close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ఏపీ అసెంబ్లీలో రుణమాఫీపై వాగ్యుద్ధం

రుణమాఫీ అంశంపై ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. తెదేపా సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘‘2014 ఎన్నికలకు ముందు దేశంలో ఎక్కడా కూడా రుణమాఫీ అనే పదం లేదు. వ్యవసాయం మీద తీసుకున్న రుణాలు మాఫీ  చేస్తామని చెప్పాం. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాక్‌ సహకరించకపోయినా..కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. ఒక్కో రైతుకు రూ.1.50లక్షల వరకు రుణమాఫీ చేశాం. ఈ దేశంలో రుణమాఫీ చేయలేమని చెప్పి చాలా ప్రభుత్వాలు, పార్టీలు మాట్లాడాయి. కానీ, చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేసి చూపించారు’’ పేర్కొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ..రుణమాఫీ విషయంలో విశ్వసనీయత కోల్పోవడం వల్లే తెదేపా ప్రతిపక్షంలో కూర్చుందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. లోక్‌సభ తదుపరి స్పీకర్‌గా ఓం బిర్లా!

పదిహేడో లోక్‌సభ స్పీకర్‌గా రాజస్థాన్‌లోని కోటా ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యే అవకాశాలు కన్నిస్తున్నాయి. స్పీకర్‌ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 17వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత నూతన ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. ఈ రోజు కూడా నూతన ఎంపీల ప్రమాణస్వీకారాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ లాబీల్లో మంగళవారం ఉదయం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీచేసిన నారా లోకేశ్‌, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎదురుపడి కరచాలనం చేసుకున్నారు. తెదేపా ఎమ్మెల్సీ లోకేశ్‌ టీడీఎల్పీ కార్యాలయం వైపు వెళ్తుండగా .. ఎదురుపడిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పల కరించారు. ఇరువురూ నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సీఎం రమేశ్‌, విజయసాయి సుదీర్ఘ మంతనాలు

లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన వైకాపా నేత విజయసాయిరెడ్డి, తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌లు పక్కపక్కనే కూర్చొని సుదీర్ఘ మంతనాలు జరపడం ఆకర్షించింది. తొలుత సీఎం రమేశ్‌ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉండగా, విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకొని కొద్దిసేపు ఎవరి సీట్లలో వారే కూర్చుండి పోయారు. తర్వాత విజయసాయిరెడ్డి ముందు వరుసకు వచ్చి సీఎం రమేశ్‌ పక్కన కూర్చొన్నారు. దాదాపు గంటన్నరకుపైగా వారిద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దేశభక్తిని చాటిన మందు బాబులు

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన భారత్‌ X పాక్‌ మ్యాచ్‌లో కోహ్లేసేన 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఆలపించిన జాతీయగీతానికి హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో మందుబాబులు లేచి నిలబడి దేశభక్తిని చాటుకున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. సహజంగా ఏ ఆట ప్రారంభానికి ముందైనా ఆయా జట్ల జాతీయ గీతాన్ని ఆలపించడం సాధారణ విషయమే. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న వాళ్లు లేచి నిలబడి ఆటగాళ్లతో పాటు గీతాన్ని ఆలపిస్తారు. ఇక టీవీల ముందు ఉన్న వారు సైతం నిలబడి తమ దేశభక్తిని చాటుకుంటుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పార్టీ మారడం లేదు: జేసీ దివాకర్‌రెడ్డి

‘నేను పార్టీ మారడం లేదు.. రాజకీయాల్లో నుంచి విరమించా అంటే భాజపాలో చేరతానని మీరెలా అడుగుతారు?’ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విలేకరులను ఉద్దేశించి అన్నారు. సచివాలయంలో సోమవారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. కొంతమందితో భాజపా టచ్‌లో ఉందనేది వాస్తవమని, అయితే వాళ్లెవరూ తనను సంప్రదించలేదన్నారు. భాజపా బలోపేతం కోసం ఆ పార్టీ నేతలు ప్రయత్నం చేయడం తప్పు కాదని జేసీ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎనిమిదేళ్లలో చైనాను దాటనున్న భారత జనాభా

వచ్చే ఎనిమిదేళ్లలో చైనాను దాటేసి భారత్‌ అత్యధిక జనాభా గల దేశంగా నిలుస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. అప్పటి నుంచి దశాబ్దం చివరి వరకు అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ కొనసాగనుందని చెబుతోంది. 2019 నుంచి 2050 మధ్య దేశ జనాభా మరో 27.3కోట్లు పెరిగే అవకాశముందని ఐరాస తాజా నివేదికలో పేర్కొంది. ‘ది వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌ 2019: హైలైట్స్‌’ పేరుతో ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.7 బిలియన్లు ఉండగా.. 2050 నాటికి రెండు బిలియన్లు పెరిగి 9.7 బిలియన్లకు చేరనుందని ఐరాస అంచనా వేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అంబానీపై చైనా ఒత్తిడి..!

అనిల్‌అంబానీకి చెందిన ఆర్‌కామ్‌కు అతిపెద్ద రుణదాతగా చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నిలిచింది. నిన్న ఆర్‌కామ్‌ దివాల ప్రక్రియలో భాగంగా రుణదాతల జాబితాను విడుదల చేసింది. ఇక మిగిలిన బ్యాంకులతో కలిపి మొత్తం 2.1బిలియన్‌ డాలర్లను చైనాకు చెందిన బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని ఆయా బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఆర్‌కామ్‌ చెల్లించాల్సిన అప్పుల విలువ రూ.57,382 కోట్లుగా ఈ జాబితాలో పేర్కొన్నారు. చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకుకు రూ.9,860 కోట్లు చెల్లించాలి. ఎక్సిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ.3,360 కోట్లు, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ.1,554 కోట్లు చెల్లించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చైనాలో భూకంపం.. 12 మంది మృతి

చైనాలో భూకంపం సంభవించింది. సిచువాన్ ప్రావిన్స్‌లో మంగళవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు అయ్యిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 134 మందికి తీవ్ర గాయాలయ్యాయని స్థానిక మీడియా పేర్కొంది. పలు ప్రముఖ హోటళ్లు, కార్యాలయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం అర్ధరాత్రి సుమారు 30నిమిషాల వ్యవధిలో పలుసార్లు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బాబు.. ఇక మీ నాన్న లేరురా!

ముష్కరుల మారణకాండలో తన తండ్రి వీరమరణం పొందాడని తెలసుకోలేని ఓ చిన్నారిని ఎత్తుకొని కన్నీటిపర్యంతమైన మరో ఉన్నతాధికారి చిత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. వివరాల్లోకి వెళితే.. జమ్ముకశ్మీర్‌లో జూన్‌ 12న భద్రతాబలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో అనంతనాగ్‌లోని సర్దార్‌ పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అర్షద్‌ ఖాన్‌ ఒకరు. తీవ్ర గాయాలపాలైన అర్షద్‌ దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.