close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. కర్ణాటక అప్‌డేట్: సభ రేపటికి వాయిదా

కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ -జేడీఎస్‌ సభ్యుల ఆందోళన నేపథ్యంలో సభ రేపటికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరిగి సభ సమావేశం కానుంది. విప్‌ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అస్పష్టంగా ఉందంటూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దీనిపై భాజపా సభ్యులు నిరసనబాట పట్టారు. తమ ఎమ్మెల్యేలంతా రాత్రంతా ఇక్కడే ఉంటారని, ఇక్కడే ధర్నా చేస్తామని ఆ పార్టీ నేత యడ్యూరప్ప ప్రకటించారు. సభ వాయిదాపడిన అనంతరం కాంగ్రెస్‌- జేడీఎస్‌ సభ్యులు బయటకు రాగా.. భాజపా ఎమ్మెల్యేలు మాత్రమే సభలోపలే ఉండిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కొత్త కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌ ... ఏ జట్టుకంటే?

క్రికెట్‌ ప్రపంచకప్‌లో ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో బౌండరీలతో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిలపడంలో ఆ జట్టు కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రధాన కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌ నియమితుడయ్యాడని ఎస్‌ఆర్‌హెచ్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకుంది. గతంలో కూడా ఐపీఎల్‌లో ట్రెవర్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కోచ్‌గా ఉన్న సమయంలో ఆ జట్టు రెండుసార్లు విజేతగా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఆలయంలో తొక్కిసలాట..నలుగురి మృతి

తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరద రాజస్వామి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటనలో నలుగురు భక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు భక్తులు కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఏపీకి చెందిన మహిళతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. నేను ఎలాంటి టర్న్‌లు తీసుకోలేదు:రాజగోపాల్‌రెడ్డి

తాను ఇప్పటికీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేనేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎలాంటి టర్న్‌లు తీసుకోలేదని, భాజపాలోకి వెళ్తానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. భాజపాకు ఉన్నది ఒక్కరే ఎమ్మెల్యే అని, తనను రమ్మంటున్నా తానే వెళ్లడం లేదని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకత్వం తప్పులు చేస్తోందన్న బాధ, ఆవేదనతోనే తెరాసకు భాజపా ప్రత్యామ్నాయమని చెప్పానన్నారు. తనను పార్టీలో కొనసాగాలని ఓ కార్యకర్త సూచించారని.. ఆ కార్యకర్తకు అండగా మాట్లాడినట్లు చెప్పారు. దాన్ని మీడియా తప్పుగా రాసిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శాసనసభ వాయిదా పడిన వెంటనే నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక గవర్నర్‌ను నియమించిన తర్వాత గవర్నర్ నరసింహన్‌ను కేసీఆర్ కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎత్తిపోసిన నీటి వివరాలను గవర్నర్‌కు కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన అంశాల పురోగతిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. స్వదేశానికి చేరుకున్న కోహ్లీ

భారత్‌ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. గురువారం అతడు, అతని భార్య అనుష్క శర్మ ముంబయి విమానాశ్రయంలో దిగారు. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన టీమిండియా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. అయితే బీసీసీఐ వెంటనే టికెట్లు ఏర్పాటు చేయకపోయేసరికి భారత ఆటగాళ్లు కొన్ని రోజులు ఇంగ్లాండ్‌లోనే ఉండాల్సి వచ్చింది. కానీ రోహిత్‌ శర్మ అందరికంటే ముందుగానే స్వదేశానికి వచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. బెంగాల్‌ టైగర్‌కూ వరద కష్టాలు..

వరదల ధాటికి అసోం జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ ప్రభావం కేవలం ప్రజలపైనే కాకుండా మూగజీవాలను కూడా వణికిస్తోంది. రాష్ట్రంలోని కాజీరంగా జాతీయ ఉద్యానవనం దాదాపు 95శాతం మేర నీట మునిగింది. దీంతో అక్కడి వన్యప్రాణులు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో ఓ పెద్ద పులి వరద బారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు సమీపంలో ఉన్న ఇంట్లోకి వెళ్లి తలదాచుకుంది. అక్కడే ఉన్న బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటుంది. ఆకలితో అలమటిస్తూ దీనావస్థలో విశ్రాంతి తీసుకుంటున్న ఆ బెంగాల్‌ టైగర్‌ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయండి’

పోలీసులు చేసే ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందేనని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు తర్వాత వెంటనే ఆ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఏపీ పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంలో సవాల్‌ చేశాయి. తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ తీర్పు వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. హామ్‌లేస్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్‌

బ్రిటన్‌కు చెందిన హామ్‌లేస్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌(హెచ్‌జీహెచ్‌ఎల్‌)సంస్థను రిలయన్స్‌ బ్రాండ్స్‌ కొనుగోలు చేసే ప్రక్రియ గురువారం పూర్తయ్యింది. రిలయన్స్‌ మొత్తం ఆ సంస్థను రూ. 580 కోట్లకు దక్కించుకుంది. పిల్లల ఆటవస్తువులు తయారు చేయడంలో సూమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హెచ్‌జీహెచ్‌ఎల్‌ సంస్థ 18 దేశాలలో మొత్తం 167 స్టోర్లను కలిగిఉంది. లండన్‌లో ఈ సంస్థకు ఉన్న ఏడంతస్తుల భవనంలో సుమారు 50 వేల రకాల ఆటబొమ్మలు అమ్మకానికి ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. జాదవ్‌ను వెంటనే విడుదల చేయాలి: భారత్‌

కుల్‌భూషణ్‌ జాదవ్‌ను వెంటనే విడుదల చేసి స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను కోరింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌కు మరణశిక్ష విధింపుపై పాక్‌ పునరాలోచించాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం భారత పార్లమెంటులో విదేశాంగ మంత్రి జయశంకర్‌ మాట్లాడుతూ.. అమాయకుడైన జాదవ్‌పై పాక్‌ కావాలనే కేసులు పెట్టిందని, ఎలాంటి చట్టపరమైన విచారణ లేకుండానే అతన్ని దోషిగా నిర్ధారించిందని ఆరోపించారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించి జాదవ్‌ను వెంటనే విడుదల చేసి భారత్‌ పంపాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.