close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9AM

1. జాబిల్లి వైపు నేడే పయనం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక(రాకెట్‌) ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్లనుంది. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2.43 గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఉన్న రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్‌-2 ప్రయోగం జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. తుది ఘట్టానికి కర్ణాటకం

కర్ణాటక రాజకీయాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వ భవితవ్యం సోమవారం తేలిపోనుందని భావిస్తున్నారు. విశ్వాస తీర్మానంపై సోమవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్‌ నిర్వహిస్తానని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించినందున సభలో ప్రతిక్షణం కీలకం కానుంది. మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు బెట్టు వీడటం లేదు. సభను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఓ వైపు రాజ్‌భవన్‌, మరో వైపు కేంద్ర ప్రభుత్వ నిఘా కళ్లు దృష్టి సారించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

3. బీసీలు, ముస్లింలకు సగం సీట్లిస్తాం

పురపాలక ఎన్నికల్లో బీసీలు, ముస్లింలకు యాభై శాతం టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కనీసం గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన మేరకైనా వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి పట్టణంలో పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అంతిమ లక్ష్యం ప్రత్యేక హోదాయే 

రాష్ట్రానికి మేలు చేసే లక్ష్యాలు ఎన్ని ఉన్నా వైకాపా అంతిమ లక్ష్యం ప్రత్యేక హోదాయేనని వైకాపా లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో కలిసి పోరాడాల్సిన అవసరం లేదన్నారు. పలు రాష్ట్రాలు కూడా ఇవ్వాలని అడుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం గతంలో ప్రకటించిన దాన్ని అమలు చేయాలని కోరుతోందన్నారు. ప్రత్యేకహోదాపై ఒత్తిడి తీసుకురాకపోవడం, పోలవరం ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మిస్తుందని కేంద్రం నుంచి తీసుకోవడం తెదేపా చేసిన తప్పిదాలని ఆయన ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కేంద్రంపై కినుక!

తెలంగాణలో అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములను కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఉన్న రాష్ట్రప్రభుత్వం.. అదే శాఖకు అవసరమైన భూకేటాయింపులపై పునరాలోచించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వికారాబాద్‌లో రక్షణశాఖ పరిధిలోని నౌకాదళానికి కేటాయించిన 2,934 ఎకరాల అప్పగింతను పెండింగులో పెట్టినట్లు తెలిసింది. ఈ అంశం కేంద్రం దృష్టికి వెళ్లడంతో నేవీ అధికారులు రంగంలోకి దిగితెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఆరోగ్య భారతానికి హామీ

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అలోపతీ, ఆయుష్‌ సేవలు అందించే ఆరోగ్య కేంద్రాలు పాటించాల్సిన కనీస ప్రమాణాలను ప్రతిపాదించింది. అన్ని ఆరోగ్య కేంద్రాలు అందించే సేవల్లో ఏకరూపత తీసుకురావడమే లక్ష్యంగా ‘క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (కేంద్ర ప్రభుత్వం) నిబంధనలు-2019’ చట్టానికి సవరణలు చేపట్టాలని కేంద్రం యోచిస్తోంది. అందులో భాగంగానే ఆరోగ్య కేంద్రాలు పాటించాల్సిన కనీస ప్రమాణాలను ప్రతిపాదించింది. 43 రోజుల్లోగా వాటిపై సూచనలు చేయాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. తెలుగులో తీర్పు చదువుకోవచ్చు

సుప్రీంకోర్టు తీర్పులు తెలుగు భాషలోనూ అందుబాటులోకి వచ్చాయి. ఆంగ్లంతోబాటు పలు భారతీయ భాషల్లో తీర్పు ప్రతులను సుప్రీంకోర్టు ఆదివారం తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇందులో తెలుగు సహా హిందీ, అస్సామీ, కన్నడ, కశ్మీరీ, మరాఠీ, ఒడియా, తమిళం, బెంగాలీ భాషలకు చెందిన 114 తీర్పు ప్రతులను అందుబాటులో ఉంచింది.  కేసు ఏ ప్రాంతానికి చెందిందో ఆ ప్రాంతానికి చెందిన కక్షిదారులు తీర్పు ప్రతిని చదువుకోవడానికి అనువుగా సదరు భారతీయ భాషలోకి అనువదించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

8. ఎన్నికల బాండ్లు ఎక్కువగా నగదు చేసుకున్నది దిల్లీలోనే

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు 2018 మార్చి నుంచి 2019 మే మధ్య కొనుగోలు చేసిన రూ.5,851.41కోట్ల విలువ గల ఎన్నికల బాండ్లల్లో (ఎలక్ట్రోరల్‌ బాండ్లు) దాదాపు 80.6శాతం బాండ్లను వాటిని పొందిన పార్టీలు దిల్లీలోనే నగదుగా మార్చుకున్నాయి. హైదరాబాద్‌లో రూ.806.12 కోట్ల విలువగల బాండ్లను విక్రయిస్తే పార్టీలు రూ.512.30కోట్లను ఇక్కడే నగదుగా మార్చుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఇమ్రాన్‌ఖాన్‌కు అమెరికాలో అవమానం

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అమెరికా గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. మూడురోజుల పర్యటనకు అమెరికా వెళ్లిన ఆయనను స్వాగతించేందుకు పాక్‌ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ ఖురేషీ, పలువురు పాకిస్థానీ అమెరికన్లు మాత్రమే వచ్చారు తప్ప అమెరికా మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. విమానాశ్రయం వద్దకు ఒక ప్రోటోకాల్‌ అధికారి మాత్రమే వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఖాన్‌ సోమవారం సమావేశం కానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. మళ్లీ ఓడిన టైటాన్స్‌

ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ బోణీ కోసం ఎదురు చూడాల్సిందే! పదేపదే అదే తప్పులను చేస్తున్న ఆ జట్టు లీగ్‌లో మరో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 26-39 తేడాతో తమిళ్‌ తలైవాస్‌ చేతిలో చిత్తయింది. మరోమ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌జెయింట్స్‌ మంచి విజయంతో ఆట మొదలుపెట్టింది. ఆ జట్టు 42-24 తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ బెంగళూరు బుల్స్‌ను చిత్తుచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.