close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. అందరికీ ఉచిత వైద్యం! 

రాష్ట్రంలో కొత్తగా సార్వజనీన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని(యూనివర్సల్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌) అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే వేర్వేరు ఆరోగ్య పథకాల కింద దాదాపు కోటి కుటుంబాలకు వైద్య సేవలు లభ్యమవుతున్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి ఏకగవాక్ష విధానంలో అమలు చేయడంపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. తద్వారా నిధులు సద్వినియోగమవడంతోపాటు ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యసేవలందించడానికి మార్గం సులభమవుతుందని భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. గో‘దారి’ మళ్లింపుపై లోతైన అధ్యయనం

గోదావరి నీటి మళ్లింపుపై తెలుగు రాష్ట్రాల నీటిపారుదలశాఖ ఉన్నతాధికారుల మధ్య మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన భేటీలో రెండు ప్రతిపాదనలపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు తమ వాదనలను వినిపించారు. ఈ ప్రతిపాదనలను ఓకొలిక్కి తెచ్చేందుకు మరింత లోతైన అధ్యయనం చేయాలని సమావేశం అభిప్రాయపడింది. తెలంగాణలో రాంపూర్‌ నుంచి శ్రీశైలానికి, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని మళ్లించే పథకాల ప్రతిపాదనలకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించారు. మొత్తం కాలువలు పొడవు, సొరంగ మార్గం పొడవు, నిర్మాణం కోసం సేకరించాల్సిన భూమి, అంచనా వ్యయం ఎంతవుతుందన్న అంశాలపై కసరత్తు జరపాలని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. సంకీర్ణానికి తాత్కాలిక ఉపశమనం 

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకుంది. ఎమ్మెల్యేల రాజీనామాల్లో ఎనిమిది మందికి సంబంధించిన ప్రతులలో లోపాలున్నాయని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. వాటిని తిరస్కరించారు. మరో ఐదుగురి రాజీనామాలను పునఃపరిశీలించేందుకు విడతల వారీగా తనను కలవాలని గడువు విధించారు. ఈ పరిణామంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. స్పీకర్‌ నిర్ణయంతో ముంబయిలో బస చేస్తున్న 11 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు డోలాయమానంలో పడ్డారు. వారు బెట్టు మాత్రం వీడటం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. న్యాయాధికారుల ఖాళీలెన్నో చెప్పండి 

న్యాయాధికారి ఉద్యోగ ఖాళీలపై తమకు సమాచారమివ్వాలంటూ... రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, హైకోర్టులను మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్‌ 30 నాటికి ఉన్న ఈ ఖాళీల వివరాలను తమకు తెలియజేయాలంది. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 31న తమ ముందు హాజరుకావాలని అన్ని రాష్ట్రాల న్యాయశాఖ కార్యదర్శులను; హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరళ్లను... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. యూఏఈతో సంబంధాల బలోపేతం 

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)తో గత ఐదేళ్లలో ద్వైపాక్షిక సంబంధాలు బాగా మెరుగయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంధనం, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో ఆ దేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. భారత పర్యటనకు విచ్చేసిన యూఏఈ విదేశాంగ మంత్రి షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ దిల్లీలో మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. పంజా విసిరిన సీబీఐ

ఆర్థిక అక్రమాలు, అవినీతి, మోసం, ఆయుధాల సరఫరా తదితర కేసుల్లో నిందితులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరోసారి విరుచుకుపడింది. మంగళవారం దేశ వ్యాప్తంగా 110 చోట్ల విస్తృతంగా సోదాలు నిర్వహించింది. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో సుమారు 500 మంది సీబీఐ అధికారులు పాల్గొన్నారు. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌, లఖ్‌నవూ సహా పలు నగరాల్లో తనిఖీలు కొనసాగాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. భారీ సుంకాలు ఆమోదించం!

అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తూ...భారత్‌ చాలా కాలంపాటు ‘పండగ’ చేసుకుందంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్ముందు ఇలాంటి విధానాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని నిష్కర్షగా పేర్కొంటూ మంగళవారం ట్వీట్‌ చేశారు. జూన్‌ 28న భారత ప్రధాని నరేంద్రమోదీ.....అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒసాకాలో కలుసుకుని ద్వైపాక్షిక వాణిజ్య వివాదాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్న విషయం గమనార్హం. అమెరికా ఉత్పత్తులపై భారీస్థాయిలో సుంకాలు విధిస్తోందంటూ ఆయన గతంలో కూడా తీవ్రంగా విమర్శిస్తూ... భారత్‌ను ‘సుంకాల రాజు’గా అభివర్ణించిన సంగతి తెలిసిందే.

8. విద్యాసంస్థల బంద్‌ నేడు

విద్యారంగ సమస్యల పరిష్కారానికి బుధవారం తెలంగాణలో అన్ని విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని.. తదితర డిమాండ్లతో బంద్‌ తలపెట్టినట్లు కమిటీ నేతలు ప్రకటించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్వో, టీవీవీ నిరసనలో పాల్గొననున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. లడ్డూ కావాలా..! 

ఎయిరిండియా..ప్రైవేటు పెట్టుబడిదార్లను బందరు లడ్డూలా ఆకర్షించనుందా అంటే, అవుననే పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎయిరిండియా రుణాలను ప్రత్యేక సంస్థకు బదలాయించడం, రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ ద్వైపాక్షిక హక్కులు ఎయిరిండియాకు లభించడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక స్థితి లాభసాటిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా సంస్థను విక్రయించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు కూడా రూ.434 కోట్లే కావడం చూస్తే, ఈ ఏడాది అక్టోబరులోపే విక్రయాన్ని పూర్తి చేసేందుకు గడువుగా ప్రభుత్వం నిర్దేశించిందనే వార్తలొస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. సెమీస్‌ ఇంకా ఉంది 

కీలకమైన సెమీస్‌ పోరులో టీమ్‌ ఇండియా అదరగొట్టింది. మంగళవారం సెమీఫైనల్లో అద్భుతమైన బౌలింగ్‌తో కివీస్‌ను కట్టిపడేసింది. కానీ వరుణుడే అడ్డుపడ్డాడు. కోహ్లీసేన జోరుకు కళ్లెం వేశాడు. ఫైనల్లో అడుగుపెట్టినట్లేనన్న ధీమాతో సాగుతున్న భారత్‌ను కాస్త నిరాశకు గురిచేస్తూ సెమీస్‌ను బుధవారానికి తీసుకెళ్లాడు. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్‌ స్కోరు 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211. విలియమ్సన్‌ (67) ఔట్‌ కాగా.. టేలర్‌ (67), లేథమ్‌ (3) క్రీజులో ఉన్నారు. మిగతా మ్యాచ్‌ నేడు కొనసాగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.