close

తాజా వార్తలు

నవ తరానికి పెరుంసోరు

ఆమె ఓ చెఫ్‌. వంటల్లో కొత్తకొత్త ప్రయోగాలు చేయడమే కాదు... అయిదో శతాబ్దం నాటి రుచులను ఈ తరానికి పరిచయం చేస్తోంది. అలనాటి లిపిల ఆధారంగా ఆహారపుటలవాట్లపై పరిశోధన కొనసాగిస్తోంది. భౌగోళిక పరిస్థితులకు తగ్గట్లు అధ్యయనం చేసి వాటిని రేపటి తరాలకు అందించడానికి డాక్యుమెంటరీనీ రూపొందిస్తోంది. ఆమే శ్రీబాల.

శ్రీబాల స్వస్థలం చెన్నై. బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి గృహిణి. తొమ్మిదేళ్ల నుంచే అమ్మతో కలిసి ఘుమఘుమలాడే వంటలు చేసేది. దీన్నే వృత్తిగా ఎంచుకోవాలనుకుంది. వంటల్లో శిక్షణ తీసుకోవాలనుకుంటే, మాంసాహారం కూడా వండాల్సి ఉంటుందని తల్లి అభ్యంతరం చెప్పింది. ఆమె మాట కాదనలేక, సీఏ, ఆపై కంపెనీ సెక్రటరీ కోర్సు చదివి, ఉద్యోగంలో చేరిపోయింది.

ఆలోచనలన్నీ అటే...
విధుల్లో ఉన్నా... ఆమె ఆలోచనలు మాత్రం వంటలపైనే ఉండేవి. ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి వంటలు చూసి నిరుత్సాహపడేది. దాంతో ‘తమిళగ ఉళా’ పేరుతో ప్రాచీన తమిళనాడు వంటల గురించి తెలుసుకోవాలనుకుంది. ఈ ప్రయత్నం పరిశోధనల వరకూ వెళ్లింది. దీని కోసం చెన్నై ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీ, చరిత్ర విభాగం ప్రొఫెసర్‌ల సాయం తీసుకుంది. వారి సలహాతో అయిదో శతాబ్దంలో తమిళుల వారసత్వ చరిత్రగా చెప్పే ‘సంగం కాలం’ సంప్రదాయ వంటకాల గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఈ చరిత్ర 300వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. అప్పటి ఆహారపుటలవాట్ల వివరాలను సాహిత్యం, పాటల రూపంలో పొందుపరిచేవారు. వాటిలో అప్పటివారు వంటల్లో వాడిన దినుసులు, కూరగాయల వివరాలు మాత్రమే ఉండేవి. అలా ఆ పాటల ఆధారంగా ఫలానా వంట ఎలా వండి ఉంటారోనని ప్రయోగాత్మకంగా చేయడం మొదలుపెట్టింది. ‘సంగం కాలంనాటి సంప్రదాయపు వంటలను తెలుసుకోగలిగా. ఛోళ, పాండ్యుల కాలంలో ఈ రాజ్యం విస్తరించింది. అందులో ఆంధ్ర, తెలంగాణ, కేరళ భూభాగం కూడా కలిసి ఉండేది. అందుకే ఆహారపుటలవాట్లు కొంతవరకు ఒకే తీరులో ఉంటాయి. ఈ వివరాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నా...’ అని అంటోంది.

అప్పట్లో బిర్యానీ...
యుద్ధం నుంచి విజయోత్సాహంతో వచ్చిన వారికి ‘పెరుం సోరు’ అని చేసిపెట్టేవారు. ఇది ఇప్పటి బిర్యానీని పోలి ఉంటుంది. దీని తయారీలో బియ్యం, మసాలాలు, మాంసం వాడేవారు. మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారు. గరంమసాలాగా ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వాడేవారు. ఇవన్నీ నాలుగు వేల ఏళ్ల నుంచే చరిత్రలో ఉన్నాయి. కారం కోసం నల్ల మిరియాలను వాడేవారని అంటుందామె. ‘అప్పట్లో ఎండుమిర్చి, పెద్ద ఉల్లిపాయలు, టొమాటోలు లేవు. గత 500 ఏళ్ల నుంచే ఇవి వాడుకలోకి వచ్చాయి. నేను చేసే పెరుం సోరుకు ఎన్నో ప్రశంసలు అందుకున్నా. చేపల పులుసులో చింతపండు లేదా మామిడికాయ పులుపును వాడేవారు. కూరల్లో మసాలాలను అప్పటికప్పుడు నూరే విధానం ఇప్పటికీ తమిళనాడు, కేరళలో కనిపిస్తుంది. నిల్వ మసాలాలు అప్పట్లో ఉండేవి కాదు. కాఫీ టీలు వారికి తెలియవు. ఉదయం తాజా కల్లు తాగేవారు. కరికాల చోళన్‌ కాలంలో మాంసానికి మిరియాల పొడి కలిపి సూప్‌ తయారు చేసేవారు. ఇదంతా అప్పటి సంస్కృతి. ఆయా కాలాల లిపిని అనువాదకుల ద్వారా తెలుసుకుంటూ అధ్యయనం చేస్తున్నా. చోళుల కాలంనాటి ఆహారపుటలవాట్లు థాయ్‌లాండ్‌, మలేసియా, ఇండోనేసియా, శ్రీలంక వంటి దేశాల్లో కనిపిస్తాయి...’.

