close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. కాళేశ్వర సంబురం 

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 21న ప్రాజెక్టు స్థలి వద్ద శాస్త్రోక్త క్రతువులు, ఊరూరా సంబురాలు జరపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్లు హాజరవుతున్న ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేయనున్నారు.ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద మొదటి పూజ, హోమ క్రతువు ఉంటాయి. తర్వాత కన్నెపల్లి పంపుహౌజ్‌ ప్రారంభోత్సవం ఉంటుంది. కన్నెపల్లి పంపుహౌజ్‌ వద్ద తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు మూడు పంపులకు స్విచ్‌ఆన్‌ చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

2. మోదీ మనసు కరిగించండి 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన ప్రయత్నాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముమ్మరం చేశారు. శనివారం ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కావడానికి శుక్రవారం సాయంత్రం దిల్లీ వచ్చిన ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సుమారు 30 నిమిషాలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు, విభజన చట్టంలోని అంశాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అమిత్‌షాను కలిసి లేఖ ఇచ్చాం. హోదా అవసరం ఎంత ఎక్కువ ఉందో వివరించాం. రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కచ్చితంగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు కావాలని విజ్ఞప్తి చేశాం’’ అని జగన్ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

3. దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు

భౌతిక దాడులను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌లో ఆరంభమైన వైద్యుల సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. నాలుగో రోజుకు చేరిన ఈ ఆందోళన దేశంలోని ఇతర ప్రాంతాలకూ పాకుతోంది. అనేక రాష్ట్రాల్లో వైద్యులు వీరికి సంఘీభావం తెలుపుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భారత వైద్య సంఘం (ఐఎంఏ) శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. సోమవారం 24 గంటల పాటు సాధారణ సేవలను బహిష్కరించనున్నట్లు తెలిపింది. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిపై జరిగే హింసను నిరోధించడానికి చట్టాన్ని రూపొందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

4. ఆర్టీసీ విలీనంపై 3 నెలల్లో నివేదిక

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో ఎలా విలీనం చేయాలనే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు విశ్రాంత ఐపీఎస్‌ సి.ఆంజనేయరెడ్డి నేతృత్వంలో ఆరుగురితో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. ఆర్థిక, రవాణా శాఖల మంత్రులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, పేర్ని వెంకట్రామయ్య (నాని)లకు ఎప్పటికప్పుడు అధ్యయన పురోగతిని వివరించాలని, వారి సూచనలను తీసుకోవాలని కమిటీకి సూచించింది. ఆ తర్వాతే తుది సిఫారసులతో మూడు నెలల్లోగా నివేదిక రూపొందించాలని ఆదేశించింది. అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను నిర్దేశించింది. ఈ కమిటీకి సాయంగా ఉండేందుకు అవసరమైతే కొంతమంది నిపుణులను సభ్యులుగానూ చేర్చుకోవచ్చని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

5. ఉద్యోగాల వృద్ధి ఎలా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ముందస్తు బడ్జెట్‌ చర్చల్లో భాగంగా తాజాగా ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. 2019-20 సాధారణ బడ్జెట్‌లో ఏ అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలనే దానిపై ఆమె ఇప్పటికే పలు వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె ఆర్థికవేత్తలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఉద్యోగాలతో కూడిన వృద్ధి సాధించడం ఎలా? స్థూల ఆర్థిక స్థిరత్వం దిశగా ఎలాంటి అడుగులు వేయాలి? ఆర్థిక నిర్వహణలో భాగంగా ప్రభుత్వ రంగ రుణాలు ఏ మేరకు ఉండాలి? పెట్టుబడులు ఎలా పెంచాలి? తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

6. వైకాపా దాడులకు ప్రభుత్వానిదే బాధ్యత 

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు పెరిగిపోవడం ఆందోళనకరమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దాడులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం విజయవాడలో జరిగిన తెదేపా రాష్ట్ర స్థాయి సమావేశంలో చంద్రబాబు ‘ఎన్నికల తరువాత కార్యకర్తలపై దాడులు- దౌర్జన్యాలు’ అంశంపై చర్చించారు. మృతులకు నివాళిగా కొద్ది సమయం మౌనం పాటించారు. ‘ తెదేపా కార్యకర్తలపై దాడులు జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వైకాపా ప్రోద్బలంతోనే దాడులు జరుగుతున్నందున వాటి నియంత్రణ బాధ్యత ఆ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌పై ఉంది’’ అని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

7. భారత్‌కు అధునాతన ఆయుధాలు

అధునాతన పరిజ్ఞానం, ఆయుధాలను అందించడం ద్వారా భారత రక్షణ అవసరాలను తీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికాలోని డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు పేర్కొంది. అయితే రష్యా నుంచి ఎస్‌-400 దీర్ఘశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయరాదని మెలిక పెట్టింది. ఆ వ్యవస్థను కొంటే తమ మైత్రి పరిమితంగానే కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఎస్‌-400 వ్యవస్థ కొనుగోలు వల్ల భారత్‌-అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం తప్పదని ట్రంప్‌ సర్కారులోని సీనియర్‌ అధికారి ఒకరు ఇప్పటికే హెచ్చరిక చేసిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

8. 18న మంత్రిమండలి సమావేశం

తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన భారీ ఎజెండాతో ఈ భేటీని నిర్వహిస్తున్నారు. మంత్రిమండలి సమావేశాన్ని గత నెల 28నే జరపాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ, ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వాయిదా వేసింది. చివరిసారిగా మంత్రిమండలి భేటీ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరిలో జరిగింది.  అప్పటి నుంచి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

9. బెలగం భీమేశ్వరరావుకు బాల సాహిత్య పురస్కారం 

కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్‌-2019, యువ పురస్కార్‌-2019లను ప్రకటించింది. త్రిపుర రాజధాని అగర్తలలో శుక్రవారం అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ చంద్ర శేఖర కంబారా అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఆంగ్లం, హిందీతో పాటు ప్రాంతీయ భాషలకు సంబంధించి 22 మంది రచయితలను బాల సాహిత్య పురస్కారాలకు, 23 మందిని యువ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు భాషలో బాల సాహిత్య పురస్కార్‌-2019కు రచయిత బెలగం భీమేశ్వరరావు ఎంపికయ్యారు. ఆయన రచన ‘తాత మాట వరాల మూట’ చిన్న కథలు పుస్తకానికి గాను ఈ పురస్కారం దక్కింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

10. ఉగ్రవాద దేశాలే జవాబుదారీ

ఉగ్రవాదానికి ప్రాయోజకత్వం వహిస్తున్న, సహకరిస్తున్న, నిధులు సమకూర్చుతున్న దేశాలను ప్రపంచానికి జవాబుదారీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సమస్యపై చర్చించడానికి ప్రపంచవ్యాప్త సదస్సు ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం ఇక్కడ షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో ప్రసంగిస్తూ పాకిస్థాన్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఈ సదస్సులో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పాల్గొనగా, ఆయన సమక్షంలోనే ఈ విమర్శలు చేయడం గమనార్హం. ఈ విషయంలో ఎస్‌సీఓ నాయకులు చొరవ తీసుకోవాలని కోరారు. సహకారాన్ని బలోపేతం చేయడం, ఉగ్రవాదాన్ని నిరోధించడమే ఎస్‌సీఓ ఆశయాలని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.