close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. 16వ లోక్‌సభ రద్దు

16వ లోక్‌సభను శనివారం రాష్ట్రపతి రద్దు చేశారు. 17వ లోక్‌సభ ఏర్పడినందున కేంద్ర కేబినెట్‌ అభ్యర్థన మేరకు సంబంధిత దస్త్రంపై రాష్ట్రపతి శనివారం సంతకం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 16వ లోక్‌సభ గడువు వచ్చే నెల 3 వరకూ ఉంది. మరోవైపు 17వ లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుల జాబితాను ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా శనివారం రాష్ట్రపతికి అందించారు. శుక్రవారం కేంద్ర వర్గం సమావేశమై మంత్రి మండలి రద్దుకు తీర్మానించిన సంగతి తెలిసిందే.

2. జగన్‌ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు

ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి అధికారులు వేదికను ఖరారు చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈ స్టేడియంలో 35వేల మంది గ్యాలరీల్లో కూర్చొనే అవకాశం ఉండడం, దిగువన మరో 20వేల మంది కూర్చొనే వెసులుబాటు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా 50వేల మందికి పైగా కూర్చొనే వెసులుబాటు ఉండటంతో ఈ మేరకు అక్కడే ప్రమాణస్వీకారోత్సవం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది.

3. 28న గుంటూరు కార్యాలయానికి చంద్రబాబు

 తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న గుంటూరు రానున్నారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించిన తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతారు. సాధారణంగా ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల ఫలితాలకు ముందే మహానాడు నిర్వహణపై తెదేపా చర్చించింది. ఎన్నికల ఫలితాల విడుదల హడావుడి ఉంటుంది కాబట్టి జులైలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మహానాడుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ జయంతిని మాత్రం ఈ నెల 28న యథావిధిగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

4. గవర్నర్‌ నరసింహన్‌తో జగన్‌ భేటీ

వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో వైకాపా విజయఢంకా మోగించడంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం తాడేపల్లి నుంచి గన్నవరం వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో జగన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక వాహన శ్రేణిలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాజ్‌భవన్‌ వద్ద ఆయనకు వైకాపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

5. ‘దిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌కు ప్రత్యామ్నాయం లేదు’

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమ్‌ ఆద్మీ పార్టీయే విజయం సాధిస్తుందని ఆ పార్టీ దిల్లీ శాఖ చీఫ్‌ గోపాల్‌ రాయ్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. దిల్లీకి ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పెద్దగా ప్రభావం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘మరో ప్రత్యామ్నాయం లేక లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మోదీని ఎన్నుకున్నట్లే దిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. రెండోసారి కూడా దిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని మా పార్టీయే కైవసం చేసుకుంటుంది’’ అని రాయ్‌ ధీమా వ్యక్తం చేశారు.

6. 2 కి.మీ దూరానికి 45 నిమిషాలు తీసుకున్నారు

గుజరాత్‌లోని సూరత్‌లో ఓ కోచింగ్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన వెనుక కారణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. భవన నిర్మాణంలో లోపాలు, సరైన అగ్నిమాపక ఏర్పాట్లు లేకపోవడంతో పాటు పలు ఇతర వసతుల లేమి కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇదిలా ఉండగా.. భవనంలో మంటలు ఎగిసిపడుతున్నా.. అగ్నిమాపక సిబ్బంది చాలా సేపటి వరకు రాలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘటనాస్థలాన్ని చేరుకునేందుకు 45 నిమిషాల సమయం తీసుకున్నారని అన్నారు.

7. రాష్ట్రపతిని కలిసిన ఈసీ

సార్వత్రిక ఎన్నికల్లో ఎంపికైన నూతన ఎంపీల జాబితాను ఎన్నికల సంఘం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అందజేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ ఆరోడా, ఇద్దరు కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్రలు రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ కాపీని, ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. రాజ్యాంగం ప్రకారం 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి చొరవ తీసుకొనేందుకు ఈ జాబితా రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. శనివారం సాయంత్రం ఎన్డీఏలో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా సమావేశమై నరేంద్రమోదీని తమ నేతగా ఎన్నుకోనున్నారు.

8. రాహుల్‌ రాజీనామా చేసినట్లు వార్తలు

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను కాంగ్రెస్‌ కొట్టిపారేసింది. రాహుల్‌ రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా తెలిపారు. ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించుకునేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నేడు భేటీ అయ్యింది. ఈ సమావేశానికి రాహుల్‌ గాంధీ సహా, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్‌ నేతలు గలాం నబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీ, మల్లికార్జున్‌ ఖర్గే, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు.

9. రూ.899 నుంచి గో ఎయిర్‌ టికెట్లు

దేశీయ మార్గాల్లో ప్రయాణానికి రూ.899 నుంచి ఆఫర్‌ టికెట్లు విక్రయించనున్నట్లు గో ఎయిర్‌ ప్రకటించింది. జూన్‌ 15 నుంచి డిసెంబరు 31 మధ్య ప్రయాణం కోసం అందుబాటులో ఉండేలా 10 లక్షల టికెట్లను ఈనెల 27 నుంచి 3 రోజుల పాటు విక్రయిస్తామని తెలిపింది. కనీసం 2499 లావాదేవీకి పేటీఎం వాలెట్‌ ద్వారా చెల్లిస్తే రూ.500 నగదు వెనక్కి ఇస్తామని పేర్కొంది. కనీసం రూ.1999 లావాదేవీకి మిత్రా యాప్‌లో 10 శాతం రాయితీ లభిస్తుంది. జూమ్‌కార్‌ ద్వారా బుక్‌ చేసుకుంటే, రూ.1500 లేదా 20 శాతం రాయితీ లభిస్తుందని వెల్లడించింది.

10. వార్మప్‌ మ్యాచ్‌లో తడబడుతున్న ఇండియా

ప్రపంచకప్‌ నేపథ్యంలో ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. 19 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 77 పరుగులు మాత్రమే చేసింది. నిలకడగా ఆడుతున్న విరాట్‌కోహ్లీ(18, 24 బంతుల్లో 3x4) గ్రాండ్‌హోమ్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో హార్దిక్‌ పాండ్య(30), ధోనీ(11) ఉన్నారు. అంతకుముందు టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.