close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9AM

1. నేటి నుంచి జీఎస్‌ఎల్‌వీ కౌంట్‌డౌన్‌

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహక నౌకను ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. కౌంట్‌డౌన్‌ ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభం కానుంది. ఇది 20 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగిన తరువాత జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక 3.8 టన్నుల బరువు గల చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. నేడు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు

ఆషాఢమాస బోనాలకు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి ఆలయం సిద్ధమైంది. ఉత్సవాల్లో తొలిరోజు ఆదివారం తెల్లవారుజామున 4గంటల నుంచే ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబ సభ్యులు మహాకాళికి తొలి బోనం, వెండి తొట్టెలు సమర్పించనున్నారు. మాజీ ఎంపీ కవిత బోనం తీసుకొస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, నేతలు, ఆయా రంగాల ప్రముఖులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. విద్యుత్తు అంతరాయాలపై వాస్తవ పత్రం 

విద్యుత్తు సరఫరా పరిస్థితి, అంతరాయాలపై రోజువారీగా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఏపీ విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ ఆదేశించారు. నాణ్యమైన విద్యుత్తును అందించే చర్యల్లో భాగంగా రోజూ/తరచుగా బులెటిన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు సమాచారం తెలియజేయడంతోపాటు ప్రభుత్వానికీ నివేదికలు ఇవ్వాలని శనివారం టెలికాన్ఫరెన్స్‌లో డిస్కంలు, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో అధికారులకు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

4. రోగ నిర్ధారణలో ముందడుగు

అత్యధిక జనాభా, జన్యు వైవిధ్యం కలిగిన మన దేశంలో ఎక్కువమంది జన్యుపరమైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ తరహా వ్యాధుల మూలాలు తెలుసుకునేందుకు పరిశోధనలు కొనసాగుతున్నా పరిమిత సాంకేతికత పరిజ్ఞానంతో జన్యు విశ్లేషణకు చాలా సమయం పడుతోంది. ఈ ప్రక్రియను  సులభతరం చేసేందుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) కొత్తతరం సీక్వెన్సింగ్‌(ఎన్‌జీఎస్‌) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన యంత్రాన్ని కేంద్ర ఆరోగ్య, శాస్త్ర, సాంకేతికత శాఖ మంత్రి హర్షవర్ధన్‌ శనివారం ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీరాకే బయటకు

తెలంగాణలో వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ప్రాజెక్టుల అవసరాలు తీరాకే గోదావరి జలాలను వేరే బేసిన్‌కు మళ్లించాలని.. ఉన్న నీళ్లు ఇక్కడి అవసరాలకే సరిపోతాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య జరిగే ఒప్పందాలు, ప్రణాళికలు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమని, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోరాదని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో తెలంగాణ వాటా దక్కలేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. వికేంద్రీకరణ దిశగా ముందడుగు

తెలంగాణ నూతన పురపాలక చట్టం వికేంద్రీకరణ, జవాబుదారీతనం దిశగా బలమైన ముందడుగు అని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. పౌర సేవలను హక్కుగా అమలు చేసేలా చట్టాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, శాసనసభకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజల మీద పెత్తనం చేయడం, వారిని ఎంత పీడిస్తే అంత గొప్ప అనే ధోరణిని ప్రభుత్వ ఉద్యోగుల్లో తొలగించాలన్న ఆకాంక్ష సర్కారులో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

7. భూమ్మీద ఏ శక్తీ ఆపలేదు

కశ్మీరు సమస్య కచ్చితంగా పరిష్కారమౌతుందని, భూమ్మీదున్న ఏ శక్తీ దాన్ని ఆపలేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నొక్కి చెప్పారు. ‘కార్గిల్‌యుద్ధ’ వీరులకు యావద్దేశం శనివారం ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఆయన కథువాలోని ‘ఉఝ్‌’, సాంబాజిల్లాలోని ‘బసంతర్‌’లలో సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన రెండు వంతెనలను జాతికి అంకితం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ

సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు-2019 ఆ చట్టానికి చావు దెబ్బ అని కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్లమెంట్‌ సభ్యులకు ఆయన ఓ లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉన్నంత స్వతంత్రత సహ కమిషనర్లకు ఉందన్నారు. సవరణ బిల్లు ఆమోదం పొందితే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు పూర్తిగా తమకు లొంగి ఉండేవారిని కమిషనర్లుగా నియమిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. హెచ్‌ఐవీ రక్తం ఎక్కిస్తారా?

శస్త్రచికిత్స సమయంలో ఓ ఏడు నెలల బాలుడికి హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఘటనపై చెన్నైలోని 17వ అదనపు సిటీ సివిల్‌ కోర్టు జడ్జి తేన్‌మొళి తీవ్రంగా స్పందించారు. 20 ఏళ్ల నాటి ఈ కేసులో బాధిత బాలుడికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని  చెన్నైలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ హెల్త్‌, హాస్పిటల్‌’ డీన్‌కు ఆదేశాలిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. తొలి అడుగులో తడబడి

ఆటగాళ్లు మారినా.. కొత్త కెప్టెన్‌, కోచ్‌ వచ్చినా..  తెలుగు టైటాన్స్‌ ఆటతీరు మారలేదు. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ఆ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌ తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది.. సొంత అభిమానుల నడుమ అన్ని విభాగాల్లోనూ విఫలమై యు ముంబా చేతిలో ఓటమి మూటగట్టుకుంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌పై డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెంగళూరు బుల్స్‌ బోణీ కొట్టింది. మరోవైపు  ఇండోనేసియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పీవీ సింధు అదరగొడుతోంది. సెమీఫైనల్లో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ చెన్‌ యుఫీ (చైనా)ను ఓడించి ఫైనల్‌కు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.