close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. డిస్కంలను నష్టాల బాట పట్టించారు: జగన్‌

విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) మనకు మార్గదర్శకాలు ఇస్తుందని సీఎం జగన్‌ అన్నారు. తెదేపా హయాంలో ఈఆర్‌సీ చెప్పిన దానికంటే ఎక్కువగా విద్యుత్‌ను కొనుగోలు చేశారని చెప్పారు. 2015-16లో 5 శాతం కొనుగోలు చేయాలని ఈఆర్‌సీ చెబితే దానికంటే ఎక్కువగానే కొన్నారని జగన్‌ విమర్శించారు. 2017-18లో 9 శాతం కొనుగోలు చేయాలంటే 19 శాతం.. 2018-19లో 11 శాతం చేయమంటే 23.4శాతం కొన్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిసీ అలా చేయడం మంచి పద్ధతా? అని జగన్‌ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాములు నాయక్‌కు సుప్రీం కోర్టులో ఊరట

ఎమ్మెల్సీల అనర్హత వేటు వ్యవహారంలో రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాములు నాయక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తుది తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపవద్దని తెలంగాణ ప్రభుత్వం, మండలి ఛైర్మన్‌కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. తనపై అనర్హత వేటు విధిస్తూ అప్పటి శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాములు నాయక్‌ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీ గవర్నర్‌ ప్రమాణానికి ముహూర్తం ఖరారు

ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న ఉదయం 11.30 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 23న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం 3.40గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం కనక దుర్గమ్మను దర్శించుకోనున్న బిశ్వభూషణ్‌.. అనంతరం విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీ అసెంబ్లీలో చర్చలపై ఆసక్తిలేదు: కేటీఆర్‌

కొత్త పురపాలక చట్టం అవినీతిని పారదోలుతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రాజకీయ జోక్యం తగ్గి ప్రజలకు పారదర్శక సేవలు అందుతాయన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిలో పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ఏపీ అసెంబ్లీలో చర్చలపై మాకు ఆసక్తిలేదు. కర్ణాటక గురించి కూడా లేదు. ఎమ్మెల్యేలు, జర్నలిస్టుల స్థలాల కేసు సుప్రీంకోర్టులో ఉంది. వారం రోజుల్లో పరిష్కరించాలని సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు. సమస్యల పరిష్కారంపై త్వరలోనే జర్నలిస్టు ప్రతినిధులతో భేటీ అవుతా. గవర్నర్‌ను మార్చడంపై సమాచారం లేదు’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తప్పుడు సంకేతాలతో వైకాపా మభ్యపెడుతోంది

విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ తెచ్చింది తెదేపానే అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్‌ సంస్కరణలు తెదేపా ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తు చేశారు. గతంలో 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత ఉంటే పూర్తిగా దాన్ని రూపుమాపామని చెప్పారు. రికార్డుల ఆధారంగానే మాట్లాడుతున్నానని, వైకాపా సభ్యులు తప్పుడు సంకేతాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పీపీఏలపై వైకాపా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని చంద్రబాబు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘కుమార’కు గవర్నర్ మరో డెడ్‌లైన్‌!

కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బలపరీక్షపై గవర్నర్‌ వాజూభాయి పటేల్‌ ఇచ్చిన డెడ్‌లైన్‌ ముగిసినప్పటికీ విధానసభలో కుమార స్వామి తన బలాన్ని నిరూపించుకోకపోవడంతో గవర్నర్‌ ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. ఈ సాయంత్రం 6గంటల్లోపు సభలో బల పరీక్ష పూర్తిచేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన రాజ్‌భవన్‌ నుంచి విధాన సౌధకు సమాచారం అందించారు. రాష్ట్రంలో నెలకొన్న నాటకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దేశాన్ని నిరాశ్రయుల రాజధానిగా మార్చలేం

అసోంలో జాతీయ పౌరసత్వ జాబితా(ఎన్‌ఆర్‌సీ) రూపకల్పనకు విధించిన జులై 31 గడువును పొడగించాలంటూ కేంద్రంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రపంచంలో భారత్‌ను నిరాశ్రయుల రాజధానిగా మార్చలేమని కేంద్రం వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై వాదనలు స్వీకరించింది. అలాగే ఎన్‌ఆర్‌సీ ముసాయిదా నమూనాలను పరిశీలించాలని కేంద్రం కోర్టును కోరింది. బంగ్లాదేశ్‌ సరిహద్దు గ్రామాల్లోని లక్షలాది మందిని స్థానిక అధికారులు అక్రమంగా జాబితాలో చేర్చారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గత ప్రభుత్వాల వల్లే ఈ ఆర్థిక వ్యవస్థ: ప్రణబ్‌

భారత్‌ ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుండడానికి గత ప్రభుత్వాలు వేసిన బలమైన పునాదులే కారణమని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ 55 ఏళ్ల పాలనను విమర్శిస్తున్న వారు స్వాతంత్ర్యం వచ్చిన నాటితో పోలిస్తే భారత్ ఇప్పుడు ఎక్కడ ఉందనే విషయాన్ని విస్మరిస్తున్నారన్నారు. ‘ఫర్దరింగ్‌ ఇండియాస్‌ ప్రామిస్‌’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను ఆయన తప్పుబట్టారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం, పంచవర్ష ప్రణాళికల వ్యవస్థను తొలగించడాన్ని ఆయన ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

స్టాక్‌మార్కెట్లు ఈ వారాంతాన్ని భారీ నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ రెండు నెలల కనిష్ఠానికి దిగజారాయి. అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 560 పాయింట్లు తగ్గి 38,337 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు నష్టపోయి 11,419 వద్దకు చేరింది. ముఖ్యంగా ఆటోమొబైల్‌, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్సు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, మారుతీ సుజుకీ, ఐషర్‌ మోటార్స్‌ నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లాల్‌దర్వాజా అమ్మవారి బోనాలు.. చిత్రాలు

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.