close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ప్రజావేదిక కూల్చివేత

ఉండవల్లిలోని ప్రజావేదిక భవనం కూల్చివేతను అధికారులు మంగళవారం సాయంత్రం చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి భవనం చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను కొంత మేర కూల్చివేశారు. ప్రధాన భవనం పక్కనే నిర్మించిన ప్యాంట్రీ, చిన్న డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్లను తొలగించారు. ప్రధాన భవనం కూల్చివేత పనులను ప్రారంభించారు. భవన ప్రవేశ ద్వారంవద్ద మెట్లు, ఎలివేషన్‌ను తొలగించారు. మంగళవారం రాత్రి ఒంటి గంట సమయానికి ప్రజావేదిక కూల్చివేత పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. బుధవారం నాటికి ఉదయానికే భవనం కూల్చివేత పనులు చాలావరకు పూర్తయ్యే అవకాశముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పార్టీ మారడం ఖాయం

నూటికి నూరు శాతం పార్టీ మారడం ఖాయమని.. ఎప్పుడు.. ఏవిధంగా ఎలా అనేది చూడాల్సి ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీలో మంగళవారం   ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారితే వచ్చే న్యాయ, సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తనను భాజపాలోకి ఆహ్వానించారని... భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తోనూ తాను సమావేశమైనట్లు తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అని.. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇదేం పోలీసింగ్‌?

గత ప్రభుత్వ హయాంలో మన కళ్లముందే ఇసుక దోపిడీ, అక్రమ మైనింగ్‌, పేకాట క్లబ్బుల నిర్వహణ, ఎమ్మెల్యేల అక్రమ వసూళ్లు, రాజధానికి భూములివ్వని రైతులపై తప్పుడు కేసులు, వేధింపుల వంటివి అనేకం చోటుచేసుకున్నాయని, అగ్రగామి పోలీసింగ్‌ అంటే వాటన్నింటినీ చూస్తూ ఊరుకోవడమేనా? అని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. సుపరిపాలన, అత్యుత్తమ ఆచరణ అంటే ఇదేనా? అని వ్యాఖ్యానించారు. ‘దేశంలో మనదే అగ్రగామి పోలీసింగ్‌ అంటాం. కానీ గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా  చెలరేగిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి ఇంటి పక్కనే పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు జరిగేవి. నిత్యం వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా తరలేది’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పార్టీ అంటే కుల సంఘం కాదు

పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. కులాలను కలిపే ఆలోచన ధోరణి తమ పార్టీ సిద్ధాంతంలోనే ఉందన్నారు. తానైనా, పార్టీ అయినా దీనికి విరుద్ధంగా వెళ్లేందుకు వీలులేదని వివరించారు. ‘కులాలను కలిపే ఆలోచన నాది. నేను కులాలకు వ్యతిరేకం కాదు. కాపులకు జనాభా ప్రాతిపదికన పార్టీలో తగిన గౌరవం ఉంటుంది. వారికి ఏ లోటు ఉండదు. అయితే అన్ని కులాలు మన పార్టీలో ఉండాలి. అందరూ ఓటేస్తేనే మనకు ఈ శాతం వచ్చింది. పార్టీ అంటే రాజకీయ పార్టీగా గుర్తించాలే గానీ కుల సంఘంగా కాదు. కులం పేరుతో రాజకీయం చేయాలనే ఆలోచన వదిలేయండి’ అని స్పష్టంగా దిశా నిర్దేశం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. హోదా బాధ్యత జగన్‌దే: గల్లా జయదేవ్‌

 ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదానే అత్యంత ప్రాధాన్య అంశం. రాష్ట్రంలో భాజపాకు ఒక్క శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. హోదా ఇవ్వనందుకే ఈ పరిస్థితి’ అని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ఆయన ప్రసంగించారు. ‘వైకాపా నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వమని కోరడంతో ఆయనకు మద్దతిచ్చారు. హోదా సాధించాల్సిన బాధ్యత జగన్‌, వైకాపాపైనే ఉంది. ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటామని ప్రధాని, హోంమంత్రితో సమావేశం అనంతరం జగన్‌ అన్నారు. దీన్నిబట్టి హోదా లేదంటూ ప్రధాని స్పందించినట్లు స్పష్టమైంది’ అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత ఆత్మను ఛిద్రం చేశారు 

