close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. జూన్‌లో ట్రంప్‌, మోదీల భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో జపాన్‌లో జరుగునున్న జి-20 దేశాల సదస్సు సందర్భంగా భేటీ కానున్నారు. భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవటంపై వారు చర్చించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని మోదీని అభినందించేందుకు ట్రంప్‌ ఫోన్‌ చేశారు. 

2. రాహుల్‌ రాజీనామా?

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పలువురు నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. శనివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ రాజీనామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలోనే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ రాహుల్‌ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఆయన కేరళలోని వయనాడ్‌లో గెలిచినా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో ఓటమిపాలయ్యారు. మోదీ నాయకత్వంలోని భాజపా చేతిలో వరుసగా రెండోసారి ఓడిపోవడంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. 

3. జగన్‌ ఎన్నిక నేడే

ప్రభుత్వ ఏర్పాటు దిశగా వైకాపా తొలి అడుగు వేస్తోంది. పార్టీ శాసనసభాపక్షం శనివారం ఉదయం 10:31 గంటలకు భేటీ కానుంది. శాసనసభాపక్ష నేతగా  జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ ఒక్క అజెండాతోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. తాడేపల్లిలో జగన్‌ క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో జగన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానించనున్నారు. ఈ తీర్మాన ప్రతిని సాయంత్రం నాలుగున్నరకు హైదరాబాద్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు సమర్పించనున్నారు. ఎమ్మెల్యేల బృందంతో కలిసి వెళ్లి జగన్‌ గవర్నర్‌కు ఈ ప్రతిని అందజేయనున్నారు.

4. 60 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌

భూమిపై ఎక్కడైనా బ్రాడ్‌బ్యాండ్‌ అంతర్జాలాన్ని అతి తక్కువ ధరలకే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా బిలియనీర్‌, స్పేస్‌ఎక్స్‌ సంస్థ ఛైర్మన్‌ ఎలాన్‌ మస్క్‌ ఆ దిశగా తొలి అడుగు వేశారు. కంపెనీకి చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌  శుక్రవారం వేకువజామున 60 ఉపగ్రహాలను తొలిసారి విజయవంతంగా భూక్షక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది. 12000కు పైగా ట్రాన్స్‌పాండర్లతో ‘స్టార్‌లింక్‌’ ఉపగ్రహ సమూహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంలో ఇది మొదటి ప్రయోగం.

5. నేడు కేసీఆర్‌తో జగన్‌ భేటీ

వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం అయిదు గంటలకు హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న విజయవాడలో జరిగే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుతూ ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు. సాయంత్రం 4.30కి జగన్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అవుతారు.

6. నేడు రాష్ట్ర కాంగ్రెస్‌ కీలక భేటీ

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతల సమావేశం శనివారం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు గాంధీభవన్‌లో మొదలయ్యే ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర బాధ్యుడు కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు, పోటీచేసిన అభ్యర్థులు హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పాటు తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులను ఇందులో సమీక్షిస్తారు.

7. రవిప్రకాశ్‌ కోసం పోలీసుల గాలింపు

టీవీ9 సంస్థ వాటాల వివాదంలో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కోసం సైబరాబాద్‌ పోలీసులు గాలింపు విస్తృతం చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించిన వ్యవహారంలో ఆయనపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 21న పోలీసులు 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసు జారీ చేశారు. 23 లోగా సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో హాజరై వివరణ ఇవ్వాలని కోరారు. అయితే రవిప్రకాశ్‌ ఆ నోటీసుకు స్పందించలేదు. ఇప్పటికే రెండు దఫాలుగా 160 సీఆర్పీసీ, మరో రెండు దఫాలుగా 41 ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. 

8. మాల్యాకు మరో ఎదురుదెబ్బ 

విజయ్‌ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్‌ పానీయాల సంస్థ డియాజియోకు 135 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.945 కోట్లు) చెల్లించాలని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. మాల్యా నుంచి 175 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1225 కోట్లు) పరిహారం ఇప్పించాలని డియోజియో కోర్టును అభ్యర్థించింది. ఈ కేసులో తీర్పు ఇస్తూ 135 మి.డా.ను వడ్డీతో సహా చెల్లించాలని, న్యాయ ఖర్చుల కింద మరో 2 లక్షల పౌండ్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

9. తొలుత జగన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం?

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు ఆ రోజు మంత్రులెవరూ ఉండకపోవచ్చని, జూన్‌ మొదటి వారంలో 18-20మంది సభ్యులను మంత్రివర్గంలో చేర్చుకుంటారని పార్టీలోని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. కొద్ది నెలల తరువాత జరిగే విస్తరణతోనే పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటవుతుందని అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వైకాపా శాసనసభ్యుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రాంతాలు, వర్గాల నేపథ్యంగా తమకూ అవకాశం వస్తుందేమోనని భావించే వారు పదుల్లో ఉంటున్నారు. 

10. కివీస్‌తో సన్నాహం

ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో తన బలాబలాలను పరీక్షించుకునేందుకు టీమ్‌ఇండియాకు తొలి అవకాశం. అసలు సమరానికి ముందు సన్నాహక పోరుకు కోహ్లీసేన సిద్ధమైంది. తన మొదటి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో శనివారం విలియమ్సన్‌ నేతృత్వంలోని న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అందరి దృష్టీ నాలుగో స్థానం కోసం పోటీపడుతున్న రాహుల్‌, విజయ్‌ శంకర్‌లపైనే. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన భారత్‌.. కెన్నింగ్టన్‌ ఓవల్‌ మైదానంలో ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. 

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.