మహిళలకు ఉన్నత స్థానం...
‘సంగం కాలంలో మహిళలకు స్వేచ్ఛ, ఉన్నతస్థానం లభించేవి. కుటుంబ వ్యవహారాలు, యుద్ధాల్లో కూడా మహిళలను గౌరవించి ఆహ్వానించేవారు. సమానత్వం కనిపించేది. కాకతీయుల కాలంలో రుద్రమదేవి చరిత్ర అత్యుత్తమంగా నిలిచింది. 1300 సంవత్సరం వరకు ఇదే  కొనసాగింది. క్రమంగా మార్పు మొదలైంది. అలాగే వంటల్లో గోధుమను వాడేవారు. సర్వపిండి, బియ్యాన్ని కూడా వినియోగించేవారు. నాలుగేళ్ల నుంచి ఈ అధ్యయనం చేపట్టా. భవిష్యత్తులో మరిన్ని వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నా. పెద్దపెద్ద హోటళ్లు నిర్వహించే ఫుడ్‌ ఫెస్టివల్స్‌లో నేను వండే అలనాటి రుచులకు ఆదరణ ఎక్కువ అని తెలిసి ఆనందంగా అనిపిస్తుంది...’ అని అంటుందామె.

పోషకవిలువలు...
పోషకాలుండే ఆహారానికి అప్పట్లో పెద్ద పీట వేసేవారని అంటుంది శ్రీబాల. ‘వెదురు చిగుర్లను ప్రత్యేకంగా వాడేవారు. వీటిలో పీచు, తక్షణశక్తినిచ్చే గుణాలుంటాయి. ఈ సంస్కృతి ప్రస్తుతం కర్ణాటకలోని కూర్గ్‌లో కనిపిస్తుంది. చిరుధాన్యాలు, దుంపలు, గింజధాన్యాలు, పుట్టతేనె, పచ్చి పసుపును వంటల్లో ఎక్కువగా వాడేవారు. కొర్రలు, ఊదలు, అరికలు, సామలతో వంటకాలు చాలా ఉన్నాయి. వీటిని ప్రస్తుత తరం అభిరుచికి తగ్గట్లుగా కూడా తయారు చేస్తున్నా. అలాగే స్ట్రీట్‌ బజార్‌ లాంటి దుకాణాలు అప్పట్లోనూ ఉండేవి. బెల్లంపాకంతో చేసే వేరుశనగ, శనగపప్పు ఉండలు, ఉడకబెట్టిన చిలకడ, కర్రపెండలం వంటి దుంపలను వీధుల్లో విక్రయించేవారు. సైనికులు వాటిని కొనేవారు. ఇదంతా అప్పటి సాహిత్యంలో పొందుపరిచి ఉంది. అలాగే చిక్కుడు జాతి గింజలు, బూడిద గుమ్మడికాయ, మునగ, చిన్న ఉల్లిపాయ, చేమదుంప వంటివి ఎక్కువగా తినేవారు. ఇక, విజయనగరం, ఉత్తర కర్ణాటక, వరంగల్‌, కాంచీపురం, తిరుపతి ప్రాంతాల్లో రాజుల కాలంలోనే ఆలయాల్లో అయిదు రకాల వంటకాలను నైవేద్యాలుగా పెట్టే సంస్కృతి వచ్చింది. అప్పట్లో ఎక్కువగా శాకాహారం తినేవారు. నదీతీరాల్లో మాత్రమే మాంసాహారం కనిపించేది.. చిత్రాన్నం తరహా పదార్థాలు ఎక్కువగా కనిపించేవి. అలాగే కాకతీయుల కాలంలో దాదాపు మాంసాహారానికి పెద్దపీట వేసేవారు. ఇదంతా సంగం సంస్కృతిలోకి వస్తుంది’  అని చెబుతుంది శ్రీబాల.


 

దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఉండే... ఐటీసీ, ఒబెరాయ్‌, ట్రైడెంట్‌, జెడబ్ల్యూ మారియట్‌, ది పార్క్‌ వంటి హోటళ్లు ఏటా నిర్వహించే ఫుడ్‌ ఫెస్టివల్స్‌లలో శ్రీబాల వంటలు ఉండాల్సిందే. వీటి ద్వారా స్వదేశీ, విదేశీయులకు సంగం కాలంనాటి సంస్కృతి, ఆహార అభిరుచుల పట్ల అవగాహన కలిగిస్తోంది. ఈమె తయారుచేసేవాటిలో ప్రత్యేకంగా పెరుం సోరు, సర్వపిండి రొట్టె, ఇడ్డలిగే (ఇడ్లీలు), కొతినాకార్‌, కడై మిళగు పిరటల్‌... నల్ల మిరియాలు, గసగసాలతో చేసే చేపల పులుసు, నల్ల మినపప్పుతో చేసే మాంసం కూర వంటి  ప్రాచీన సంప్రదాయపు వంటకాలెన్నో ఉంటాయి. అలాగే ఆమె...  ‘దక్షిణ భారత పురాతన సంస్కృతికి చెందిన చారిత్రక వంటలు చేసే పాకశాస్త్ర నిపుణురాలు’ అవార్డును అందుకుంది. ఉత్తమ చెఫ్‌గా ప్రశంసలు దక్కించుకుంది. ఇటీవల ఈమె ముంబయిలో చేసిన ‘కొత్తన్‌సోరు’, ‘గ్రామత్తు మీన్‌ కుళంబు’ వంటకాలకు గాను ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ తమిళ్‌ క్యూసిన్‌’ అవార్డును పొందింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.