close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

సీపీఐ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తెలుగు వ్యక్తి సురవరం సుధాకర్‌ రెడ్డి  వైదొలిగారు. ఆయన స్థానంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.రాజా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాల వల్లే తాను బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సురవరం ప్రకటించారు. తన రాజీనామాకు జాతీయ కౌన్సిల్‌ ఆమోదం తెలిపిందన్నారు. ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్నప్పటికీ కార్యదర్శివర్గ సభ్యుడిగా కొనసాగుతానని చెప్పారు. రాజా నాయకత్వంలో పార్టీ పురోగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విండీస్‌ టూర్‌కు టీమిండియా జట్లు

వచ్చే నెల నుంచి ప్రారంభంకానున్న వెస్టిండీస్‌ టూర్‌కు టీమిండియా జట్లను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశానికి కెప్టెన్‌ కోహ్లీతో సహా పలువురు బీసీసీఐ అధికారులు హాజరయ్యారు. ఆగస్టు 3వ తేదీ నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులను టీమిండియా ఆడనుంది. ఇటీవల ప్రపంచకప్‌లో అనూహ్యంగా సెమీస్‌ నుంచి వైదొలిగిన తర్వాత కెప్టెన్‌ కోహ్లీ.. బీసీసీఐ అధికారులతో సమావేశమవ్వడం ఇదే తొలిసారి. కాగా మూడు ఫార్మాట్లకు విరాట్‌ కోహ్లీనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్‌

సికింద్రాబాద్‌ శ్రీ మహంకాళీ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. క్యూలో నిల్చున్న భక్తులకు అభివాదం చేశారు. అంతకుముందు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి మంత్రి అమ్మవారిని దర్శించుక్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఫైనల్లో సింధు ఓటమి

ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి. సింధు ఓటమి పాలయింది. ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను అందుకోవాలనుకున్న సింధుకు నిరాశే మిగిలింది. జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగూచితో తలపడిన తుదిపోరులో 19-21, 16-21 తేడాతో తెలుగమ్మాయి ఓడింది. క్వార్టర్స్‌, సెమీస్‌లో అద్భుతంగా రాణించిన సింధు ఫైనల్లో 51 నిమిషాల్లోనే ప్రత్యర్థి ముందు తలవంచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘షీలాజీ నాకు ప్రత్యేక కానుక’

దేశరాజధాని దిల్లీకి 15ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. షీలా మరణంతో కాంగ్రెస్‌ పార్టీ పెద్దదిక్కును కోల్పోయింది. ఈమె మరణంపై యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఉద్వేగభరిత లేఖ రాశారు. షీలా కుమారుడు సందీప్‌, కుమార్తె లతికలను ఉద్దేశించిన ఈ లేఖను ఆమె ట్విటర్‌లో పంచుకున్నారు. ‘షీలాజీ మరణం నా గుండెల్లో బాధను నింపింది. మీ తల్లి నా మనసులో అంతలా నిండిపోయారు. షీలా నాకు ప్రత్యేకమైన బహుమతిలాంటివారు. నేను వ్యక్తిగతంగా ఆమెతో సన్నిహితంగా మెలగడానికి ఇదే కారణం’’ అంటూ లేఖలో సోనియా చెప్పుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘హోదా’పై జగన్‌ వైఖరి సరికాదు: పురందేశ్వరి

ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్‌ వైఖరి సరికాదని కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. హోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పినా ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో ఆమె మాట్లాడారు. గ్రామ సచివాలయ విధానంతో అనేక మందికి ఇబ్బందులు తలెత్తుతాయని పురందేశ్వరి అన్నారు. రేషన్‌ డీలర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరారు. ఇసుక, మట్టి విధానంలో ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విదేశాల్లో ఉన్నా ఆహారపు అలవాట్లు మరవొద్దు

ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు అందించడంలో భారతీయ మూలాలున్న వైద్యులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో ఉత్తమ వైద్యం అందించే ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణలో మూడు రోజులపాటు జరిగే అంతర్జాతీయ ఆరోగ్య సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య కల్పన బాధ్యత ఒక్క ప్రభుత్వానిదే కాదని, ప్రైవేటు భాగస్వామ్యం కూడా చాలా అవసరమన్నారు. విదేశాల్లో ఉన్నా మాతృదేశ ఆహారపు అలవాట్లు మరిచిపోవద్దన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎయిరిండియాలో ప్రమోషన్లు బంద్‌

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రవేటు పరం చేసే ప్రతిపాదన చర్చల దశలోఉండగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో లార్జ్‌ స్కేల్‌ ప్రమోషన్లు, అపాయింట్మెంట్‌లను నిలిపివేయాలని యాజమాన్యానికి సూచించినట్లు తెలుస్తోంది. కొత్త విమానాలను కూడా అత్యవసరమైతేనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ(దీపం) నుంచి ఈ మార్గదర్శకాలు జారీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఎయిరిండియా అధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు. ఈ ఆదేశాలు వారానికి ముందే వచ్చాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. డోలీలో గర్భిణిని 4 కి.మీ. మోసుకెళ్లి!

పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని నాలుగు కిలోమీటర్ల మేర డోలీలో మోసుకొచ్చిన ఘటన విశాఖ జిల్లా వి.మాడుగుల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తవలస గ్రామానికి చెందిన జనపరెడ్డి దేవికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. గ్రామానికి సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో ఆమెను బంధువులు 4 కి.మీ. దూరంలో ఉన్న శంకరం పంచాయతీ వరకు డోలీలో మోసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చంద్రయాన్‌-2 ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.