close

తాజా వార్తలు

పుట్టినరోజు ‘కీడు’కలు!

నగరంలో విస్తరిస్తున్న ‘బర్త్‌డే బంప్స్‌’
వెన్ను తట్టుడు కాదు... చితక్కొట్టుడే

హైదరాబాద్‌: ఓ పాత సినిమా పాటలో చెప్పినట్లు పుట్టిన రోజు పండగే అందరికీ. ఏడాదికోసారి వచ్చే ఆ సందర్భాన్ని వేడుకలా చేసుకోవడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఇన్నాళ్లూ కేకు కోయడం దగ్గరే ఆగిపోయిన ఈ పోకడ ప్రస్తుతం కొత్తపుంతలను తొక్కుతోంది. అదికాస్తా ప్రమాదాలకు కారణమవుతోంది.

నగర యువత అర్ధరాత్రి పన్నెండు కాగానే నగరవీధుల్లో బహిరంగంగా వేడుకలు జరుపుకొంటున్నారు. కేకు కోయడంతోనే ఆగకుండా కొత్తగా ‘బర్త్‌డే బంప్స్‌’ను ప్రయోగిస్తున్నారు.

హద్దు మీరుతూ..

కేకు కోయడం పూర్తికాగానే కోడిగుడ్లతో కొట్టడం, కిందపడేసి చితకబాదడం ఇప్పుడు ప్రతి వేడుకలోనూ కనిపిస్తోంది. దీనివల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. పుట్టినరోజు వేడుకలు అనగానే ముందురోజు రాత్రి నుంచే మిత్రులతో మందు విందులు చేసుకోవడం యువతకు అలవాటుగా మారింది. అప్పటిదాకా మద్యం తాగి అర్ధరాత్రి పన్నెండు గంటలు కాగానే సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఆ మత్తులో చిత్తవుతూ ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో పుట్టినరోజు జరుపుకొనే వారిని మరింతగా చితకబాదుతున్నారు.

గుర్తుండిపోయేలా..

కనీస జాగ్రత్తలు పాటించకుండా వేడుకలు నిర్వహించడం ప్రమాదకరం. వీలైనంత మేరకు మద్యానికి దూరంగా ఉంటూ ఆ ఆనంద క్షణాలను గడపాలి. హద్దుమీరకుండా  చేసుకునే వేడుకలు చిరకాల జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

విషాదాలెన్నో..

గతేడాది హైటెక్‌సిటీకి చెందిన యువకులు పుట్టినరోజు వేడుకల అనంతరం తాగిన మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించారు. శోభానాద్రి రెడ్డి అనే యువకుడు మత్తులో పక్కనే ఉన్న ఫ్లైవోవర్‌ గోడ ఎక్కి కిందపడి చనిపోయాడు. ఖైరతాబాద్‌కు చెందిన రవీష్‌ అనే యువకుడి పుట్టిన రోజు వేడుకల్లో బర్త్‌డే బంప్స్‌ హద్దు మీరడంతో అతను ఆసుపత్రి పాలయ్యాడు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఏమిటీ బర్త్‌డే బంప్స్‌...

పాశ్చాత్య దేశాల్లో పుట్టినరోజు చేసుకునే చిన్నారులను వెన్నుతట్టి మంచి జరగాలని పెద్దలు కోరుకుంటారు. క్రమేపీ యువతకూ ఇది అలవాటుగా మారింది. వెన్ను తట్టడం దగ్గర నుంచి చితకబాదడం దాకా మార్పు చెందింది. తొలుత దిల్లీకి పరిచయమైన ఈ సంస్కృతి... ఇప్పుడు భాగ్యనగర యువతకూ అలవడింది. ఫలితంగా ఆనందంగా సాగాల్సిన వేడుకల్లో హాహాకారాలు చోటు చేసుకుంటున్నాయి. నెక్లెస్‌రోడ్‌, ట్యాంక్‌బండ్‌లాంటి బహిరంగ ప్రదేశాలతో పాటు నగరంలో యువత ఉండే గదుల్లో ఈ ధోరణి ఎక్కువ.

స్నో స్ప్రేతోనూ ప్రమాదం

వేడుకల్లో భాగంగా వెలిగించే మెరుపుల కొవ్వొత్తులు మండే సమయంలో యువత   స్నో స్ప్రేను పిచికారీ చేస్తున్నారు. ఆ స్ప్రేకి మండే స్వభావముంటుంది. కొవ్వొత్తిని ఆర్పక ముందే దాన్ని వాడటంతో మంటలు రేగుతున్నాయి. ఇలాంటి ఘటనల వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.