లోక్‌సభ వేదికగా కాంగ్రెస్‌ పార్టీపైన.. ‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిప్పులు చెరిగారు. పదునైన పదజాలం, ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత తొలిసారి లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. దాదాపు గంటపాటు నిశిత విమర్శలు గుప్పించారు. అత్యయిక పరిస్థితి విధించి భారతదేశపు ఆత్మను కాంగ్రెస్‌ పార్టీ ఛిద్రం చేసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చీకటి రోజులను ఏనాటికీ మర్చిపోలేమన్నారు. గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు తప్ప వేరెవ్వరి కృషినీ కాంగ్రెస్‌ పార్టీ గుర్తించలేదని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎకరా భూమికి రూ.745 కోట్లు 

దేశ స్థిరాస్తి రంగంలో ఇదో సంచలనం. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ)లో మూడెకరాల భూమిని జపాన్‌ కంపెనీ సుమితోమో ఏకంగా రూ.2,238 కోట్లతో కొనుగోలు చేసేందుకు బిడ్‌ దాఖలు చేసింది. అంటే ఎకరం రూ.745 కోట్లు పలికిందన్నమాట. ఎకరా ధర విషయంలో ఇది దేశంలోనే రికార్డు. స్థిరాస్తి చరిత్రలో అత్యంత విలువైన ఒప్పందాల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు. విక్రయానికి పెట్టిన ఈ భూమి రిలయన్స్‌ జియో గార్డెన్స్‌ పక్కనే ఉందని ముంబయి మహానగర ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎంఎంఆర్‌డీఏ) అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నా కెరీర్‌లో అతిపెద్ద తప్పిదం అదే: బిల్‌ గేట్స్‌

యాపిల్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఐఓఎస్‌కు ప్రధాన పోటీగా మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఆవిష్కరించలేకపోవడమే మైక్రోసాఫ్ట్‌ అధిపతిగా తన అతిపెద్ద తప్పిదమని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ అంగీకరించారు. ఇటీవల రెండు ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఐఓఎస్‌కు పోటీగా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను గూగుల్‌కు మైక్రోసాఫ్ట్‌ ఎలా కోల్పోయిందీ వెల్లడించారు. ‘సాఫ్ట్‌వేర్‌ ప్రపంచంలో ముఖ్యంగా ప్లాట్‌ఫామ్‌ (ఆపరేటింగ్‌ సిస్టమ్‌-ఓఎస్‌)ల వల్లే మార్కెట్లలో విజయవంతం అవుతాం. వ్యక్తిగత కంప్యూటర్లకు విండోస్‌ ఓఎస్‌తో విజయం సాధించాం. అయితే స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలో ఇది సాధ్యం కాలేదు’ అని బిల్‌గేట్స్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కంగారూలే ముందు 

ఊహించినదాని కంటే త్వరగానే ఓ సెమీఫైనలిస్ట్‌ ఖరారైంది. ఐదుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (100; 116 బంతుల్లో 11×4, 2×6) సెంచరీ కొట్టడంతో మొదట ఆస్ట్రేలియా 7 వికెట్లకు 285 పరుగులు సాధించింది. వార్నర్‌ (53; 61 బంతుల్లో 6×4) రాణించాడు. లక్ష్యఛేదనలో పేస్‌ బౌలర్లు బెరెన్‌డార్ఫ్‌ (5/44), స్టార్క్‌ (4/43) ధాటికి ఇంగ్లాండ్‌ 44.4 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్‌ (89; 115 బంతుల్లో 8×4, 2×6) మరోసారి పోరాడినా ఫలితం లేకపోయింది. ఫించ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇండియాకు ముందుగానే స్పైడర్‌ మ్యాన్‌

స్పైడర్‌ మ్యాన్‌ చిత్రాల అభిమానుల్ని అలరించడానికి మరో కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది మార్వెల్‌  స్టూడియోస్‌. 2017లో వచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: హోమ్‌ కమింగ్‌’కు సీక్వెల్‌గా ‘స్పైడర్‌ మ్యాన్‌: ఫార్‌ ఫ్రమ్‌ హోమ్‌’ తెరకెక్కింది. టామ్‌ హోలాండ్‌ ‘స్పైడర్‌ మ్యాన్‌’గా నటిస్తున్న ఈ చిత్రం మన దేశంలో ఒకరోజు ముందే విడుదల కానుంది. ముందుగా వచ్చే నెల 5న ఈ చిత్రాన్ని విడుదల చేయలనుకున్నారు. కానీ ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యాక అభిమానుల నుంచి వస్తోన్న స్పందనతో 4నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.