close

తాజా వార్తలు

ప్రైవేటు సైన్యం.. ఇష్టారాజ్యం!

కండబలంతో రెచ్చిపోతున్న బౌన్సర్లు
అనుమతి లేకుండా సొంత డ్రెస్‌కోడ్‌
ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌

నిలువెత్తు ఆకారం.. తీక్షణంగా చూసేకళ్లు.. ప్రవేశ ద్వారాల వద్ద నిఘా.. అప్రకటిత భద్రతావలయంలో విధులు.. వీవీఐపీలు.. సినీ తారల కార్యక్రమాల్లో రక్షణ కవచాలు.. ప్రజలు.. అభిమానులు.. వినియోగదారులపై నిర్లక్ష్య వైఖరి... ప్రశ్నిస్తే పిడిగుద్దులతో సమాధానాలు.. హైదరాబాద్‌ నగరంలో బౌన్సర్లంటే వెంటనే గుర్తొచ్చే లక్షణాలివి. పబ్బులు.. బార్లు.. పంచతార హోటళ్లు.. షాపింగ్‌మాల్స్‌.. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు.. సినీతారలకు వ్యక్తిగత భద్రత వంటి విధులు నిర్వహిస్తున్న బౌన్సర్లు ఇష్టారాజ్యంగా ప్రవరిస్తున్నారు. పబ్బులు.. బార్లకు వెళ్లే యువకులతో శ్రుతిమించి వ్యవహరిస్తూ చితకబాదుతున్నారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల వద్ద ఏదైనా సమస్యలపై విద్యార్థులు.. విద్యార్థిసంఘాల ప్రతినిధులు నిరసనలు వ్యక్తం చేస్తే చేయి చేసుకొంటున్నారు. చట్టానికి అతీతంగా వీరి తీరు ఉంటోంది. బౌన్సర్లు  టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల్లా సఫారీ దుస్తులు ధరిస్తుండటంతో ప్రజలు, యువకులు  పోలీసులే అనుకుంటున్నారు. నిబంధనల ప్రకారం భద్రతా సిబ్బంది ఎవరైనా  పోలీసుల్లా దుస్తులు ధరించాలంటే ఆయుధ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. పోలీస్‌ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలు, పబ్బులు, బార్లు, హోటళ్లల్లో పనిచేస్తున్న బౌన్సర్లు పోలీసుల్లా దుస్తులు వేసుకుని వారిలాగే ప్రవర్తిస్తున్నారు.

హడావుడి.. అహంకారం..
ప్రముఖులు, సినీతారలు, రాజకీయ నాయకులు పాల్గొనే కార్యక్రమాల్లో బౌన్సర్లు విపరీతంగా హడావుడి చేస్తున్నారు. షాపింగ్‌మాల్స్‌ ప్రారంభోత్సవాలు, వజ్రాభరణాల దుకాణాల్లో కొత్త ఆవిష్కరణలు, ఆడియో ఫంక్షన్లలో వీరి దూకుడుకు పగ్గాలే ఉండవు. ప్రజలు, అభిమానులు ముఖ్య అతిథులను కలుసుకునేందుకు ముందుకు వస్తే ఏ మాత్రం కనికరం లేకుండా కొడుతుంటారు. ముఖ్య అతిథులు పిలుస్తున్నా సరే.. అభిమానులు, వినియోదారులను దగ్గరకు రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఇటీవల బంజారాహిల్స్‌లో ఓ సినీ తార వస్త్రదుకాణాన్ని ప్రారంభించేందుకు వచ్చింది. ఆమెను చూడాలన్న ఉత్సాహంతో అభిమానులు ముందుకు రాగా.. బౌన్సర్లు విచక్షణారహితంగా రోడ్డుపైకి నెట్టేశారు. మీడియా ప్రతినిధులపైనా దాడి చేశారు. కూకట్‌పల్లిలో కొద్దినెలల క్రితం సినీ నటుడు మహేష్‌ బాబు ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడికి వచ్చిన యువత ఆయన్ను కలుసుకునేందుకు యత్నించిగా...  బౌన్సర్లు వారిపై చేయిచేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.

