close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. కర్నాటకీయంపై తీర్పు రిజర్వ్‌

కర్ణాటకలో అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై సందిగ్ధత ఇంకా వీడలేదు. రెబల్ ఎమ్మెల్యేలు, స్పీకర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అసంతృప్త ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, స్పీకర్‌ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ తమ తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పు రేపటికి రిజర్వ్‌ చేసింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కాపులను చంద్రబాబు మోసం చేశారు:జగన్‌

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్త కాదని.. అదే పద్ధతిలో కాపులను ఆయన మోసం చేశారని సీఎం జగన్‌ విమర్శించారు. శాసనసభలో కాపు రిజర్వేషన్ల అంశంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. అన్నీ తెలిసీ ప్రతి అడుగులోనూ మోసానికి పాల్పడ్డారన్నారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం తనకు అలవాటు లేదన్నారు. తాను ఏదైనా చేయగలుగుతానని అనిపిస్తేనే చెబుతానని.. చేస్తానని చెప్పి మోసం చేయడం తన నైజం కాదన్నారు. కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు ఇస్తే మనం ఇష్టం వచ్చినట్లు చేయడం కాదని సీఎం అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ముంబయిలో కూలిన భవనం

ముంబయిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డోంగ్రి ప్రాంతంలోని తండెల్‌ వీధిలో నాలుగు అంతస్తుల కేసరీభాయ్‌ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. భవనం శథిలాల కింద మరో 30 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురిని రక్షించారు. క్షతగాత్రుల్ని స్థానిక జేజే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. రూ.10లక్షలకే ఈ-కారు..!

ఇటీవల విద్యుత్తు ఎస్‌యూవీ కోన విడుదలతో భారత వాహన రంగంలో కొత్త శకానికి నాంది పలికిన హ్యుందయ్‌ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. భారత్‌లో రూ.10లక్షలకే విద్యుత్తు కారును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీని అభివృద్ధికి రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. చెన్నైలోని హ్యుందయ్‌ ఫ్యాక్టరీలో ఈ వాహనాన్ని తయారు చేయనున్నారు. ఇది చిన్నసైజు ఎస్‌యూవీని తలపించవచ్చని సమాచారం. ఈ కారును మధ్య ఆసియా,  లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, అరబ్‌ దేశాలకు ఎగుమతి చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. 19 ఏళ్ల తర్వాత కలిసిన దిగ్గజాలు

కమల్‌ హాసన్‌, ఏ.ఆర్‌ రెహమాన్‌.. ఇద్దరూ సినీ రంగ దిగ్గజాలే. ఒకరు నటన పరంగా, మరొకరు సంగీతం పరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కమల్‌ నటించిన ‘భారతీయుడు’, ‘తెనాలి’ చిత్రాలకు రెహమాన్‌ సంగీతం అందించారు. దాదాపు 19 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. కమల్‌ నటిస్తున్న ‘తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌’ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని కమల్‌హాసన్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కాపు రిజర్వేషన్లపై మీ వైఖరేంటి:చంద్రబాబు

కాపు రిజర్వేషన్ల అంశం ఇవాళ్టిది కాదని.. గత కొన్నేళ్లుగా ఆ సామాజికవర్గానికి చెందిన వారు పోరాడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. కాపు రిజర్వేషన్లపై తనను విమర్శిస్తే తాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని.. దానికి స్పీకర్‌ అవకాశం ఇవ్వాలన్నారు. సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు లేచినప్పుడు అవకాశం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోందన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా కాపు రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు మాట్లాడారు.  పదిశాతం రిజర్వేషన్లు ఓసీలకు ఇస్తే.. అందులో కాపులకు 5 శాతం కేటాయిస్తూ తమ ప్రభుత్వ హయాంలో బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. కాపులకు 5శాతం బిల్లుపై ప్రస్తుత ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ‘సాహో’ అయిపోయింది‌..సెల్ఫీ దిగిన ప్రభాస్‌!

యంగ్ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ సినిమాకు ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టేశారు. సోమవారంతో సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ చిత్రబృందంతో కలిసి సెల్ఫీ దిగారు. అంతేకాదు పార్టీ కూడా చేసుకున్నారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా పలువురు టెక్నీషియన్లతో కలిసి ప్రభాస్‌ దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2017 జూన్‌ 9న ‘సాహో’ చిత్రీకరణ ప్రారంభమైంది. భారతీయ అతిపెద్ద యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను పూర్తిచేయడానికి 25 నెలలు పట్టింది. సుజిత్‌ సినిమాకు దర్శకత్వం వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవ్‌‌..టోల్‌ కట్టాల్సిందే’

మెరుగైన రోడ్లు కావాలంటే ప్రజలు టోల్‌ పన్ను కట్టాల్సిందేనని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని చెప్పారు. ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉన్నంత కాలం టోల్‌ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుందన్నారు. లోక్‌సభలో మంగళవారం సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ గడ్కరీ పై విధంగా స్పందించారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం 40వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. గ్రామ సచివాలయాల్లోనూ మహిళా కానిస్టేబుల్

రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. భద్రతపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. త్వరలో ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాల్లోనూ ఒక మహిళా కానిస్టేబుల్ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు పని చేసే ప్రదేశాల్లో శక్తి బృందాలు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. ఆర్థిక సేవలు, రియాలిటీ, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్‌ షేర్లు ర్యాలీచేయడంతో సూచీలు పెరిగాయి. సెన్సెక్స్‌ 228 పాయింట్లు పెరిగి 39,125 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 11,666కు చేరాయి. యస్‌బ్యాంక్‌, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీలు అత్యధికంగా లాభపడగా.. టీసీఎస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, నష్టపోయాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు కూడా సానుకూలంగా ట్రేడ్‌అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.