close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌@ 9 AM

1. నవరత్నాల ధగధగలు

ఎన్నికల హామీల అమలు దిశగా వైకాపా ప్రభుత్వం ముందడుగు వేసింది. నవరత్నాలను ప్రజల చెంతకు చేర్చేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో నడిపించేందుకు నడుం బిగించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల అమలు దిశగా రూపుదిద్దుకుంది. సామాజిక పింఛన్లకు భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్ర శాసనసభకు శుక్రవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమర్పించిన తొలి బడ్జెట్‌ సర్వజన సంక్షేమానికి బాటలు వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,27,975 కోట్ల అంచనా విలువతో బడ్జెట్‌ ప్రతిపాదించింది. ఇందులో ఒక్క సంక్షేమానికే ప్రభుత్వం రూ.75 వేల కోట్లకుపైగా కేటాయించింది. రూ1,778.52 కోట్ల రెవెన్యూ లోటును చూపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై సీఎం సార్‌ పాఠాలు

కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. చట్టం రూపురేఖలు, ప్రభుత్వ లక్ష్యాలను వివరించేందుకు రాష్ట్రంలో నాలుగుచోట్ల సమ్మేళనాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దాదాపు 8,000 మంది అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిలో పాల్గొంటారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ స్వరాజ్యం, అవినీతిరహిత పాలన, అధికారులు, ప్రజాప్రతినిధుల సరికొత్త బాధ్యతలతో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రూపొందింది. ఇటీవలే మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. అంతకుముందే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈశాన్యాన భారీ వర్షాలు

రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు శుక్రవారం 10 మంది మృతిచెందారు. బ్రహ్మపుత్ర పొంగి ప్రవహిస్తుండటంతో అసోంకు చెందిన 8.5 లక్షల మంది వరదల తాకిడికి గురయ్యారు. దాదాపు 800 గ్రామాలు జలమయం కాగా వివిధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సిక్కింలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాలయిన యూపీ, పంజాబ్‌, హరియాణా, బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

4. ఈ ఏడాది బ్రిటన్‌ను, 2025లో జపాన్‌ను 

ప్రస్తుత సంవత్సరంలో బ్రిటన్‌ను వెనక్కినెట్టి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ నివేదిక వెల్లడించింది. 2025 కల్లా జీడీపీ 5.9 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. తద్వారా ఆ ఏడాదిలో జపాన్‌ను కూడా అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పేర్కొంది. భారత వినియోగ విపణి పరిమాణం కూడా ప్రస్తుతమున్న 1.9 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 2025 నాటికి 3.6 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విశ్వాస పరీక్షకు కుమార సన్నద్ధం 

శాసనసభలో బలనిరూపణకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సిద్ధమయ్యారు. సభలో ఈ మేరకు ఆయన విస్పష్ట ప్రకటన చేశారు. మరోవైపు రాజకీయ సంక్లిష్టతల దృష్ట్యా మంగళవారం వరకు రాష్ట్రంలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. ఈ పరిణామాలు రాజకీయాలను ఊహించని మలుపు తిప్పాయి. శుక్రవారం రాష్ట్ర శాసనసభ ప్రారంభమయ్యాక నిమిషాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కోతల బడ్జెట్‌ 

‘ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేలా లేదు. పేదల సంక్షేమానికి దోహదం చేసేలా లేదు. వైకాపా నేతల మాటలకు, చేతలకు పొంతన లేదనటానికి ఈ బడ్జెట్టే నిదర్శనం. బడ్జెట్‌ ప్రసంగం పుస్తకాన్ని కూడా పార్టీ పుస్తకంగా, వైకాపా కరదీపికగా మార్చారు’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో సున్నా వడ్డీ రుణాలకు రూ.4 వేల కోట్లు అవసరం ఉంటే.. రూ.100 కోట్లు మాత్రమే కేటాయించటంపై రైతులకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ బడ్జెట్‌లో రైతులకు అన్యాయం చేసి వచ్చే బడ్జెట్‌లో సరిచేస్తామని చెప్పటం సరికాదని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గిరిజన, కేంద్రీయ వర్సిటీలకు ఆమోదం 

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలోని కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఉద్దేశించిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును లోక్‌సభ శుక్రవారం ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు. ఈ రెండింటి ఏర్పాటుకు తాము ముందే నిధులిచ్చామని చెప్పారు. రెండు సంస్థలకు రూ.1,700 కోట్లు ఖర్చుపెట్టబోతున్నామని, ప్రస్తుతానికి తాత్కాలిక మొత్తం కేటాయించామని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కుంభకోణాలపైనే మీ దృష్టంతా..

దేశ ఆర్థిక వ్యవస్థ అయిదేళ్లకోసారి రెట్టింపవుతుందని, అందుకోసం ప్రభుత్వాలే ఉండాల్సిన అవసరంలేదని ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ గట్టిగా తిప్పికొట్టారు. ‘మీరు చెప్పినదే నిజమైతే స్వాతంత్య్రానంతరం 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఎందుకు రెట్టింపుకాలేదు? మీది ‘హిందూ వృద్ధి రేటు’ (ఆర్థిక సంస్కరణలకు ముందు అంతంత మాత్రంగా ఉన్న వృద్ధి రేటు) అన్న ఆరోపణలు మన మీద ఎందుకు వచ్చాయి? యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పై ఎందుకు దృష్టి పెట్టలేదు? ఎందుకు కుంభకోణాలు వరసగా జరిగాయి?’ అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మిడిల్‌ఆర్డర్‌లో కావాలొక మంచి బ్యాట్స్‌మన్‌

టీమ్‌ ఇండియాకు ఒక మంచి మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అవసరం ఉందని అంటున్నాడు కోచ్‌ రవిశాస్త్రి. ప్రపంచకప్‌లో మిడిల్‌ ఆర్డర్‌ పేలవ ప్రదర్శన నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. సెమీఫైనల్లో ఓడినా టోర్నీలో ప్రదర్శనకు కోహ్లీసేన గర్వపడాలని అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ప్రపంచకప్‌కు సంబంధించి చాలా విషయాల గురించి మాట్లాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఫెదరర్‌ మళ్లీ వచ్చాడు

ప్రియమైన వింబుల్డన్‌లో స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ మరోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. గ్రాస్‌కోర్టులో చిరకాల ప్రత్యర్థి రఫెల్‌ నాదల్‌పై మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఫెదరర్‌ 7-6 (7-3), 1-6, 6-3, 6-4తో నాదల్‌పై విజయం సాధించాడు. మరోవైపు నేడు జరిగే విండుల్డన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో హలెప్‌ను ఓడిస్తే సెరెనా విలియమ్స్‌.. మార్గరేట్‌ కోర్ట్‌ (24) పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును సమం చేస్తుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.