close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. పర్యావరణ, అటవీ శాఖలపై ఎన్జీటీ ఆగ్రహం

పురుషోత్తపట్నం కేసు విచారణలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టును కడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పోలవరంలో భాగంగా నిర్మిస్తున్నామని తమకు సమాచారం ఇచ్చినట్లు కేంద్ర పర్యావరణ శాఖ వివరణ ఇవ్వగా.. ప్రత్యేకంగా డీపీఆర్ ఉన్నప్పుడు పోలవరంలో భాగం ఎలా అవుతుందని ఎన్జీటీ ప్రశ్నించింది. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఎన్జీటీ ఆగస్టు 7కు వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఈనెల 21న ‘పుర’ పోలింగ్‌ కేంద్రాల జాబితా

తెలంగాణలో పురపాలక ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాల ప్రకటన తేదీ వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈనెల 16న ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం 21న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను వెల్లడించనున్నారు. 3 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో ఈనెల 21 పోలింగ్‌ కేంద్రాల జాబితాను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఆ జట్టులో విరాట్‌ కోహ్లీకి దక్కని స్థానం!

భారత జట్టును విజయ పథంలో నడిపి ఎన్నోసార్లు అగ్రస్థానంలో నిలిపాడు టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ సారథుల్లో అతనొకడు.  అలాంటి కోహ్లీ ఒక ప్రత్యేకమైన జట్టులో స్థానం కోల్పోయాడంటే నమ్ముతారా? ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం  ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) ప్రకటించిన జట్టులో కోహ్లికి స్థానం దక్కలేదు. ఇక ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ జట్టులో టీమిండియా నుంచి రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బూమ్రాలు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. లోక్‌సభలో సరోగసీ బిల్లు..

భారత్‌లో కమర్షియల్‌ సరోగసీ (అద్దె గర్భం) విధానంపై త్వరలోనే నిషేధం విధించే అవకాశం ఉంది. ఇందుకు తగ్గ విధానాలు రూపొందించిన కేంద్ర ప్రభుత్వం.. సోమవారం లోక్‌సభలో సరోగసీ (నియంత్రణ) బిల్లును-2019ని ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా శిశువును పొందాలని అనుకునే దంపతులు ఇందుకు తగ్గ ‘నైతిక నిస్వార్థ’ సేవల కోసం తమ బంధువుల సాయాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే కేంద్ర, రాష్ట్రాల స్థాయిల్లో చట్టబద్ధమైన సరోగసీ బోర్డులు ఏర్పాటవుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ‘సచివాలయం కూల్చివేతను అడ్డుకోండి’

తెలంగాణ సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ను విపక్ష నేతలు కోరారు. సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు ఆస్తులను కాపాడే అధికారం ఉంటుందని నేతలు పేర్కొన్నారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ మంత్రి డీకే అరుణ, తెజస అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ వివేక్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. పాతవి కూల్చి కొత్తవి కట్టడంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని గవర్నర్‌కు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఎవరైనా పార్టీలోకి రావొచ్చు: మురళీధర్‌రావు

తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా మాత్రమే ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు అన్నారు. సోమవారం హన్మకొండలోని వేదా ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనేక నిధులు ఇచ్చినప్పటికీ వినియోగించడం లేదన్నారు. దీనివల్ల అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాసకు వ్యతిరేకంగా పనిచేసేందుకు తమ పార్టీలోకి ఎవరైనా రావొచ్చని ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. హువావేను కరుణించనున్న ట్రంప్‌?

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ హువావేకు అమెరికాలో మళ్లీ మంచి రోజులు రానున్నాయా? సమాచారం చోరీ చేస్తోందని అధ్యక్షుడు ట్రంప్‌ కన్నెర్ర చేయడంతో హువావే విక్రయాలతో సహా ఆ కంపెనీకి అమెరికా నుంచి పూర్తి సహాయ సహకారాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో హువావేపై విధించిన ఆంక్షలను ఒక్కొక్కటీ అమెరికా తొలగిస్తూ వస్తోంది. కాగా, మరో రెండు వారాల్లో హువావేపై విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసే అవకాశం ఉందని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో అమెరికా కంపెనీల నుంచి హువేవాకు అవసరమైన మొబైల్‌ చిప్‌సెట్‌లతో సహా పలు ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ప్రత్యేకహోదా ప్రతిపాదనలు లేవు: కేంద్రమంత్రి

ఒడిశా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని ఎటువంటి ప్రతిపాదనలు లేవని ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ఠాకూర్‌ వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో భాజాపా ఎంపీ రమేష్‌మాంజి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాలు,  పర్వత ప్రాంత రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రత్యేకహోదా ద్వారా 90 శాతం కేంద్ర ప్రభుత్వం, 10 శాతం ఆయా రాష్ట్రాల నిధులతో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ఒడిశాలో కూడా ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు ఏవి లేవని ఆయన వివరించారు. అలాగే 14 ఆర్థిక సంఘం ప్రత్యేక, సాధారణ రాష్ట్రాలను నిర్ణయించడానికి ఎటువంటి విధివిధానాలను ప్రవేశపెట్టలేదని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అధిక ధరలకు ఒప్పందాలు చేశారు:అజేయకల్లం

గత ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్‌ ఒప్పందాలను చేసుకుందని ఏపీ సీఎం ముఖ్యసలహాదారు అజేయ కల్లం అన్నారు. ఈ ఒప్పందాల్లో పారదర్శకత ఉండాలని సీఎం జగన్‌ భావిస్తున్నారని, పీపీఏలపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారులతో కలిసి అజేయ కల్లం మాట్లాడారు. 2010లో రూ.18 ఉన్న సౌరవిద్యుత్‌ యూనిట్‌ రూ.2.45కి, పవన విద్యుత్‌ రూ.4.20 నుంచి 43 పైసలకు తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో సరిపోయినంత విద్యుదుత్పత్తి ఉందన్నారు. పీపీఏల వల్ల ఏటా రూ.2,500 కోట్ల ప్రజాధనం అదనంగా ఖర్చయిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. జగన్‌ నమ్మకాన్ని నిలబెడతా: రోజా

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సమర్థంగా పనిచేస్తానని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. సీఎం జగన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని ఆమె స్పష్టం చేశారు. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా సోమవారం బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు వైకాపా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేయడంతో పాటు వారిని ప్రోత్సహిస్తామని రోజా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.