close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్ని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. పుష్ప, దీపాలంకరణలతో సాయిబాబా ఆలయాలు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. సాయిబాబాను దర్శించడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివస్తున్నారు. మహారాష్ట్రలో కొలువైన షిరిడీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వరుసకట్టారు. సాయినామస్మరణతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మార్మోగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. క్రయోజెనిక్‌ కష్టం 

శ్రీహరికోట నుంచి జాబిల్లి దక్షిణ ధ్రువానికి రివ్వున ఎగిరిపోతుందనుకున్న ‘చంద్రయాన్‌-2’ చివర్లో అనూహ్యరీతిలో ఆగిపోయింది. జాబిల్లి-సౌర కుటుంబం పుట్టుక రహస్యాలతోపాటు చంద్రుడిపై నీరు, ఖనిజాల విస్తృతిని శోధించేందుకు ఉద్దేశించిన ఈ సంక్లిష్ట ప్రయోగం మరోసారి వాయిదా పడక తప్పలేదు. గందరగోళానికి తెరదించుతూ ఇస్రో పౌర సంబంధాల అధికారి గురుప్రసాద్‌ క్లుప్తంగా ఒక ప్రకటన చేశారు. ప్రయోగ సమయానికి గంట ముందు వాహకనౌక అయిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3లో సాంకేతిక సమస్య తలెత్తిందని, ముందుజాగ్రత్త చర్యగా ప్రయోగాన్ని నిలిపివేస్తున్నామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పీపీఏలను సమీక్షిస్తాం

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై (పీపీఏ) సమీక్షించాలన్న తమ నిర్ణయంపై కేంద్ర ఇంధన శాఖ మంత్రి రాసిన లేఖకు వివరణ పంపుతామని సీఎం ముఖ్యసలహాదారు అజేయకల్లం చెప్పారు. ‘అధిక ధరలకు ఒప్పందాలు కుదుర్చుకోవటంవల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.2,500 కోట్ల భారం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒప్పందం పారదర్శకతను తేల్చనున్నాం. ఐదేళ్లలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై సమీక్షించి తీరుతాం. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తున్న అన్ని అంశాలపైనా సమీక్షిస్తాం. అక్రమాలు ఉంటే చర్యలు తప్పవు. లేకుంటే ఇబ్బంది పెట్టబోం’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సాగు ఆగమాగం 

వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో కరవు ఛాయలు అలుముకుంటున్నాయి. రాష్ట్రంలో 433 మండలాల్లో వర్షాభావం తీవ్రస్థాయికి చేరింది. తెలంగాణపై నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. కారుమబ్బులు లేనందున సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి మరో 2 రోజులూ తేలికపాటి వర్షాలేనని వాతావరణ శాఖ తెలిపింది.  ఈ పరిస్థితుల్లో రైతులు తక్కువ కాలంలో పండే వంగడాలనే ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అద్దెగర్భం అంగడి సరకు కాదు

కేవలం వ్యాపార కోణం, లాభాపేక్షతో మాత్రమే సాగే అద్దెగర్భం పోకడలను పకడ్బందీగా అడ్డుకునేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. సంతాన సాఫల్యత సమస్యను ఎదుర్కొంటున్న దంపతులు కేవలం సన్నిహిత బంధువుల నుంచి మాత్రమే అద్దెగర్భం ద్వారా పిల్లలను పొందేందుకు ఈ బిల్లు వీలుకల్పిస్తుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వాహన ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల పరిహారం 

మోటారు వాహనాల చట్ట నిబంధనలకు మరింత పదును పెంచే లక్ష్యంతో రూపొందించిన సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించేలా, ప్రమాదానికి గురైన వ్యక్తులకు సహాయపడే పరోపకారులకు పోలీసుల నుంచి వేధింపులు ఎదురుకాకుండా రక్షణ కల్పించే ప్రతిపాదన తాజా బిల్లులో ఉంది. ప్రాణాలు కోల్పోయిన బాధిత వ్యక్తి కుటుంబానికి రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వ్యక్తికి రూ.2.5లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఐఐటీఎం’ పూర్వ విద్యార్థుల విరాళం రూ.225 కోట్లు

చెన్నైలోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (ఐఐటీ) పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో డైమండ్‌ జూబ్లీ వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 83 చోట్ల ఈ వేడుకలు నిర్వహించారని ఐఐటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా 4,800 మంది పూర్వ విద్యార్థులు రూ.225 కోట్లను ఐఐటీ అభివృద్ధి కోసం విరాళంగా అందించారని పేర్కొంది. దేశంలోని దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణె తదితర ప్రధాన నగరాలలో వేడుకలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అయిదేళ్లలో రెట్టింపు ఐటీ ఉద్యోగాలు 

హైదరాబాద్‌ ఐటీ రంగం బహుముఖంగా విస్తరిస్తోందని హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌) అభిప్రాయపడింది. ఈ రంగం సాధిస్తున్న వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే స్థానికంగా ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య వచ్చే అయిదేళ్లలో రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బహుళ జాతి ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో శరవేగంగా విస్తరిస్తున్నాయని, అంతేగాక కృత్రిమ మేధ, డేటా సైన్స్‌, బ్లాక్‌చైన్‌ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటం, అంకుర సంస్థలు విస్తరించటం దీనికి దోహదపడనున్నట్లు వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆరు కాదు అయిదే.. 

ప్రపంచకప్‌ ఫైనల్లో గప్తిల్‌ ఓవర్‌ త్రోకు అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం ద్వారా తప్పు చేశారని అంతర్జాతీయ మాజీ అంపైర్లు సైమన్‌ టౌఫెల్‌, హరిహరన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘అంపైర్లు తప్పు చేశారనడంలో సందేహం లేదు. ఆ ఓవర్‌ త్రోకు ఇంగ్లాండ్‌కు ఇవ్వాల్సింది ఐదు పరుగులే.. ఆరు కాదు’’ అని ఐదుసార్లు ఐసీసీ ‘అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు గెలిచిన సైమన్‌ టౌఫెల్‌ అన్నాడు. ‘‘కుమార్‌ ధర్మసేన న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ ఆశలను చిదిమేశాడు. ఆ ఓవర్‌ త్రోకు ఇవ్వాల్సింది 5 పరుగులే’’ అని హరిహరన్‌ చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హిమాచల్‌ గవర్నర్‌గా కల్‌రాజ్‌ మిశ్ర

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భాజపా సీనియర్‌ నేత కల్‌రాజ్‌ మిశ్ర(78)ను కేంద్రప్రభుత్వం హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించింది. అక్కడి గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌(60)ను గుజరాత్‌కు బదిలీ చేసింది. ఇద్దరు గవర్నర్లు బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. గత మోదీ సర్కారులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్యసంస్థల మంత్రిగా పనిచేసిన కల్‌రాజ్‌ మిశ్ర 2017లో పదవికి రాజీనామా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.