు అడిగితే ఎందుకు అనవసరంగా డబ్బు వృథా చేస్తావంటూ భర్త ప్రశ్నిస్తున్నాడు. ఇంతేకాదు మందులు కొనాలన్నా, వారాంతాల్లో వారి స్నేహితులు, పిల్లలతో కలిసి వెళ్లేటప్పుడు డబ్బులు కావాలన్నా భర్తలు ఇవ్వడం లేదు. కొంతమంది బాధితులు బస్సులో వస్తే ఆలస్యమవుతుంది ఆటోలో వచ్చేందుకు డబ్బులు ఇవ్వండని భర్తలను అడిగితే ఇవ్వడంలేదు. పుట్టింటి నుంచి తమ్ముళ్లు, చెల్లెళ్లు వచ్చినప్పుడు వారికి దుస్తులు కొనిచ్చేందుకు భర్తను అడిగినప్పుడు ఇవ్వకపోతే వారు తీవ్రంగా బాధపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఒక్కొక్కటిగా పెరిగి నా సంపాదనపై నాకు ఎలాంటి హక్కు లేదా? అంటూ ప్రశ్నించడతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలై తారాస్థాయికి చేరుకుంటున్నాయి. భరోసా కేంద్రానికి ఇలాంటి సమస్యలతో సగటున 8 మంది మహిళలు, యువతులు వస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.