close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. దిల్లీలో అఖిలపక్ష భేటీ ప్రారంభం

దిల్లీలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. ఉభయ సభల్లో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ భవనంలోని లైబ్రరీ హాలుకు చేరుకున్నారు. జమిలి ఎన్నికలు, ఈ ఏడాది జరిగే మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలు, తదితర అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో జరిగే ఈ భేటీకి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షాతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

2. సభను నిష్పక్షపాతంగా నడుపుతా: ఓం బిర్లా

సభను నిష్పక్షపాతంగా నడుపుతానని.. అందుకు తనకు ప్రతిఒక్కరూ సహకరించాలని నూతనంగా ఎన్నికయిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కోరారు. లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన వేళ బుధవారం ఓం బిర్లాను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి తొలి ప్రసంగం చేశారు. సభను నియమ నిబంధనలకు అనుగుణంగా నడుపుతానని హామీ ఇచ్చారు. పార్టీల బలాబలాలకతీతంగా సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సభను నడుపుతానని వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

3. ఏపీ భవనాల అప్పగింత ప్రక్రియ ముమ్మరం

తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్‌ నరసింహన్‌ ఇటీవల జారీచేసిన ఆదేశాల నేపథ్యంలో ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను అధికారులు తెలంగాణకు అప్పగిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ లోపు భవనాలను పూర్తిస్థాయిలో తెలంగాణకు అప్పగిస్తామంటూ ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం.. తెలంగాణ సీఎస్‌ ఎస్కే జోషికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా భవనాల అప్పగింత ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ మేరకు ఏపీకి చెందిన భవనాల్లోని సామగ్రిని అధికారులు అమరావతికి తరలిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

4.  కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస కార్యవర్గం భేటీ

తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది.  పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరుగిన ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మినహా కార్యవర్గ సభ్యులంతా పాల్గొన్నారు. దిల్లీలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. పురపాలక సంఘం ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది.

5. మోదీ అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్‌ దూరం!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో పార్లమెంటులో ప్రాతినిథ్యం వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులతో అఖిల పక్ష సమావేశానికి విపక్షాలు దూరంగా ఉన్నాయి. ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధ్యక్షులు మమతా బెనర్జీ, మాయావతి, చంద్రబాబునాయుడు భేటీకి హాజరుకావట్లేదని ప్రకటించగా.. తాజాగా కాంగ్రెస్‌ కూడా అదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరుకావట్లేదని పార్టీ విశ్వసనీయ వర్గాలు తాజాగా వెల్లడించాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

6. నీటి సమస్య.. అంత పెద్దది కాదు

భూగర్భ జలాలు తగ్గిపోతుండటం వల్లే చెన్నైలో నీటి కొరత ఏర్పడిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. అయితే ఇది మీడియాలో చూపించినంత పెద్ద సమస్య మాత్రం కాదంటూ వ్యాఖ్యలు చేశారు. కొన్ని వార్తలను పట్టుకుని నీటి కొరతపై ప్రజలను భ్రమపెట్టొద్దని మీడియాను ఈ సందర్భంగా కోరారు. ‘ఈశాన్య రుతుపవనాలు అక్టోబరు-నవంబరుకు గానీ రాష్ట్రంలోకి రావు. అప్పటిదాకా మేం భూగర్భ జలాలపైనే ఆధారపడాలి. ఇక గతకొన్నేళ్లుగా తగినంత వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు నానాటికీ తగ్గిపోతున్నాయి. దీంతో ఈసారి నీటి కొరత కాస్త ఎక్కువగా ఉంది. అయితే ఇది మీడియాలో చూపించినంత పెద్ద సమస్యేమీ కాదు’ అని పళనిస్వామి చెప్పుకొచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

7. దాసరి కుమారుడి ఆచూకీ లభ్యం

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి తారక ప్రభు ఆచూకీ లభ్యమైంది. మంగళవారం సాయంత్రం ఆయన తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రభు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.ప్రభు కనపడటం లేదని వారం రోజుల క్రితం ఆయన మామయ్య సురేంద్రప్రసాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. ప్రభు కావాలనే తన చరవాణిని అందుబాటులో లేకుండా చేసినట్లు పోలీసులు భావించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

8. న్యాయవ్యవస్థ స్వతంత్రతను రక్షించాలి:గొగొయి

క్రియాశీలక న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఆత్మ లాంటిదని దాన్ని నిరంతరం పరిరక్షించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి అభిప్రాయపడ్డారు. అలాగే న్యాయవ్యవస్థలో నాయకత్వ లక్షణాల ఆవశ్యకతను వివరించారు. రష్యాలో జరుగుతున్న ‘షాంఘై సహకార సంఘం’(ఎస్‌సీఓ) సభ్యదేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసంలో భాగంగా ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలన్నది ప్రతిదేశంలోని ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

9. ‘కేంద్ర నిధుల లెక్కలన్నీ బయటపెడతాం’

ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని భాజపాకు చెందని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. మోదీ, కిషన్‌రెడ్డిలకు కేసీఆర్‌ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. దిల్లీలో సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద మూలాలను అంతం చేస్తామని మాత్రమే కిషన్‌రెడ్డి అన్నారన్నారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలు స్థానికుల సహకారం లేకుండా జరిగాయా? అని ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని కేసీఆర్‌కి ఇప్పుడే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. త్వరలోనే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలన్నీ బయటపెడతామని చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

10. ఊగిసలాటలో స్వల్ప లాభాలు

దేశీయ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, లోహ, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే చివరి గంటల్లో మళ్లీ కొనుగోళ్లు జరగడంతో నష్టాల నుంచి మార్కెట్లు తేరుకున్నాయి. ఈ ఊగిసలాటలో సెన్సెక్స్‌ స్వల్పంగా లాభపడగా.. నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 66 పాయింట్ల లాభంతో 39,113 వద్ద స్థిరపడింది. నిఫ్టీ స్థిరంగా 11,691 వద్దే ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.70గా కొనసాగుతోంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.