close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. మహానటికి జాతీయ కీర్తి

జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ప్రతిభ మరోసారి ద్విగుణీకృతమైంది. దిల్లీలో ప్రకటించిన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఏకంగా ఏడు జాతీయ పురస్కారాలతో తళుకులీనింది. ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘చి.ల.సౌ’, ‘అ!’ చిత్రాలు జాతీయ అవార్డుల్ని గెలుచుకున్నాయి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ నటిగా కీర్తి సురేష్‌ (మహానటి) జ్యూరీని మెప్పించింది. గుజరాతీ సినిమా ‘హెల్లారో’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. పెట్టుబడులకు అపార అవకాశాలు

విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై పునఃసమీక్ష నిర్ణయం, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేస్తూ తీసుకొచ్చిన చట్టం రెండూ పెట్టుబడులు, పరిశ్రమల రాకకు అనుకూలమైనవేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో శుక్రవారం  ‘డిప్లమాటిక్‌ అవుట్‌ రీచ్‌’ సదస్సు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని విదేశీ ప్రతినిధులకు జగన్‌ వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఆసియాలో అతిపెద్ద పరిశోధన కేంద్రం

సర్వీస్‌ నౌ డిజిటల్‌ వర్క్‌ ఫ్లో సంస్థ ఆసియాలోనే తన అతి పెద్ద, ప్రపంచంలో రెండో విస్తృత పరిశోధన, అభివృధ్ధి కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీ ఐటీ కేంద్రం(భవనం)లో ఈ కేంద్రాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ 2 వేల మందికి ఉపాధినివ్వడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మల్లన్న సిగ నుంచి దూకింది కృష్ణమ్మ

ప్రధాన నదులతోపాటు వాగులు, వంకల నుంచి వస్తున్న ప్రవాహాలతో రిజర్వాయర్లలోకి భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం నీటి మట్టం 880 అడుగులు దాటడం, ఎగువ నుంచి ప్రవాహం భారీగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం నాలుగు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు అయిదో గేటును పదకొండు గంటల సమయంలో ఆరో గేటును ఎత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మహి.. లేహ్‌లో మువ్వన్నెల జెండాతో!

జమ్మూకశ్మీర్‌లో సైనిక విధుల్లో ఉన్న మహేంద్రసింగ్‌ ధోని.. ఆగస్టు 15న లద్ధాఖ్‌లో జాతీయ పతాకం ఎగరేసే అవకాశం ఉంది. అధికారికంగా ఈ విషయాన్ని సైన్యం ధ్రువీకరించాల్సి ఉంది. అయితే.. లేహ్‌లో ఏదో  ఒక ప్రాంతం నుంచి స్వాతంత్య్ర దినోత్సవాన గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ ధోని మువ్వన్నెల జెండాను ఎగరేయొచ్చని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. తెలంగాణలో జూడాల సమ్మె విరమణ

జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా చేస్తోన్న సమ్మెను తెలంగాణ జూనియర్ డాక్టర్లు(జూడా) విరమించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రితో చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. కేంద్ర చట్టంపై న్యాయపోరాటం చేస్తామని, దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌లోనూ నిరసన వ్యక్తం చేస్తామని జూడాలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. నిజామాబాద్‌లో అమిత్‌షా సభ

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్న భాజపా సెప్టెంబరు 17న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఆహ్వానించగా సుముఖత తెలిపారు. బహిరంగ సభకు మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌.. మూడు పేర్లను పరిశీలిస్తున్న కమలనాథులు నిజామాబాద్‌లో నిర్వహించాలని ఓ నిర్ణయానికి వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. విజయవాడలో 100 ఆవుల మృతి

విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. మరో కొన్ని ఆవులు చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాయి. శుక్రవారం రాత్రి ఆవులకు పెట్టిన దాణాపై నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆవులు మృతి చెందడంతో వీటికి పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు. అనంతరం గోవుల మృతికి కారణాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ‘జమ్మూకశ్మీర్‌’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

‘జమ్మూకశ్మీర్‌ పునర్విభజన’ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తయినట్టే. జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారని, అక్టోబరు 31న భారత తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఆ రోజు నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. పన్ను వేధింపులుంటే సత్వరం పరిష్కరిస్తా

పన్ను సంబంధిత అంశాల్లో వేధింపులు ఎదురవుతుంటే, సత్వరం పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. ఇందుకోసం వచ్చేవారం నుంచి దేశవ్యాప్తంగా పర్యటించి, పారిశ్రామిక వేత్తలు, వారి ప్రతినిధులతో సమావేశమవుతానని, వారు తెలిపిన పన్ను వేధింపు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ ఒకటి అభివృద్ధి చేశామని, దీనివల్ల పన్ను వేధింపు సమస్యలు నేరుగా తాను కూడా పర్యవేక్షించడానికి వీలవుతుందని మంత్రి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.