close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. తేలని ‘కుమార’పరీక్ష: అసెంబ్లీ మళ్లీ వాయిదా

కర్ణాటక రాజకీయ సంక్షోభం క్షణానికో మలుపు తిరుగుతోంది. తమ ఆధిక్యాన్ని నిరూపించుకునేందుకు సీఎం కుమారస్వామి ఈ ఉదయం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దానిపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో హైడ్రామా నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేశారంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటే.. విశ్వాసపరీక్షను వాయిదా వేసేందుకు సంకీర్ణం ఎత్తులు వేస్తోందని భాజపా దుయ్యబట్టింది. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభను మళ్లీ సాయంత్రానికి వాయిదా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. తెలంగాణలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు

తెలంగాణలో కొత్తగా మరో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ గురువారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో కొత్తగా కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలతో కోరుట్ల డివిజన్ ఏర్పాటైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో కొత్తగా కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాలతో కొల్లాపూర్ డివిజన్‌ను ఏర్పాటు చేశారు.

3. టిక్‌టాక్‌, హలో యాప్‌లకు కేంద్రం నోటీసులు

చైనాకు చెందిన సామాజిక మాధ్యమాలైన టిక్‌ టాక్‌, హలో యాప్‌లకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయా యాప్‌లు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయని వచ్చిన ఆరోపణలపై సదరు సంస్థలకు 21 ప్రశ్నలతో  కూడిన నోటీసులను జారీ చేసింది. సరైన వివరణ రాకపోతే ఆ రెండు యాప్‌లను దేశంలో నిషేధిస్తామని హెచ్చరిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నోటీసులు జారీ చేసిందని అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ రెండు యాప్‌లపై వచ్చిన ఆరోపణలపై ఐటీ శాఖ ఆయా సంస్థల నుంచి వివరణ కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ‘అమరావతి పరిధిలో వ్యవస్థంతా కుదేలవుతోంది’

ఉండవల్లిలో తాను అద్దెకు ఉంటున్న నివాసం నదీ పరీవాహకం కిందికి రాదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. గూగుల్‌లో చూసినా కృష్ణా నది భవాని ఐల్యాండ్‌ నుంచి చూపిస్తుందన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ ఉండటం వల్ల పాయ చీలి నీరు ఇటువైపునకు వస్తోందని చెప్పారు. అసెంబ్లీ వద్ద చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మట్లాడారు. కొత్త ప్రభుత్వం వచ్చాక గన్నవరంలో విమాన రాకపోకలు తగ్గిపోయాయని ఆయన ఆరోపించారు. సింగపూర్‌ విమానంతో పాటు చాలా విమానాలను రద్దు చేశారని.. ఎక్కడికి వెళ్లాలన్నా మళ్లీ హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. తిరుపతి-కాకినాడ మధ్య 80 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి- కాకినాడ టౌన్‌ స్టేషన్ల మధ్య 80 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 1 నుంచి‌ నవంబర్‌ 1 వరకు ఈ రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. తిరుపతిలో 07432 నంబరు గల రైలు ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. తిరిగి కాకినాడ టౌన్‌లో 07431 నంబరు గల రైలు ప్రతి సోమ, బుధ, శుక్ర వారాల్లో రాత్రి 9 గంటలకు బయల్దేరి ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఈసారి ఉత్తమ నటుడు ఎవరు?

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలకు సంబంధించి  ఏటా నిర్వహించే సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నారు. వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. సినీ రంగానికి విశిష్ఠ సేవలు అందించిన ప్రముఖులను సత్కరిస్తారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులతో ఆగస్టు 15, 16వ తేదీల్లో సైమా అవార్డుల వేడుకలను ఖతార్‌లోని దోహాలో ఘనంగా నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఆ ఉత్కంఠలోనే నీషమ్‌ కోచ్‌ మృతి!

