
తాజా వార్తలు
బుందేల్‌ఖండ్‌లో నీటి కటకట
బందా : భారత్‌లో రోజు రోజుకు నీటి కొరత తీవ్రమైన సమస్యగా మారుతోంది. దేశంలో అత్యధికంగా నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో ఒకటైన బుందేల్‌ఖండ్ ప్రజలు ఈ వేసవిలో తాగునీటికి కటకటలాడుతున్న పరిస్థితి నెలకొంది. ఎంతలా అంటే బందా జిల్లాలో జీవనాడిలాంటి కెన్ నదికి పోలీసులు రక్షణ ఏర్పాటు చేసే స్థాయిలో!
గత కొద్ది నెలలుగా చేస్తున్న ఇసుక అక్రమ మైనింగ్ కారణంగా కెన్ నది దాదాపుగా ఎడారిని తలపిస్తోంది. మైనింగ్ మాఫియాలు ఆ నదిలో ఉన్న ఇసుకను తరలించడంతో నదిలో నీరు పూర్తిగా ఇంకిపోయింది. ఫలితంగా బందా జిల్లాకు అంతంత మాత్రంగానే ఉన్న నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ‘హద్దులు దాటిన ఇసుక తవ్వకాల కారణంగా నదిలో ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఫలితంగా సమీపంలోని బావుల్లో కూడా నీటి లభ్యత సక్రమంగా జరగడం లేదని’ జిల్లా నీటిసరఫరా విభాగం ఇన్‌ఛార్జి అధికారి ఆర్కే కనౌజియా పేర్కొన్నారు. మరోవైపు మైనింగ్ ఊసే లేకుండా చేసేందుకు పోలీసులు నదిలోని అడుగడుగునా బైనాక్యులర్‌తో నిఘా వేస్తూ పెట్రోలింగ్ చేపడుతున్నారు.
‘మేం 24గంటలూ ఇక్కడ పర్యవేక్షిస్తున్నాం. అందువల్ల ఎవరూ నదిలో మైనింగ్ చేసే అవకాశం లేదు. ఒకవేళ విధుల్లో ఉన్న పోలీసులు ఇక్కడ నుంచి వెళితే మరో పోలీసు బృందం ఇక్కడకు వస్తుంది. నీటి సమస్యకు పరిష్కారం లభించే వరకూ ఇక్కడే తమ విధులుంటాయి’ అని అక్కడ నది సంరక్షణ డ్యూటీలో ఉన్న పోలీస్ దయాశంకర్ పాండే తెలిపారు. అయితే ఈ సమస్యలకు వర్షాలు రావడం ఒక్కటే పరిష్కారమని అధికారులు భావిస్తున్నారు. భారత వాతావరణ విభాగం డేటా ప్రకారం బుందేల్‌ఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లో ఈ నెలలో వర్షాలు కురిసే సూచనలు అరుదుగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ -75శాతం లోటు నమోదైంది. బుందేల్‌ఖండ్‌లో భాగంగా ఉన్న హామీర్పూర్ జిల్లా కూడా నీటికొరత తీవ్రంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చు కోవడం, ప్రభుత్వం పంపించే నీటి ట్యాంకర్ల కోసం ఎదురుచూడటమే తమ దినచర్యగా మారిపోయిందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. ‘రెండు కిలోమీటర్ల దూరం నుంచి రోజూ నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఒక్క సైకిల్‌పై ఎనిమిది క్యాన్లను పెట్టుకొని కుస్తీలు పడుతున్నాం. అధికారులు రోడ్డుపక్కన ఉన్న ఇళ్లలో తనిఖీ చేసి అంతా సవ్యంగా ఉందని అనుకుంటున్నారు. ఊరు మొత్తం తిరిగి వారు సమస్యను గుర్తించడం లేదని’ మురాద్ అలీ అనే ఓ గ్రామస్థుడు తాము ఎదుర్కొంటున్న దీనస్థితిని వివరించాడు.
ఇటీవలే ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. 2022 ఎన్నికల కంటే ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రంలో నెలకొన్న తాగునీటికి సమస్యను పరిష్కారించాలని కోరారు. అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం రూ.9వేల కోట్ల నిధులను విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల నిమిత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఈ నిధుల్ని వినియోగించనున్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- నేటి నుంచే ఫాస్టాగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
