close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9AM

1. నేడు కొత్త లోక్‌సభ కొలువు 

మరికొన్ని గంటల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీరేంద్ర కుమార్‌చే ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఆయన లోక్‌సభకు ఎన్నికయిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సోమ, మంగళవారాల్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. నేటి నుంచే 119 కొత్త బీసీ గురుకులాలు 

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ గురుకులాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకుల పాఠశాలల ఆరంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటిని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సోమవారం అధికారికంగా ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన వాటితో కలిపి బీసీ గురుకులాల సంఖ్య 281కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు గృహవసతి 

తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు, మండలి సభ్యులకు, వారి సహాయకులు, సిబ్బంది కోసం రాజధాని హైదరాబాద్‌లో అత్యాధునిక వసతులతో నిర్మించిన నివాస గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు హైదర్‌గూడలో జరిగే ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. 4.26 ఎకరాల విస్తీర్ణంలో రూ. 166 కోట్లతో ఈ నివాస సముదాయాన్ని నిర్మించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. నేడు ఓపీ సేవలు బంద్‌ 

కోల్‌కతాలో జూనియర్‌ వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా ఐఎంఏ (ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌) ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి. గత మూడురోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ధర్నాలు, నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వీరికి సంఘీభావంగా మరిన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది నిరసనలు చేపట్టనున్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చి ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. పోలీసుశాఖలో 19 రకాలుగా వారాంతపు సెలవు

ఏపీలో పని చేస్తున్న పోలీసు సిబ్బందికి 19 రకాల పద్ధతుల్లో వారాంతపు సెలవును అమలు చేయొచ్చని ఈ అంశంపై ఏర్పాటైన అధ్యయన కమిటీ తేల్చింది. పోలీసుశాఖలోని వివిధ విభాగాలు, వాటిలో పనిచేసే సిబ్బంది పని స్వభావం (వర్క్‌నేచర్‌), పని వేళలు, ఆ విభాగంలో అందుబాటులో ఉన్న సిబ్బంది తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో విభాగానికి ఒక్కో తరహా విధానాన్ని సిద్ధం చేసింది. కానిస్టేబుల్‌ నుంచి ఎస్సై స్థాయి వరకూ ఉన్న సిబ్బందికి ఈ వారాంతపు సెలవుల విధానాన్ని వర్తింపజేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. సౌరవిద్యుత్‌ రాయితీల నిలిపివేత 

ఇళ్లు, కార్యాలయాలు, సంస్థల భవనాలపై(రూఫ్‌టాప్‌) సౌరవిద్యుత్‌ ఏర్పాటుకిచ్చే రాయితీలను ‘తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ’(టీఎస్‌ రెడ్కో) తాజాగా నిలిపివేసింది. గత నెల 15 వరకూ తీసుకున్న దరఖాస్తులకే రాయితీలిస్తామని పేర్కొంటూ ఆ తరువాత దరఖాస్తుల స్వీకరణ నిలిపివేసింది. ఇంతకాలం భవనంపై ఏర్పాటుచేసే సౌరవిద్యుత్‌ ఫలకాలకయ్యే వ్యయంలో 30 శాతం వరకూ కేంద్రం రాయితీ ఇచ్చేది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కేంద్రం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాయితీలపై ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. దీంతో రాయితీని నిలిపివేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

7. టోల్‌ ధరలకు రెక్కలు?

ప్రస్తుతం అమల్లో ఉన్న టోల్‌ వ్యవస్థను సమూలంగా మార్చివేయాలని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)తో కలిసి ప్రస్తుతం ఉన్న టోల్‌ వ్యవస్థను చక్కదిద్దేందుకుగాను కొత్త ముసాయిదా విధానాన్ని రూపొందించే పనిని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బీసీజీ) అనే సలహా సంస్థకు అప్పగించింది. ప్రస్తుతం జాతీయ రహదారుల టోల్‌ కేంద్రాల్లో ఉన్న రేట్లను సవరించడంతో పాటు వాహనాలను పునర్వర్గీకరించే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రైవేట్‌ కార్ల టోల్‌ ధరలు పెరిగే అవకాశముందని కూడా సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కువైట్‌ సిటీలో 63 డిగ్రీల ఉష్ణోగ్రత? 

కువైట్‌ రాజధాని కువైట్‌ సిటీలో ఈనెల 8న ఉష్ణోగ్రత.. 63 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందట! నేరుగా ఎండలో ఈ ఉష్ణోగ్రత ఉండగా.. నీడలో 52.2 డిగ్రీలు ఉందని ‘గల్ఫ్‌ న్యూస్‌’ ఇటీవల ప్రకటించింది. అదేరోజున సౌదీ అరేబియాలోని అల్‌ మజ్మా నగరంలో 55 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కూడా తెలిపింది. అయితే.. ఈ వివరాలు ఇంతవరకు నిర్ధరణ కాలేదు. కాలిఫోర్నియాలోని ఫర్నేస్‌ క్రీక్‌ రాంచ్‌లో గల డెత్‌ వ్యాలీలో 1913 జులై 10వ తేదీన నమోదైన 56.7 డిగ్రీలే ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డులలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అట్టుడికిన హాంకాంగ్‌

చైనాకు నేరస్థులను అప్పగించే బిల్లును వ్యతిరేకిస్తూ వరుసగా రెండో ఆదివారమూ హాంకాంగ్‌ వీధుల్లో లక్షల మంది ప్రజలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనతో హాంకాంగ్‌ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రజల్లో రోజురోజుకి పెరుగుతున్న ఆగ్రహావేశాల నేపథ్యంలో.. నేరస్థుల అప్పగింత బిల్లును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు హాంకాంగ్‌ ముఖ్య కార్యనిర్వహణ (సీఈవో) అధికారి కేరీ లామ్‌ ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలను తప్పుగా అర్థం చేసుకున్నానంటూ వారికి క్షమాపణలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. పాక్‌పై కొనసాగిన జైత్రయాత్ర

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ జైత్రయాత్ర నిరాటంకంగా సాగిపోయింది. ఈ మెగా టోర్నీలో ఆ జట్టుపై ఓటమే ఎరుగని టీమ్‌ఇండియా.. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం ఏకపక్ష మ్యాచ్‌లో భారత్‌ 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట రోహిత్‌ శర్మ (140) సూపర్‌ సెంచరీకి.. కోహ్లి (77), రాహుల్‌ (57) సమయోచిత అర్ధశతకాలు తోడవడంతో మొదట భారత్‌ 5 వికెట్లకు 336 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం పాక్‌ ఇన్నింగ్స్‌ మధ్యలో వర్షం పడటంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా సవరించారు. పాక్‌ 6 వికెట్లకు 212 పరుగులకే పరిమితమైంది. రోహితే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.