ప్రపంచకప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఏ స్థాయిలో ఉత్కంఠకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. బంతి బంతికి ఆధిపత్యం చేతులు మారుతూ సగటు క్రికెట్‌ అభిమానికి ఎక్కడ లేని ఉద్వేగాన్ని పంచింది. అయితే ఈ మ్యాచ్‌ సందర్భంగా కివీస్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ చిన్ననాటి కోచ్‌ డేవ్‌ గొర్డాన్‌ ప్రాణాలు విడిచినట్లు తెలిసింది. సూపర్‌ ఓవర్‌లో రెండో బంతిని నీషమ్‌ సిక్సర్‌ కొట్టిన సమయంలోనే గొర్డాన్‌ తుది శ్వాస విడిచారని ఆయన కుమార్తె లియోని పేర్కొన్నట్లు స్థానిక మీడియా కథనం ద్వారా తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. హఫిజ్‌ అరెస్టుపై అమెరికా పెదవి విరుపు

ముంబయి బాంబు దాడుల సూత్రధారి, జమాత్‌-ఉద్‌ దవా అధిపతి హఫిజ్‌ సయీద్‌ అరెస్టుపై అమెరికా స్పందించింది.  దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తం చేసిన కాసేపటికే యూటర్న్‌ తీసుకుంది. రెండేళ్లుగా తాము ఒత్తిడి పెంచడం వల్లే అతణ్ని పాక్‌ అరెస్టు చేసిందని ట్రంప్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. పదేళ్ల గాలింపు తర్వాత ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి పాకిస్థాన్లో అరెస్టయ్యాడని, అతడిని అదుపులోకి తీసుకోవాలంటూ రెండేళ్లుగా పాక్‌పై బాగా ఒత్తిడి చేశామని ట్రంప్‌ పేర్కొన్నారు. తర్వాత కాసేపటికే అమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది. హఫిజ్‌ సయీద్‌ అరెస్టు విషయం నమ్మేలా లేదని యూఎస్‌ స్టాండింగ్‌ కమిటీ ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. విరామమా? వీడ్కోలా? ధోనీనే అడగండి

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ రనౌట్‌తో భారత్‌ కథ ముగిసింది. ప్రస్తుతానికైతే జట్టు సభ్యులందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎంఎస్‌ ధోనీ పరిస్థితే ఎవరికీ అర్థం కావడం లేదు. రిటైర్‌ అవుతాడా? ఇంకా ఆటలో కొనసాగుతాడా? ఐతే ఎంతకాలం?జట్టులో ఇప్పుడతని పాత్ర ఏంటీ?ఒక మార్గదర్శిగా కోహ్లీసేనలో 15వ ఆటగాడిగా ఉంటాడా?ఇలా ఎడతెగని చర్చ జరుగుతోంది. అసలింత సాగదీత ఎందుకు? భవిష్యత్తుపై తన ఉద్దేశమేంటో ధోనీనే అడిగితే సరిపోతుందిగా అంటున్నారు మాజీ చీఫ్‌ సెలక్టర్లు, ఆటగాళ్లు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. అమ్మకాలతో షేరు మార్కెట్‌ వెల వెల

నేడు దలాల్‌ స్ట్రీట్‌లో మార్కెట్‌ సూచీలు గురువారం నిరాశజనకంగా కనిపించాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు,ఆటోమొబైల్‌ రంగాల్లో షేర్ల అమ్మకాలు భారీగా జరిగాయి. సెన్సెక్స్‌ 318 పాయింట్లు తగ్గి 38,897 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్‌ సూచీలో వెనుకబడిన సంస్థలలో యస్‌బ్యాంకు, టాటామోటార్సు, ఓన్‌జీసీ, మారుతి సంస్థలు ఉన్నాయి. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 11,597 పాయింట్ల వద్దట్రేడింగ్‌ ముగించింది. యస్‌బ్యాంకు షేరు 15 శాతం తగ్గి షేరు విలువ కోల్పోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.