ఇవి కొన్ని ఘటనలు..
* బంజారాహిల్స్‌లోని రివోల్ట్‌ పబ్‌లో ఆదివారం అర్ధరాత్రి బౌన్సర్లు, ఇద్దరు మేనేజర్లు ఓ బ్యాంకు ఉద్యోగిని విపరీతంగా కొట్టారు. బిల్లు చెల్లించేందుకు ఆలస్యం చేసినందుకు దాడి చేశారు. సదరు బ్యాంకు ఉద్యోగి బంజారాహిల్స్‌ పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
* సెయింట్‌ మేరీస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు కొద్దినెలల క్రితం తమ ఫీజులు ఎప్పుడు చెల్లించాలో తెలుసుకునేందుకు కళాశాలకు వెళ్లారు. కళాశాల కార్యకలాపాల సమయంలో కాకుండా వేరే సమయంలో వచ్చారంటూ బౌన్సర్లు అడ్డగించారు. అధికారులతో అనుమతి తీసుకున్నామని చెప్పినా వినకుండా చితకబాది   వెనక్కుపంపించారు. డబీర్‌పురా పోలీస్‌ ఠాణాలో కేసు నమోదైంది.
* పంజాగుట్ట ఠాణా పరిధిలో 8 నెలల క్రితం ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. స్నేహితులతో క్లబ్‌ 8 పబ్‌కు వెళ్లాడు. భోజనం చేసి బయటకు వెళ్తూ... ఆలస్యంగా ఆహార పదార్థాలు సర్వ్‌ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసినందుకు బౌన్సర్లు వెంటనే నలుగురిపై దాడి చేశారు.
* 2017 డిసెంబరులో సోమాజిగూడలోని ఓ ప్రముఖ హోటల్‌కు నిజామాబాద్‌కు చెందిన సందీప్‌వర్మ.. స్నేహితులతో మద్యం తాగేందుకు వచ్చాడు. రాత్రిళ్లు మద్యం సరఫరా చేయబోమని హోటల్‌ ప్రతినిధులు చెప్పారు. సందీప్‌ వర్మ వెనక్కు వెళ్తుండగా.. అప్పుడే కొందరు యువకులు బార్‌లోపలికి వెళ్లారు. వారికి సిబ్బంది మద్యం సరఫరా చేశారు. వారికి ఎందుకు ఇచ్చారు..? మాకెందుకు ఇవ్వలేదు...? అంటూ మేనేజర్‌ను ప్రశ్నిస్తుండగా బౌన్సర్లు వచ్చి సందీప్‌ వర్మ, అతడి స్నేహితులను కొట్టారు.

ధనాధన్‌... ఫటాఫట్‌..
అర్ధరాత్రి వరకూ కొనసాగే బార్‌ అండ్‌ రెస్టారెంట్లు.. పబ్బుల్లో విధుల్లో ఉండే బౌన్సర్లు ఆయా యాజమాన్యాల మెప్పు పొందేందుకు శ్రుతిమించుతున్నారు. విందు, వినోదాలు, పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు వచ్చిన వారు ఉత్సాహంగా అరిచినా..  ఆహారపదార్థాలు ఆలస్యంగా తెచ్చారంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినా..  బిల్లు ఎక్కువగా వేశారు... ఎందుకు వేశారు..?  అంటూ సిబ్బందిని ప్రశ్నించినా వెంటనే బౌన్సర్లు ప్రత్యక్షమై  దాడికి దిగుతున్నారు. యాజమాన్య ప్రతినిధుల సమక్షంలోనే ముఖంపైన పిడిగుద్దులు గుద్ది వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. నగదు లేని పక్షంలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు బలవంతంగా లాక్కుని బిల్లు చెల్లించాక ఆ కార్డులను తిరిగి ఇస్తున్నారు. అనంతరం వారిని బలవంతంగా బయటకు గెంటేస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.