close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం నియమించింది. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా అనసూయ ఊకేను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగారు. గత కొంతకాలంగా ఏపీకి కొత్త గవర్నర్‌ నియామకంపై ఊహాగానాలు నెలకొన్నాయి. ఒకానొక సందర్భంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ను నియమించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కేంద్రమంత్రులపై ప్రధాని అసహనం!

పార్లమెంటు సమావేశాలకు కేంద్ర మంత్రులు గైర్హాజరు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా శాఖలపై మంత్రులు పట్టు సాధించట్లేదని ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. సభకు సరిగా హాజరు కాని.. రోస్టర్‌ విధుల్ని సరిగా అమలు చేయని మంత్రుల జాబితా సిద్ధం చేయాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషిని ప్రధాని ఆదేశించినట్లు సమాచారం. ఈరోజు ఉదయం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 2025నాటి లక్ష్యాలకనుగుణంగా భాజపా ఎంపీలకు ప్రధాని పలు సూచనలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. నా స్థాయిలో నేనుగట్టిగా ప్రయత్నిస్తున్నా..:జగన్‌

రాష్ట్రాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని.. ఈ అంశం క్షేత్రస్థాయికి బలంగా వెళ్లాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇస్తున్న ఈ సందేశం క్షేత్రస్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిందని భావించవచ్చా అని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎం ప్రశ్నించారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎక్కడా అవినీతి ఉండకూడదని పదేపదే చెబుతున్నానని.. తహసీల్దార్‌ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లలో ఎక్కడా ఆ పరిస్థితి లేదని తాను భావించవచ్చా అని జగన్‌ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఇప్పటివరకు 963మంది ఉగ్రవాదులు హతం: షా

జమ్ముకశ్మీర్‌లో 2014 జూన్‌ నుంచి ఇప్పటివరకు 963 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్లమెంటుకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఈ ఉగ్రవాద నియంత్రణా చర్యలలో భాగంగా ఇప్పటివరకు 413 మంది భారత సైనికులు వీరమరణం పొందినట్లు హోం మంత్రిత్వశాఖ వద్ద సమాచారం ఉందని వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న కఠినమైన చర్యల గురించి వివరిస్తూ ఆయన ఈ విషయం తెలియజేశారు. విధి నిర్వహణలో  ప్రాణాలు కోల్పోయిన ప్రతీ సైనికుని కుటుంబాల కొరకు సంక్షేమ అధికారులను నియమించామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. బ్రిటన్‌ తగిన మూల్యం చెల్లిస్తుంది: ఇరాన్‌

బ్రిటన్‌ తమ ఆయిల్‌ ట్యాంకర్‌ను మళ్లించినందుకు భారీ మూల్యం చెల్లిస్తుందని ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్‌ జరిఫ్‌ హెచ్చరించారు. బ్రిటన్‌ నావికాదళం గత వారం ఇరాన్‌కు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ను జిబ్రాల్టర్‌ జలసంధి వద్ద బలవంతంగా అదుపులోకి తీసుకొంది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా ఖొమైనీ ‘శుక్రవారం ప్రార్థనల’ నాయకులతో నేడు మాట్లాడుతూ ‘‘దుర్మార్గపు బ్రిటన్‌ మన నౌకను దారి మళ్లించి దోచుకుంది. ఇరాన్‌ వ్యవస్థలను నమ్మిన వారు దీనికి సమాధానం ఇవ్వకుండా ఉండరు’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ‘ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ 

రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే సీఎం కేసీఆర్‌ మాత్రం ఎన్నికలు తప్ప మరో ధ్యాసలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పలు విధానాలను ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 450 మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించిన దాఖలాలు లేవని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని షబ్బీర్‌ డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కాపులకు వైఎస్‌ చేసింది శూన్యం: తెదేపా

రాష్ట్ర బడ్జెట్‌లో కాపుల సంక్షేమానికి రూ.2వేల కోట్లు కేటాయించినా.. దాన్ని అమలు చేయకుండా విచారణ పేరుతో కాలయాపన చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.  కాపులను మోసం చేసింది సీఎం జగన్‌ తప్ప తెదేపా అధినేత చంద్రబాబు కాదని చెప్పారు. మంగళగిరిలో మరో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో కలిసి చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. కాపుల అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీసీలకు ఇబ్బంది కలగకుండా కాపులకు న్యాయం చేయాలనే తపనతో చంద్రబాబు పనిచేశారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘సాహో’ పోయె.. ‘రణరంగం’ వచ్చే..!

ప్రభాస్‌ ‘సాహో’ సినిమా వెనక్కి పోగా.. శర్వానంద్‌ ‘రణరంగం’ సినిమా ముందుకొచ్చింది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ‘సాహో’ సినిమాను 30వ తేదీకి వాయిదా వేశారు. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘రణరంగం’ సినిమా ఇప్పుడు 15న వస్తోంది. శర్వానంద్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌ కథానాయికల పాత్రల్లో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. భాజపాలోకి మాజీ ప్రధాని తనయుడు

మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్‌ కుమారుడు నీరజ్‌ శేఖర్‌ మంగళవారం భాజపాలో చేరారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎంపికైన నీరజ్‌.. సోమవారమే తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. నేడు భాజపా ప్రధాన కార్యదర్శులు భూపేంద్ర యాదవ్‌, అనిల్‌ జైన్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. క్రిప్టోకరెన్సీలతో జాతీయ భద్రతకు ముప్పు

క్రిప్టోకరెన్సీలు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ మ్నుచిన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన సోమవారం శ్వేత సౌధంలో హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బిలియన్ల కొద్ది అక్రమ సంపాదనకు ఇవి మార్గంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మనీ లాండరింగ్‌ చేసేవారికి  వర్చువల్‌ కరెన్సీలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. త్వరలో ఫేస్‌బుక్‌ ప్రతినిధులు అమెరికా ప్రభుత్వంతో క్రిప్టోకరెన్సీ లిబ్రపై చర్చలు జరపనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.