close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. సంక్షోభం..

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. నిరుడు జూన్‌లో కొలువుదీరిన నాటి నుంచి ఒడిదొడుకుల్లో నడుస్తున్న సంకీర్ణ సర్కారు చివరి దశకు చేరుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వారం కిందటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేశారు. శనివారం ముగ్గురు జేడీఎస్‌ సభ్యులతో సహా 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలను సమర్పించి ప్రకంపనలు సృష్టించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌- దళ్‌ మధ్య సమన్వయం మరింత జటిలమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సుపరిపాలనకు సూచీ

తెలంగాణ ప్రభుత్వ నూతన పురపాలక చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, అత్యంత పటిష్ఠంగా దీనిని రూపొందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కొత్త చట్టం అత్యుత్తమ పాలనకు మార్గదర్శిగా నిలుస్తుందని చెప్పారు. పురపాలక ఎన్నికలకు ముందే దీనిని సిద్ధం చేస్తామని తెలిపారు. సర్వహంగులతో సచివాలయం, శాసన సభ కొత్త భవనాల నిర్మాణం చేపడతామన్నారు. సచివాలయంలో శాఖల తరలింపు ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. కొత్త పురపాలక చట్టం రూపకల్పన, సచివాలయ నిర్మాణం తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వేధించినా పోరాటం ఆగదు: రాహుల్‌

 రాహుల్‌గాంధీకి మరో పరువునష్టం కేసులో బెయిల్‌ మంజూరైంది. ఆర్‌ఎస్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కొద్ది రోజుల కిందటే ముంబయి న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ ఇచ్చింది. ఈ క్రమంలోనే... బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ దాఖలుచేసిన పరువు నష్టం కేసు శనివారమిక్కడ అడిషనల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కుమార్‌ గుంజన్‌ ముందుకు వచ్చింది. విచారణకు రాహుల్‌గాంధీ హాజరు కాగా... న్యాయమూర్తి ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేశారు.  ‘‘నరేంద్ర మోదీ సర్కారుకు, భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. పేదలు, రైతులు, కార్మికుల పక్షాన నా పోరాటం ఆగదు’’ అని రాహుల్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎస్సీ వర్గీకరణను తొక్కిపెట్టలేరు

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చివరి దశకు వచ్చిందని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. జాతీయ స్థాయిలో బీసీ కులాల వర్గీకరణ దిశగా ముందుకెళ్తున్న భాజపా ప్రభుత్వం, ఎస్సీ వర్గీకరణను ఇంకెంతో కాలం తొక్కిపెట్టలేదని అభిప్రాయపడ్డారు. తమ పోరాటానికి విస్తృత మద్దతు లభిస్తున్నందున బీసీలతో పాటు, ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసిందన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వృద్ధి పరుగులో దేశం ముందంజ

అభివృద్ధి పరుగులో దేశం ముందంజలో ఉందని, రానున్న అయిదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల (రూ.350 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యం అసాధ్యమని కేవలం ‘పేషీవర్‌ నిరాశావాదీ’ వ్యక్తులు (నిరాశే వృత్తిగా కలవారు) మాత్రమే అంటున్నారని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన సొంత నియోజకవర్గమైన వారణాసిలో భాజపా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతకర్త శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ 118వ జయంతి సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రూ.350 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ అన్న లక్ష్యాన్ని తప్పకుండా సాధించి తీరుతామన్న విశ్వాసం ఉందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాంమాధవ్‌తో పవన్‌ భేటీ

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు శనివారం వాషింగ్టన్‌ డీసీలో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి భేటీపై ఆసక్తి ఏర్పడింది. జాతీయ, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి తదితర అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. తెలుగుదేశంలోని తాజా పరిణామాలపై కూడా వీరు మాట్లాడుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వీరు చర్చించారని తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నేడు ప్రయోగవేదికకు చంద్రయాన్‌-2

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో చంద్రయాన్‌-2 ప్రయోగ సందడి నెలకొంది. బెంగళూరులోని యూఆర్‌రావు ఉపగ్రహ కేంద్రం శాస్త్రవేత్తలు 15 రోజుల నుంచి షార్‌లో ఉంటూ ఆర్బిటర్‌, రోవర్‌, ల్యాండర్‌కు పరీక్షలు నిర్వహించి, అమరిక చేపట్టారు. అనుసంధానం చేసిన వాటిని గురువారం వ్యాబ్‌కు తీసుకెళ్లి జీఎస్‌ఎల్‌వీ- మార్క్‌ 3 వాహక నౌకలో అనుసంధానం చేశారు. శనివారం జీఎస్‌ఎల్‌వీ- మార్క్‌3 రాకెట్‌కు వ్యాబ్‌లో తుది పరీక్షలు నిర్వహించారు. ల్యాండర్‌, ఆర్బిటర్‌, రోవర్‌ పనితీరు తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు జీఎస్‌ఎల్‌వీ- మార్క్‌ 3 వాహక నౌకను రెండో ప్రయోగ వేదికకు తీసుకురానున్నారు. వాహక నౌక 8గంటలకు రెండో ప్రయోగ వేదికకు చేరుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భగ్గుమన్న ఇంధన ధరలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇంధన చార్జీలపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌, రహదారుల పన్నులను లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.2.45 పెరిగి రూ.72.96కి, డీజిల్‌ ధర లీటరుపై రూ.2.36 పెరిగి రూ.66.69కి చేరింది. ముంబయిలో రూ.2.42 పెరిగి లీటరు ధర రూ.78.57 కి పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.2.40 పెంచి రూ.75.15కి విక్రయిస్తుండగా, చెన్నైలో రూ.2.57 పెంచి రూ.75.76 కి అమ్ముతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌ సెమీస్‌ ప్రత్యర్థి కివీస్‌

ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఎప్పుడో, ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. మంగళవారం టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఆడనుంది. టోర్నీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడి, పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది. భారత్‌కు అగ్రస్థానం ఖరారవడంతో.. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఖరారైంది. ఆసీస్‌.. మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌తో గురువారం సెమీఫైనల్లో తలపడుతుంది. శనివారం  ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో ఆసీస్‌పై నెగ్గింది.

10. సెమీస్‌ ముంగిట శతక మోత

సెమీఫైనల్‌ సమరానికి ముందు టీమ్‌ఇండియా ఉత్సాహాన్ని పెంచే విజయం. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (103; 94 బంతుల్లో 14×4, 2×6), రాహుల్‌ (111; 118 బంతుల్లో 11×4, 1×6) అలవోకగా శతకాలు బాదేయడంతో శనివారం భారత్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది. 265 పరుగుల లక్ష్యాన్ని మరో 39 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా ఛేదించింది. మాథ్యూస్‌ (113; 128 బంతుల్లో 10×4, 2×6) పోరాటపటిమతో మొదట శ్రీలంక 7 వికెట్లకు 264 పరుగులు చేసింది. బుమ్రా (3/37) సూపర్‌ బౌలింగ్‌తో లంకకు కళ్లెం వేశాడు. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.