close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. నియంతృత్వంపై ప్రజాస్వామ్యమే గెలుస్తుంది

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్థితిని ప్రతిఘటించిన వారందరినీ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం స్మరించుకున్నారు. ఈ ఘటనతో భారత ప్రజాస్వామ్య విలువ, గొప్పతనం నిరూపితమైందన్నారు. ఎప్పటికైనా నియంతృత్వవాదంపై ప్రజాస్వామ్యమే గెలుస్తుందని రుజువైందని మోదీ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ విధించి 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ట్విటర్‌ వేదికగా.. ఆనాటి వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అలాగే కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా కూడా ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. వార్తా పత్రికలపై ఉక్కుపాదం మోపి, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసిన రోజు అది అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బాక్సైట్‌ తవ్వకాల జీవోలు రద్దుచేస్తాం: జగన్‌

రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించిన జీవోలను రద్దుచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. గిరిజనులు వద్దన్నప్పుడు తవ్వకాలు ఎందుకు చేయాలో అర్థంలేదన్నారు. మైనింగ్‌ జరగకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదని ప్రజావేదికలో రెండోరోజు జరిగిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ల సదస్సులో సీఎం అన్నారు. యువకులు మావోయిస్టులుగా మారకుండా గిరిజన ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజనుల జీవనోపాధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని, నెలకోసారి అన్ని శాఖల అధికారులూ మావోయిస్టు ప్రాంతాల్లోకి వెళ్లాలని ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారాకు అస్వస్థత

వెస్టిండిస్‌ మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పి రావడంతో ఆయనను ముంబయిలోని పరేల్‌ ప్రాంతంలో గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. ఓ హోటల్‌లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన లారా.. మధ్యలో అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

4. ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం!

విశాఖ జిల్లాలో ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.2కోట్ల లంచం తీసుకుంటూ సహకార శాఖ రిజిస్ట్రార్‌ మల్లికార్జునరావు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కాడు. లబ్ధిదారుడి వద్ద రూ.2కోట్ల లంచం డిమాండ్‌ చేసి అడ్డంగా దొరికిపోయాడు. లంచాల్లోనే ఇదో కొత్త అవతారమనే చెప్పాలి. ఈ లంచం మొత్తానికి సరిపోయే విలువైన భూమిని రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని లబ్ధిదారుడు చెప్పడంతో ఇరువురి మధ్యా అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విశాఖ టర్నర్‌చౌల్ట్రీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్‌ పక్రియ జరుగుతున్న సందర్భంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఛోక్సికి ఎదురుదెబ్బ

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అతడి పౌరసత్వాన్ని ఉపహరించుకోవాలని ఆంటిగ్వా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే అందుకు కారణం. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో దేశం విడిచిపారిపోయి ఛోక్సి ప్రస్తుతం ఈ కరీబియన్‌ దీవుల్లో నివసిస్తున్నాడు. మార్చి నుంచి భారత్ ప్రభుత్వం అతడిని తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అలాగైతే లోటస్‌పాండ్‌నూ కూల్చేయాలి: బుద్ధా

‘అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చూస్తే అంత ఉలుకెందుకు.. ఇన్నాళ్లూ చట్టం కళ్లుగప్పారు.. ఇకపై సాధ్యం కాదు’ అంటూ దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. ప్రజావేదిక అక్రమ నిర్మాణమైతే చెరువును పూడ్చి కట్టిన లోటస్‌పాండ్‌ సక్రమ కట్టడమా అని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాల సక్రమం కోసమేనా ఏపీ భవనాలు తెలంగాణకిచ్చేశారు అని మండిపడ్డారు. కిన్లే వాటర్‌ బాటిల్‌లో రూ.40లు మిగిలించానంటున్న  సీఎం జగన్‌  రూ.8కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను ఎలా కూల్చేయమంటున్నారు? అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘సర్కార్ కూలే వరకు చేరికలు కొనసాగుతాయి’

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్(టీఎంసీ) నుంచి భాజపాలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ టీఎంసీ ఎమ్మెల్యే, దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ప్రెసిడెంట్‌ లిపికా రాయ్‌తో పాటు పలువురు జెడ్పీ సభ్యులు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తొలిసారి భాజపా చేతికి ఓ జిల్లా పరిషత్‌ చిక్కినట్లైంది. దీనిపై భాజపా ముఖ్య నేత ముకుల్‌ రాయ్‌ స్పందిస్తూ.. ఇది ‘ట్రైలర్‌ మాత్రమే.. అసలు కథ ముందుంది’ అని వ్యాఖ్యానించడం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికలు కేవలం తొలి విడత మాత్రమేనని మున్ముందు మరింత మంది చేరతారన్నారు. మమత ప్రభుత్వం కూలే వరకు ఈ చేరికలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పార్టీ మారను: గంటా శ్రీనివాసరావు

తాను పార్టీ మారతాననే ప్రచారంలో వాస్తవం లేదని మాజీమంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదిక చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టం లేకే ప్రభుత్వం కూల్చివేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజావేదికను కూల్చాలన్న నిర్ణయం సరికాదని, దీనిపై  ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. అక్రమ కట్టడాలు కూల్చివేయాలంటే.. ముందు మిగిలిన వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ బాధ్యత ఇప్పుడు వైకాపాపైనే ఉంది: గల్లా

గత ఐదేళ్లలో ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు తెదేపా ఎంతగానో పోరాడిందని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. ‘హోదా’పై మాట తప్పినందుకే రాష్ట్రంలో భాజపా చిరునామా గల్లంతైందన్నారు. తెదేపా ప్రత్యేకహోదా సాధించలేదని భావించిన ప్రజలు.. వైకాపాకు ఒక్క అవకాశం ఇచ్చారని చెప్పారు. ప్రధానితో భేటీ అయిన ప్రతిసారీ హోదా ప్రస్తావన తెస్తానని సీఎం జగన్‌ చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకూడదని ప్రధాని స్పష్టంగా ఉన్నారనే విషయం తమకు అప్పుడే అర్థమైందని జయదేవ్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ మార్కెట్ల సూచీలు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 311 పాయింట్ల మేర పెరిగి 39,434 పాయింట్ల వద్ద , నిఫ్టీ 96 పాయింట్ల మేర పెరిగి 11796 పాయింట్ల వద్ద ముగిశాయి. నేటి మార్కెట్లో ఎన్‌టీపీసీ, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీలు, పవర్‌ గ్రిడ్‌లు లాభాలతో ట్రేడుకావడంతో సూచీలు బాగా పెరిగాయి. లోహరంగసూచీలు దాదాపు 1శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ షేర్లు దాదాపు 5శాతం కుంగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.