close

తాజా వార్తలు

కష్టపడకుండా.. ఇష్టమైన సంఖ్య

ఇకపై ఆన్‌లైన్‌లో ఫ్యాన్సీ నంబర్లకు పోటీ
పైరవీకారులకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట
ఈనాడు, హైదరాబాద్‌

వాహనాల ఫ్యాన్సీ నంబర్ల కోసం ఇక నుంచి ఆన్‌లైన్‌లో పోటీ పడే విధంగా రవాణాశాఖ నిబంధనలకు రూపకల్పన చేస్తోంది.  దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌లో పూర్తిగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. నెలరోజుల వ్యవధిలో ఈ కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. నగరంలో ఖరీదైన కార్లు ఇతర వాహనాలు కొనే వారు ఫ్యాన్సీ నెంబరు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ నెంబర్లను ప్రతి మూడు నెలలకోసారి వేలం వేస్తోంది. నిర్ణీత ధర కంటే ఎక్కువ చెల్లించే వారికి ఫ్యాన్సీ నెంబర్లను కేటాయిస్తోంది. దీంతో ఏటా రూ.కోట్లలోనే రవాణాశాఖకు ఆదాయం సమకూరుతోంది.

గ్రేటర్‌లోనే ఎక్కువ..
ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, మెహిదీపట్నం, ఉప్పల్‌, అత్తాపూర్‌, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌, కూకట్‌పల్లి తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో ఫ్యాన్సీ నెంబరు కోసం వేలం పాట నిర్వహిస్తుంటారు. ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో ఈ నెంబర్లకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఈ క్రమంలో ఫ్యాన్సీ నెంబర్లు దక్కించుకోవడానికి పైరవీల జాతర నడుస్తోంది. వాస్తవానికి ఒక ఫ్యాన్సీ నెంబరు కోసం ఒకరికి కంటే ఎక్కువ మంది పోటీ పడితే ఎవరు ఎక్కువకు కోట్‌ చేస్తే వారికే కేటాయించాలి. కొన్నిసార్లు 9, 999, 9999 నంబర్లకు విపరీతమైన పోటీ ఉంటోంది. మిగతా ఫ్యాన్సీ నెంబర్లు కోసం కూడా ఎక్కువ పోటీనే ఉంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్సీ నెంబర్లకున్న డిమాండ్‌ను కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. కొత్త ఫ్యాన్సీ నెంబరు  పొందాలనుకుంటే నిర్ణీత మొత్తానికి డీడీ తీయాలి. దరఖాస్తుతోపాటు సమీపంలోని రవాణాశాఖ కార్యాలయంలో ఈ డీడీని అందించాలి. ఒకరికి కంటే ఎక్కువ మంది ఉంటే వారి మధ్య పోటీ ఉంటుంది. అయితే ఇక్కడే దళారులు రంగంలోకి దిగుతారు. బిడ్డింగ్‌లో పాల్గొన్న వారిని దళారులు ఆశ్రయించి మాయమాటలతో పోటీ నుంచి తప్పుకొనేలా చేస్తుంటారు. ఎంతోకొంత డబ్బులను ఆశచూపటం...లేదంటే ఆ నెంబరు పొందడం చాలా కష్టమని చెప్పడం...ఏదోలా వారిని తమ దారికి తెచ్చుకొని పోటీ నుంచి తప్పుకొనేలా చేస్తుంటారు. ఇలా చాలామందిని పోటీ నుంచి తప్పించి సదరు నెంబరును అనుకున్న వ్యక్తికి వచ్చేలా చేస్తుంటారు. ఇందుకు వాహనదారుల నుంచి భారీగా కమీషన్లు గుంజుతుంటారు. కోరుకున్న నెంబరు కోసం కొందరు వాహనదారులు ఎంత డబ్బులైనా చెల్లించేందుకు ముందుకు వస్తుంటారు. దీంతో గ్రేటర్‌ వ్యాప్తంగా ఈ తరహా దందా గుట్టుచప్పుడు కాకుండా మూడు పువ్వులు ఆరు కాయలన్న చందంగా సాగుతోంది. ఫ్యాన్సీ నెంబర్లకు నగరంలోనే ఎక్కువ డిమాండ్‌ ఉంది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, సంఖ్యాశాస్త్రంపై ఆసక్తి ఉన్న వారు ఇలాంటి నెంబర్లను తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. వారి అవసరం దళారులు, కొందరు ఆర్టీఏ సిబ్బందికి కాసులు కురిపిస్తోంది.

ఇక పైరవీలు సాగవు...
ఇక నుంచి ఇలాంటి పైరవీలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఫ్యాన్సీ నెంబరును దక్కించుకోవడానికి రవాణాశాఖ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే పోటీలో పొల్గొనవచ్చు. అనుకున్న నెంబరు కావాలంటే ఆఫ్‌సెట్‌ ధర చెల్లించి ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకోవాలి. డబ్బులు కూడా క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు ఇతర వ్యాలెట్‌ల ద్వారా నిర్ణీత ధర చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. అనంతరం బిడ్డింగ్‌ కూడా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఒకరు కోట్‌ చేసిన ధర కంటే వేరెవరైనా ఎక్కువ ధరకు కోట్‌ చేయవచ్చు. వారి కంటే ఇంకొకరు ఎక్కువ చెల్లించవచ్చు. నిర్ణీత సమయం తర్వాత ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ఆగిపోతుంది. ఆఖరుగా ఎక్కువ బిడ్డింగ్‌ చేసిన వ్యక్తి సదరు ఫ్యాన్సీ నెంబరు దక్కించుకుంటారు. ఒకసారి నెంబరు ఖరారైన తర్వాత డిపాజిట్‌ కాకుండా అదనపు డబ్బులు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఇందులో దళారుల ప్రమేయం ఉండదని, పైరవీలకు ఎలాంటి అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని, త్వరలో ఈ సేవలు గ్రేటర్‌తోపాటు అన్నిచోట్ల అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దీంతో ఫ్యాన్సీ నెంబరు కోరుకునే వారికి ఇదో పెద్దఊరటగా భావిస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.