close

తాజా వార్తలు

సైన్యంపై ఐఎస్‌ఐ ‘ప్రేమ’ పాశం

సోషల్‌ మీడియా వేదికగా వల

దిల్లీ: భారత్‌ ఆర్మీకి చెందిన నిగూఢ సమాచారాన్ని తెలుసుకోవాలన్న కుటిల బుద్ధితో ఐఎస్‌ఐ అందమైన అమ్మాయిల పేరుతో వలపు పాశం విసురుతోంది. ఇలా గత 15 నెలల కాలంలో పాకిస్థాన్‌కి చెందిన ఓ యువతి ముగ్గురు జవాన్లను బోల్తా కొట్టించింది. సోషల్‌ మీడియాలో తనను తాను ఇండియన్‌ ఆర్మీ నర్సింగ్‌ కార్ప్‌ కెప్టెన్‌గా చెప్పుకొని పరిచయం చేసుకుంది. తర్వాత మెల్లగా వారితో స్నేహాన్ని పెంచుకుని విలువైన సమాచారాన్ని తెలుసుకుంటోంది. ఇటీవల అరెస్టయిన జవాను రవీందర్‌ కుమార్‌ యాదవ్‌ కూడా ఈమె బాధితుడే. మరో జవానను కొన్ని నెలల కిందటే బుట్టలో పడేసింది.  ఇక ఆర్మీ శిక్షణలో ఉన్న గౌరవ్‌ అనే యువకుడిని గుప్పిట్లో పెట్టుకుంది. ఇలా ఈ ముగ్గురితోనూ సంభాషణ కొనసాగిస్తున్నది ఒకే యువతని పోలీసులు వెల్లడించారు.

ఫేస్‌బుక్‌ టూ వాట్సాప్‌..
హరియాణాలోని మహేందర్‌గఢ్‌ జిల్లాకు చెందిన రవీందర్‌ కుమార్‌ 2017లో సైన్యంలో చేరారు. 2018లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో విధులు నిర్వహిస్తుండగా.. ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఆ యువతితో తరచూ ఛాటింగ్‌, వీడియో కాలింగ్‌ చేసే రవీందర్‌.. ఇటీవల ఆమెకు సైన్యానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించినట్లు పోలీసుల విచారణలో తేలింది. జవాన్లు ఉపయోగించే రైఫిల్స్‌ ఫొటోలు కూడా ఆమెకు పంపించినట్లు తెలిసింది. సైన్యంలోని అంతర్గత విషయాలు, సమస్యాత్మక ప్రాంతాల గురించి చెప్పాడట. ఇందుకు గానూ సదరు యువతి నుంచి రవీందర్‌ డబ్బులు కూడా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లి వరకూ వెళ్లిన పరిచయం..
రోహ్‌తక్‌లోని భయానీ మహారాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన సిపాయి సోమ్‌వీర్ సింగ్‌ సైతం ఈమె బుట్టలో పడ్డాడు. ఈయన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఉద్యోగం చేస్తుండే వాడు. కొన్నాళ్ల క్రితం భారత ఆర్మీలో పనిచేస్తుట్లు ఓ మహిళ సోషల్‌ మీడియాలో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి సోమ్‌వీర్‌తో పెళ్లి వరకూ వెళ్లింది. ఈలోపు విషయం ఆర్మీ అధికారులకు తెలియడంతో సోమ్‌వీర్‌ను ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. ఇప్పుడతను జైపూర్‌ జైల్లో ఉన్నాడు.

ఉద్యోగం రాకుండానే ఊచల వెనక్కి..
ఆర్మీ ఉద్యోగ శిక్షణలో భాగంగా తరచూ ఆర్మీ క్యాంపులకు వెళ్లే గౌరవ్‌ కుమార్‌ సైతం పాకిస్థానీ యువతి బాధితుడే. ఫేస్‌బుక్‌ ద్వారా ఆ యువతి గౌరవ్‌కు పరిచయమైంది. తాను కూడా ఆర్మీలో శిక్షణ పొందుతున్నట్లు నమ్మబలికింది. ఈ క్రమంలో ఆర్మీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని గౌరవ్‌ ఆమెకు చేరవేశాడు. ఈ విషయం కాస్తా ఆర్మీ అధికారుల దృష్టికి వెళ్లడంతో 2018 ఏప్రిల్‌లో గౌరవ్‌ అరెస్టయ్యాడు. ప్రస్తుతం ఇతడు రోహతక్‌లోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఊరు పాకిస్థాన్‌..వాడేది ఇండియా నంబర్లు..
ముగ్గురు జవాన్లనూ ట్రాప్‌లో పడేసిన యువతి ఒకరేనని నార్నాల్‌ డీఎస్పీ వినోద్‌ కుమార్ ధ్రువీకరించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..‘మాకందిన ప్రాథమిక సమాచారం ప్రకారం...ఆ యువతి నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ తెరిచింది. వాట్సాప్‌ కోసం భారత నంబర్లనే వాడేది. జవాన్ల ఫోన్లను సైబర్‌ సెల్‌కు పంపినప్పుడు మాకీ విషయం అర్థమైంది. ఆ జవాన్ల అకౌంట్లలో ఆమె ఒక్కొక్కరికి రూ.5,000 డిపాజిట్‌ చేసింది. ఇటీవల అరెస్టయిన రవీందర్‌తో ఆమె అత్యంత సన్నిహితంగా మెలిగేది. వారిద్దరూ వాట్సాప్‌ సందేశాలు పంపించుకునేవారు. ఒకరికొకరు ఫొటోలు కూడా షేర్‌ చేసుకునేవారు. కానీ ఆమె ఫొటోలు మాత్రం స్పష్టంగా ఉండేవి కావు’ అని తెలిపారు.

గతంలో బ్రహ్మోస్‌ ప్రాజెక్టు ఇంజినీరుపై కూడా..
ప్రతిష్ఠాత్మక బ్రహ్మోస్‌ ప్రాజెక్టు ఇంజినీరు విషయంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న కారణంతో ప్రాజెక్టు అధికారి నిశాంత్‌ అగర్వాల్‌ కటకటాలపాలయ్యాడు. నాలుగేళ్లు నమ్మకంగా పనిచేసిన ఇతడు..బ్రహ్మోస్‌ గురించిన సాంకేతిక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఏజెన్సీలకు పంపాడు. ఈ విషయం కాస్తా ప్రాజెక్టు పెద్దల దృష్టికి రావడంతో ఉత్తర్‌ ప్రదేశ్‌ ఉగ్రవాద వ్యతిరేక దళం ఆయనను అదుపులోకి తీసుకుంది.

ఎన్ని నిబంధనలున్నా...
ఇటీవల ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటంతో భారత అర్మీ కూడా అప్రమత్తమవుతోంది. ఎక్కువ మంది ఉన్న వాట్సాప్‌ గ్రూపుల్లో సభ్యులుగా ఉండకూడదని కొన్ని రోజుల క్రితం జవాన్లను ఆదేశించింది. తర్వాత సున్నితమైన అంశాల గురించి చర్చించేటప్పుడు స్మార్ట్‌ఫోన్లను తీసుకురావద్దన్న నియమాలను తీసుకువచ్చింది. ఎన్ని నిబంధలు విధిస్తున్నప్పటికీ కొందరు జవాన్లు ఇలా మాయలో పడిపోతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.