close

తాజా వార్తలు

యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి మరీ బురిడీ

ఎల్‌బీనగర్‌ వాసి బ్యాంకు ఖాతాల నుంచి రూ.1.76 లక్షలు  మాయం
ఈనాడు, హైదరాబాద్‌

సైబర్‌ నేరాల్లో సరికొత్త బురిడీ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో బహిర్గతమైంది. ‘ఎనీ డెస్క్‌’ యాప్‌తో బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టే నేరాలు ఇటీవలికాలంలో  వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎల్‌బీనగర్‌ వాసిని సైబర్‌ నేరస్థులు ఇదే తరహాలో మోసం చేసి    రూ.1.76 లక్షల్ని కొల్లగొట్టారు. బాధితుడి చరవాణిలోకి చొరబడి నాలుగు బ్యాంకు ఖాతాల వివరాల్ని తస్కరించి ఈ నేరానికి పాల్పడ్డారు.

నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబరుతో వల
ఎల్‌బీనగర్‌వాసి ఒకరు (43) ఈనెల 11న తన క్రెడిట్‌కార్డు బిల్లు రూ.23 వేలను ఫోన్‌పే యాప్‌ ద్వారా చెల్లించారు. క్రెడిట్‌కార్డు ఖాతాలో ఆ డబ్బు జమ కాకపోవడంతో మరుసటి రోజు ఫోన్‌పే యాప్‌ కస్టమర్‌కేర్‌కు ఫోన్‌ చేసేందుకు అంతర్జాలంలో నంబరు కోసం వెతికారు. సైబర్‌ నేరగాళ్లు నకిలీ కస్టమర్‌కేర్‌ నంబరును అంతర్జాలంలో నమోదు చేసిన విషయం తెలియని బాధితుడు..ఆ నంబరుకు ఫోన్‌ చేశారు. అదే అదనుగా ‘ఎనీడెస్క్‌’ యాప్‌ను చరవాణిలో నిక్షిప్తం చేయాలని అవతలి వ్యక్తి సూచించాడు. అలా చేసిన బాధితుడికి అదే రోజు 0629104221 నంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. ఎనీడెస్క్‌ యాప్‌ ద్వారా వచ్చే లింక్‌ నంబర్లను తాను సూచించే చరవాణులకు బదిలీ చేయాలని నేరస్థుడు చెప్పడంతో అలాగే చేశారు. తర్వాత సంక్షిప్త సందేశం రూపంలో ఓ ఐడీ నంబరు బాధితుడి చరవాణికి వచ్చింది. దానినీ తాను చెప్పిన చరవాణికి పంపించాలనే నేరస్థుడి సూచనను బాధితుడు పాటించారు. అనంతరం కొద్దిసేపటికే అయిదుబ్యాంకు ఖాతాల నుంచి డబ్బు మాయమైపోయింది. ఆంధ్రా బ్యాంకు ఖాతా నుంచి రూ.1.3 లక్షలు, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రూ.24వేలు, ఎస్‌బీఐ నుంచి రూ.12వేలు, ఐసీఐసీఐ నుంచి రూ.10వేలు మోసగాడి బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యాయి. విషయం గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యాప్‌ చొరబడితే అంతే..
అంతర్జాల సదుపాయం కలిగిన ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఎనీడెస్క్‌ యాప్‌ను నిక్షిప్తం చేస్తే ఇక అంతే సంగతులు అని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ యాప్‌ ఏ ఫోన్‌లో ఉంటుందో.. అందులోని సమస్త సమాచారాన్ని సైబర్‌ నేరస్థులు ఎక్కడో ఉండి వీక్షించే వీలు కలుగుతుంది. ఈక్రమంలో బాధితుల ఫోన్‌లోని బ్యాంకు ఖాతాల వివరాలతోపాటు ఆన్‌లైన్‌ బ్యాంకు లావాదేవీల క్రమంలో చరవాణికి వచ్చే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌లూ నేరస్థులకు కనిపిస్తాయి. అందుకే ఆ యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ చరవాణిలో నిక్షిప్తం చేయరాదని పోలీసులు సూచిస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.