close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. ప్యాకేజీ వద్దు హోదా కావాలి: జగన్‌
ప్రత్యేక హోదా అంశంపై ఏపీ సీఎం జగన్‌ శాసనసభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ‘‘నీతిఆయోగ్‌లో ప్రధాని, కేంద్రమంత్రిమండలి సమక్షంలో ఇదే కాపీ చదివినిపించా. విభజనతో రాష్ట్రం అన్నిరంగాల్లో నష్టపోయింది. విభజన నష్టాలను ప్రత్యేక హోదా ద్వారానే పూడ్చుకోవచ్చు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి. హోదా వస్తేనే రాయితీలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా జీవనాడి అయినందున జాప్యంలేకుండా వెంటనే ఇవ్వాలని ఐదు కోట్లమంది ప్రజల తరఫున ప్యాకేజీ కాకుండా హోదా కావాలని తీర్మానం ప్రవేశపెడుతున్నా’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

2. ‘హోదా’కి నిబద్ధతతో ప్రయత్నించాం:చంద్రబాబు
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం జగన్‌ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు ప్రధాని మోదీ అంగీకరించలేదని.. ఆయన ఒప్పుకోనప్పుడు ప్రణాళికా సంఘం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. తాము ప్రత్యేకహోదా సాధించలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అంటున్నారని.. హోదా తెస్తారనే ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. హోదా సాధించమనే అధికార పార్టీకి చెబుతున్నామని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం నిబద్ధతతో ప్రయత్నం చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రవిప్రకాశ్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై తీర్పును ఉన్నత న్యాయస్థానం రెండు వారాల పాటు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా రవిప్రకాశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫున న్యాయవాది అహ్లూవాలియా వాదించారు. రవిప్రకాశ్‌పై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు వేశారని వాదించారు. శివాజీ, రవిప్రకాశ్‌ మధ్య జరిగిన షేర్ల లావాదేవీలు నిజమేనని, డైరెక్టర్ల నియామకానికి సంబంధించి రవిప్రకాశ్‌ ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని అహ్లూవాలియా వాదనలు విన్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఎవరంటే..?
17వ లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత ఎవరన్న దానిపై ఎట్టకేలకు తెరపడింది. బెంగాల్‌కు చెందిన పార్టీ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్ చౌదరి లోక్‌సభలో పార్టీ నాయకుడిగా వ్యవహరించనున్నారు. గత కొన్ని రోజులుగా.. ఈ పదవికి ప్రముఖంగా వినిపించిన పేర్లలో అధిర్‌ కూడా ఉన్నారు. తొలుత రాహులే ఈ పదవి చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చినా పార్టీ అధిర్‌ రంజన్‌ చౌదరిని ఎంపిక చేసింది. శశిథరూర్, మనీష్‌ తివారీ, కె.సురేశ్‌ కూడా రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించడానికి సమావేశమైన కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిర్‌ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. షిర్డీ ఆలయానికి ‘చిల్లర’ తిప్పలు
దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటైన మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం ‘చిల్లర’ సమస్యతో సతమతమవుతోందట. ఈ ఆలయంలో కానుకలు సమర్పించే భక్తులు ఎక్కువగా నాణేలను హుండీల్లో వేస్తున్నారు. అయితే వీటిని బ్యాంకులు తీసుకోకపోవడంతో నాణేలను ఏం చేయాలో తెలియడం లేదని ఆలయ ట్రస్ట్‌ చెబుతోంది. దేశం నలుమూలల నుంచి షిర్డీ ఆలయానికి భక్తులు వస్తుంటారు. వారంతా హుండీల్లో ఎక్కువగా నాణేలనే సమర్పిస్తున్నారట. అలా వారానికి దాదాపు రూ. 14లక్షలు నాణేల రూపంలోనే వస్తున్నాయని షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ సీఈవో దీపక్‌ మగ్లింకర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. యాపిల్‌ 5జీ ఫోన్‌ ఎప్పుడంటే..?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెలికాం నెట్‌వర్క్‌లన్నీ 5జీ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల్లో 5జీ సేవలు ప్రయోగాత్మకంగా ప్రజలకు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్‌ కంపెనీలు అందుకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు 5జీతో పనిచేసే మొబైల్స్‌ను తయారు చేశాయి. అవి ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇక అమెరికాకు చెందిన యాపిల్‌ సంస్థ 5జీ ఐఫోన్‌ను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. యాపిల్‌ నుంచి తొలి 5జీ మొబైల్‌ 2020లో అందుబాటులోకి రావొచ్చని ప్రముఖ విశ్లేషకుడు మింగ్‌-చి కో చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాక్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటా
ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ ఓటమికి తాను ప్రతీకారం తీర్చుకుంటానని ప్రముఖ బ్రిటిష్‌ బాక్సర్‌ ఆమిర్‌ ఖాన్‌ అన్నాడు. జులై 12న సౌదీ అరేబియాలో జరగబోయే బాక్సింగ్‌ మ్యాచ్‌లో భారత బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌ను ఓడిస్తానని చెప్పాడు. ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా భారత్‌ x పాక్‌ మధ్య జరిగిన పోరులో కోహ్లీసేన గెలుపొందిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ సంతతికి చెందిన బ్రిటిష్‌ బాక్సర్‌ అమిర్‌ఖాన్‌ ట్విటర్‌లో పైవిధంగా పేర్కొన్నాడు. దీనికి నీరజ్‌ గోయత్‌ తనదైన శైలిలో దీటుగా బదులిచ్చాడు. ‘అలాగే కలలోనే ఉండు ఆమిర్‌.. నువ్వు నా విజయాన్ని, భారత గెలుపుని వీక్షిస్తావు’ అంటూ నవ్వుతున్న ఎమోజీలు పెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. స్వల్పలాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 11,700 వద్ద, సెన్సెక్స్‌ 85 పాయింట్లు లాభపడి 39,046 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. వేదాంత, పవర్‌ గ్రిడ్‌, కోల్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు బాగా లాభపడ్డాయి. నేటి ట్రేడింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు 40 శాతం కుంగాయి. దివాలా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఎన్‌సీఎల్‌టీకి వెళ్లింది. దీంతో షేర్లు భారీగా పడిపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) షేర్లు 7శాతం తగ్గాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మరో 15మంది సీనియర్‌ అధికారులపై వేటు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 15 మంది కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులపై వేటు పడింది. తక్షణమే వారు తమ ఉద్యోగాలకు స్వచ్ఛంద విరమణ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. అవినీతి ఆరోపణలు, వృత్తిరీత్యా తప్పుడు ప్రవర్తన కారణంగా ఈ నెల 10వ తేదీన 12 మంది సీనియర్‌ అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. సరిగ్గా వారం తర్వాత మరో పదిహేను మందిపై కేంద్రం చర్యలు తీసుకుంది. ‘ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగంలోని ప్రత్యేకాధికారాలతో భారత రెవెన్యూ సర్వీస్‌లో పనిచేస్తున్న 15 మంది సీనియర్‌ ఉద్యోగుల తక్షణ పదవీ విరమణకు రాష్ట్రపతి ఆదేశించారు’ అని ఆర్థిక శాఖ ట్విటర్‌లో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సమ్మె విరమించారుగా.. తర్వాత విచారిస్తాం
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. పశ్చిమబెంగాల్‌లో ఇటీవల వైద్యులపై జరిగిన దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల భద్రతపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. అయితే నిరసన చేపట్టిన వైద్యులు నిన్న సమ్మె విరమించడంతో ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.