close

తాజా వార్తలు

రుణం కావాలా నాయనా!

సైబర్‌ నేరస్థుల బురిడీ మంత్రం
పన్నుల పేరిట వసూళ్ల పర్వం
ఈనాడు, హైదరాబాద్‌

ఉప్పల్‌కు చెందిన వ్యాపారికి శుక్లా పేరుతో ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. బజాజ్‌ ఫైనాన్స్‌ సంస్థ నుంచి రూ.15 లక్షల ప్రీ అప్రూవ్డ్‌ రుణం మంజూరైందని శుక్లా చెప్పాడు. మీరు బజాజ్‌ సంస్థ విలువైన ఖాతాదారు కావడంతో రుణం సులభంగా దొరుకుతుందని ఆశ పెట్టాడు. నిజమేనని నమ్మిన వ్యాపారి ఈ నెల 3-7 తేదీల మధ్య పలు విడతలుగా శుక్లాతో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ప్రాసెసింగ్‌ రుసుం కట్టాలంటూ బురిడీ మంత్రం ప్రయోగించడంతో నమ్మిన వ్యాపారి మూడు దఫాలుగా రూ.1.22 లక్షలు చెల్లించారు. మరో రెండు రోజుల అనంతరం మళ్లీ ఫోన్‌ చేసిన శుక్లా.. జీఎస్టీ కింద మరో రూ.92,500 కట్టాలని అడగడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. ఈక్రమంలో సోమాజిగూడలోని బజాజ్‌ ఫైనాన్స్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి విచారించారు.

అతడి పేరుతో రుణం ఇస్తున్న దాఖలాలేవీ లేవని నిర్వాహకులు చెప్పారు. తాను మోసపోయానని గ్రహించిన వ్యాపారి రెండు రోజుల క్రితం రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్‌ నేరస్థులు అదే పనిగా ప్రయోగిస్తున్న బురిడీ మంత్రాలకు బాధితులు బలవుతూనే ఉన్నారు. బాధితుడి ఉద్దేశాలను పసిగట్టి మరీ టోకరా వేస్తున్నారు. అంతర్జాలం, సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌ లావాదేవీలు... ఈ తరహా వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచుతూ బాధితులకు వలేస్తున్నారు. ఇందులో రుణం ఇస్తామంటూ చేసే మోసాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తొలుత రుణాలు ఇప్పిస్తామని ఆశపెడుతూ బాధితుల్ని ముగ్గులోకి లాగుతున్నారు. ఇందుకోసం తర్ఫీదు పొందిన కాల్‌సెంటర్‌ ఉద్యోగుల్ని రంగంలోకి దింపుతున్నారు. బాధితులకు ఏమాత్రం అనుమానం రాని రీతిలో వీరు వలేస్తున్నారు. తొలుత కొన్ని వివరాలు అడిగి, ఆ తర్వాత బాధితుడికి నమ్మకం కుదిరిందని తేల్చుకున్నాక అసలు పని మొదలుపెడతారు. ప్రాసెసింగ్‌ రుసుం కొంత కట్టాలని మొదలుపెట్టి రకరకాల పన్నుల పేరుతో వసూళ్లకు తెర లేపుతున్నారు. మొదట ఎంతో కొంత కట్టిన బాధితుడు ఈసారైనా పనై పోతుందనే ఆశతో మోసగాళ్ల మాయమాటలకు బలవుతున్నారు. పలు దఫాలుగా డబ్బు కట్టినా ఇక పని కావడం లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత గట్టిగా నిలదీస్తున్నారు. బాధితుడు అలా నిలదీసేసరికి అసలు రంగు బయటపడి పోతోంది. ఆ వెంటనే మోసగాళ్లు అప్పటివరకు మాట్లాడిన ఫోన్లను స్విచ్‌ఆఫ్‌ చేసేస్తున్నారు. అప్పటికిగానీ తాము మోసపోయామని బాధితులు గుర్తించలేక పోతున్నారు. పోలీసులు కేసులైతే దర్యాప్తు చేస్తున్నారు కానీ.. బాధితులు పోగొట్టుకున్న సొమ్ము మాత్రం తిరిగి రావడం కనాకష్టంగా మారిపోతోంది.

ఉత్తరాది కేంద్రంగా...
హైదరాబాద్‌ మహా నగర పౌరులను లక్ష్యంగా చేసుకొని వలేస్తున్న సైబర్‌ నేరస్థుల్లో ఎక్కువ మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే ఉంటున్నారు. రాజస్థాన్‌ భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన ముఠాలు పలు మోసాలకు పాల్పడుతున్నాయి. దిల్లీ కేంద్రంగా కాల్‌సెంటర్‌ ఫోన్ల మోసాలు.. జాంతారా కేంద్రంగా ఓటీపీ, లాటరీ మోసాలు.. ఇలా పలు రకాల మోసాల వెనక ఉత్తరాది ముఠాలే ఉంటున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంçËనే బ్యాంకు ఖాతాలకు బదిలీ అయిన లావాదేవీలతోపాటు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మోసగాళ్ల ఆనవాళ్లను సైబర్‌క్రైం పోలీసులు కనిపెట్టేస్తున్నారు.  ఉత్తరాది ముఠాలను అక్కడికి వెళ్లి పట్టుకురావడం సమస్యగా మారింది. సైబర్‌క్రైం పోలీస్‌ బృందాలు అక్కడికి వెళితే స్థానిక పోలీసుల నుంచి సరైన సహకారం లభించక పోవడం.. ఒకవేళ నిందితుల గురించి వారి ఊరికెళితే అక్కడ అందరూ నేరస్థులే ఉండటం, నిందితుడి గురించి స్థానికులు చెప్పకపోవడం లాంటి కారణాలతో అరెస్ట్‌ చేయడం కష్టంగా మారుతోంది. ఒకవేళ నానా ఇబ్బందులు పడి నిందితుల్ని పట్టుకొచ్చినా బాధితుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును అప్పటికే ఖర్చు చేశామని చేతులు పైకెత్తుతున్నారు. కొన్ని రోజులు కారాగారంలో మగ్గి బెయిల్‌పై వెళ్లి పోతున్నారు. అలా వెళ్లినవారు తిరిగి న్యాయస్థానానికి హాజరు కావడం లేదు. అలాంటి వారిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ అయినా అక్కడికి వెళ్లి పట్టుకురావడం మరో పెద్ద సమస్యగా మారుతోంది. అందుకే ఇలాంటి మోసగాళ్లు చేసే ఫోన్లకు, మెయిళ్లకు, వాట్సప్‌ సందేశాలకు చిక్కకుండా ఉండటమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.