close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

1. తెదేపాకు నలుగురు ఎంపీల గుడ్‌బై!

తెదేపాకు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు తెదేపాను వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. తమను ఒక గ్రూప్‌గా పరిగణించాలంటూ ఎంపీలు సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ అందజేశారు.

2. కాకినాడలో తెదేపా నేతల రహస్య భేటీ

తెదేపాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. కాకినాడ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో సమావేశమైనట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో ఈ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి కాపు సామాజిక వర్గానికి చెందిన 14 మంది తెదేపా నేతలు హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. తెదేపాను వీడి భాజపా లేదా వైకాపాలో చేరే విషయమై వీరంతా సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎంపికలో భాగం కాలేను

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని రాహుల్‌ గాంధీ ఇంకా వెనక్కు తీసుకున్నట్టు లేదు. అధ్యక్ష పీఠం నుంచి దిగిపోవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తదుపరి అధ్యక్ష ఎన్నికపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశం తర్వాత మీడియా ఆయనను పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఏ వ్యవస్థలోనైనా జవాబుదారీతనం ఉండాలి. అలాగే పార్టీల్లోనూ. కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడి ఎంపికలో నేను భాగం కాదలుచుకోలేదు. ఆ విషయంలో నా జోక్యం అనవసరమని నా భావన’ అని రాహుల్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో టీమిండియా జెర్సీ మార్పు?

ప్రపంచకప్‌లో భాగంగా జూన్‌ 30న ఆతిథ్య జట్టుతో టీమిండియా తలపడనున్నవిషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేన ఆ మ్యాచ్‌లో వేరే జెర్సీతో ఆడనుందని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఇలా ఆతిథ్య జట్టు తప్పా మిగతా అన్నింటికీ రెండు వేర్వేరు రంగుల జెర్సీల అనుమతినిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్న విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. దీంతో ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు బ్లూ కలర్‌ జెర్సీకి బదులు నారింజ(ఆరెంజ్‌) రంగు జెర్సీలతో బరిలోకి దిగనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘తెరాసకు భయం పట్టుకుంది..అందుకే దాడులు’

రాష్ట్రంలో భాజపా బలపడుతోందన్న భయం తెరాసకు పట్టుకుందని, అందుకే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం పాడైనందున దాన్ని మారుస్తుంటే దాడి ఎందుకని ప్రశ్నించారు. పోరాట యోధురాలి విగ్రహం మారిస్తే తప్పేంటన్నారు. అక్కడ విగ్రహంతో ఎవరికీ సమస్య లేదని, పదేళ్ల నుంచీ రాణి అవంతీబాయి విగ్రహం అక్కడే ఉందని తెలిపారు. తాను రాయితో కొట్టుకున్నానని డీసీపీ అంటున్నారనీ.. తానెప్పడు రాయితో కొట్టుకున్నా అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏ కారణాలతో వెళ్తున్నారో నాతో చెప్పారు:ఉత్తమ్‌

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి దిల్లీలో స్పందించారు. రాజకీయ కారణాలతో పార్టీని నుంచి వెళ్లేవారికైతే ఏదైనా చెప్పొచ్చు గానీ.. ఆర్థికపరమైన కారణాలతో వెళ్లేవారికి ఏం చెప్పగలం అని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి ఏ కారణాలతో వెళ్తున్నారో తనకు చెప్పారని, వెళ్లాలని నిర్ణయించుకున్నారు గనక ఇప్పుడు ఏదైనా చెబుతూ ఉండొచ్చని ఉత్తమ్‌ అన్నట్టు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాక్‌ మీడియా వార్తను కొట్టిపారేసిన భారత్

శాంతి కోసం చర్చిద్దామని తాము ఇచ్చిన పిలుపునకు భారత్ ఎట్టకేలకు అంగీకరించిందంటూ పాకిస్థాన్ మీడియా పేర్కొన్న విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తాము ఇటువంటి ‌ప్రతిపాదన చేయలేదని స్పష్టతనిచ్చింది. ఈ విషయంపై గురువారం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘పాక్‌ ప్రధాని, విదేశాంగ శాఖ ఇటీవల భారత ప్రధాని, విదేశాంగ మంత్రికి శుభాకాంక్షలు తెలపడంతో దానికి భారత్ ప్రతిస్పందించింది. దేశాల మధ్య నమ్మకం పెరగాలని, విరోధం, ఉగ్రవాదం, హింస తొలగిపోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదం, హింస నీడలో ఉండని వాతావరణం నెలకొనాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. పాకిస్థాన్‌తో చర్చల కోసం ప్రతిపాదన చేయలేదు’’ అని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఏఎన్‌-32 దుర్ఘటన: 6 మృతదేహాలు లభ్యం

ఈనెల 3వ తేదీన జరిగిన వాయుసేనకు చెందిన ఏఎన్‌‌-32 విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్‌ జిల్లా పయూమ్‌ పరిధిలో ఇది కూలిపోయింది. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో మృతదేహాలను వెలికి తీయడానికి ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు ఆరు మృత దేహాలు, మరో ఏడుగురి శరీర భాగాలను గుర్తించారు. విమానం కూలిపోయిన ప్రాంతంలో వాతావరణం అనుకూలించలేదు. దీంతో అక్కడికి వెళ్లిన గరుడ్‌ కమాండోలకు అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శేఖర్‌ కమ్ముల తర్వాతి సినిమా ఈ హీరోతోనే!

‘ఫిదా’వంటి బ్లాక్‌ బస్టర్ తర్వాత క్లాస్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల ఏ హీరోతో సినిమా తీస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ హీరో ఇంకెవరో కాదు.. అక్కినేని నాగచైతన్య. ఇటీవల ‘మజిలీ’తో మంచి విజయాన్ని అందుకున్న చైతూ తన తర్వాతి చిత్రాన్ని శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేసేందుకు పచ్చజెండా ఊపారు. ఈ మేరకు చిత్ర బృందం వివరాలు వెల్లడించింది. ‘ఫిదా’తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన భామ సాయిపల్లవి ఇందులో కథానాయికగా నటించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 498 పాయింట్లు లాభపడి 39,611 వద్ద, నిఫ్టీ 146 పాయింట్లు లాభపడి 11,838 వద్ద ముగిశాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించవచ్చనే వార్తలు మార్కెట్లో జోరును నింపాయి. మరో పక్క డేటా లోకలైజేషన్‌ చేయమనే దేశాల కంపెనీలకు అవసరమైన హెచ్‌1బీ వీసాలపై నియంత్రణ విధిస్తుందనే వార్తలు వచ్చాయి. దీంతో కేవలం టెక్‌ కంపెనీల షేర్లు మాత్రమే నష్టపోయాయి. ఇప్పటికే భారత్‌ మాస్టర్‌ కార్డ్‌ వంటి కంపెనీలను భారత్‌లో డేటాను ఇక్కడే నిల్వచేయాలని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.