close

తాజా వార్తలు

ఎక్కడున్నా ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తా:నరసింహన్‌

విజయవాడ: తాను ఎక్కడున్నా ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తానని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు గవర్నర్‌గా పనిచేశానని.. తెలిసో, తెలియకో తప్పులు చేసి ఉంటే తనను క్షమించాలని కోరారు. ఏపీకి కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నియమితులైన నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్‌ నరసింహన్‌కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసింహన్‌ మాట్లాడుతూ ఏపీలో కొత్తగా ఏర్పడిన వైకాపా ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలని ఆకాంక్షించారు. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు భావోద్వేగంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని.. 1951లో విజయవాడలోనే తన అక్షరాభ్యాసం జరిగిందన్నారు. అప్పట్లో విజయవాడలోని గవర్నర్‌పేటలో ఉండేవాళ్లమని నరసింహన్‌ గుర్తుచేసుకున్నారు. తనకు అహోబిలం నరసింహ స్వామి పేరు పెట్టారని.. ఈ రాష్ట్రానికి ఆ నరసింహుడి అండ ఎప్పుడూ ఉంటుందన్నారు. సీఎం జగన్‌ను తన కుమారుడిగా భావిస్తున్నట్లు చెప్పారు. కెప్టెన్‌గా జగన్‌ నాటౌట్‌ కాకూడదని నరసింహన్‌ వ్యాఖ్యానించారు.  రాజ్యాంగ నియమాల మేరకే శాసనసభ సమావేశాలు జరగుతున్నాయని ఆయన అన్నారు.

సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గవర్నర్‌ నరసింహన్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఆయనతో తనకు పదేళ్ల పరిచయం ఉందని.. తండ్రిలా తనను ఆదరించారని చెప్పారు.  గవర్నర్‌ నరసింహన్‌, విమల దంపతులను ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ దంపతులు సత్కరించారు. నరసింహన్‌కు వేంకటేశ్వరస్వామి ప్రతిమ జగన్‌ అందజేశారు. అనంతరం గవర్నర్‌ దంపతులను శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, పలువురు మంత్రులు, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, ఐఏఎస్‌ అధికారుల సంఘం తరఫున ఆర్పీ సిసోడియా, ఇతర అధికారులు సత్కరించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.