close

తాజా వార్తలు

సోదరా.. గెలుపు లేదురా! 

అన్నదమ్ముల పరాజయం 
వేర్వేరు పార్టీలపై పోటీ చేసి భంగపడిన సోదరులు 
తెదేపా అభ్యర్థుల గెలుపును దెబ్బతీసిన తిరుగుబాట్లు

అమరావతి: ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వేర్వేరు పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కుటుంబ తగాదాలు, ఇతర వ్యక్తిగత కారణాలతో బరిలో దిగిన వీరికి ఊహించని రీతిలో చుక్కెదురైంది. ఇంకొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థుల ప్రభావం ప్రధాన పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసింది. టిక్కెట్‌ ఆశించి భంగపడిన వారంతా కొన్ని జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి స్వతంత్రులుగా పోటీ చేసి గెలవకపోగా ప్రత్యర్థులను దెబ్బతీశారు.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో అన్నదమ్ములు బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాసరావు తెదేపా, జనసేన అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ వైకాపా అభ్యర్థి చిర్ల జగ్గారెడ్డి సమీప అభ్యర్థి సత్యానందరావుపై 4,038 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 78,607 ఓట్లు సాధించిన సత్యానందరావు విజయావకాశాలను 35,833 ఓట్లు పొందిన సోదరుడు శ్రీనివాసరావు దెబ్బ తీశారు. 2014 ఎన్నికల్లోనూ సత్యానందరావుకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

విశాఖ జిల్లా వి.మాడుగుల నుంచి పోటీ చేసి ఓటమిపాలైన తెదేపా అభ్యర్థి జి.రామానాయుడు, జనసేన అభ్యర్థి జి.సన్యాసినాయుడు స్వయానా అన్నదమ్ములు. రాజకీయంగా విభేదించుకునే వీరిద్దరూ వేర్వేరుగా బరిలో దిగి పరాజయం పాలయ్యారు. ఇక్కడ వైకాపా అభ్యర్థి బి.ముత్యాలనాయుడు 6,347 ఓట్ల ఆధిక్యంతో సమీప అభ్యర్థి రామానాయుడి(62,483 ఓట్లు)పై గెలుపొందారు. జనసేన అభ్యర్థి సన్యాసినాయుడికి 3,745 ఓట్లు లభించాయి.

పార్టీ మారి మరీ.... 
విజయనగరం జిల్లా గజపతినగరం తెదేపా అభ్యర్థి కేఏ నాయుడికి సోదరుడు కొండలరావు నుంచి ఎన్నికల్లో చుక్కెదురైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే నాయుడితోపాటు కొండలరావు కూడా తెదేపా టిక్కెట్‌ కోసం ఎన్నికల ముందు పోటీ పడ్డారు. కేఏ నాయుడి పేరును తెదేపా అధిష్ఠానం ఖరారు చేయడంతో సోదరుడు కొండలరావు వైకాపాలో చేరారు. నియోజకవర్గంలో భాగమైన గంట్యాడ మాజీ మండలాధ్యక్షుడైన కొండలరావు మద్దతుతో 2014 ఎన్నికల్లో కేఏ నాయుడికి గంట్యాడలో 8.177 ఓట్ల ఆధిక్యం లభించింది. కొండలరావు వైకాపాలో చేరడం, ఇతర కారణాల వల్ల ఇదే మండలంలో ఇప్పుడు వైకాపా అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్యకు 4,824 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా 27,011 ఓట్ల మెజారిటీతో వైకాపా అభ్యర్థి గెలిచారు.

తప్పని తిరుగు‘పోట్లు’ 
విశాఖ జిల్లా ఎలమంచిలిలో తెదేపా అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు విజయావకాశాలను తిరుగుబాటు అభ్యర్థి (జనసేన) పి.విజయకుమార్‌ దెబ్బతీశారు. ఇక్కడినుంచి పోటీ చేసేందుకు విజయకుమార్‌తోపాటు రమేశ్‌బాబు తీవ్రంగా యత్నించారు. పార్టీ అధిష్ఠానం రమేశ్‌బాబుకు టిక్కెట్‌ ఇవ్వడంతో విజయకుమార్‌ జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. చివరకు వైకాపా అభ్యర్థి యూవీ రమణమూర్తి (కన్నబాబు) సమీప అభ్యర్థి రమేశ్‌బాబుపై 4,4,51 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జనసేన అభ్యర్థి విజయకుమార్‌కు 19,634 ఓట్లు పోలయ్యాయి.

కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పోటీ చేసిన తిరుగుబాటు అభ్యర్థి కె.రవిశంకర్‌ అధికార తెదేపా అభ్యర్థి మండలి బుద్దప్రసాద్‌ విజయావకాశాలను కొంతమేర దెబ్బ తీశారు. తెదేపాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుబంధం ఉన్న కె.రవికుమార్‌ చివరిక్షణంలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా బరిలో దిగారు. ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్‌బాబు సమీప అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌పై 20,725 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల్లో బుద్ధ ప్రసాద్‌కు 57,722 ఓట్లు, తిరుగుబాటు అభ్యర్థి రవిశంకర్‌కు 13,561 ఓట్లు లభించాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.