close

తాజా వార్తలు

సువర్ణ సుందరి శక్తి తెలుసా..!

 అమెరికా కంటే భారతీయ మహిళల వద్దే పుత్తడి అధికం..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: భారతీయ మహిళల శక్తి తెలుసా.. అమెరికా వద్ద ఉన్న బంగారం రిజర్వుల కంటే భారతీయ మహిళల వద్దే ఎక్కువగా బంగారం ఉంది. ఇప్పటికే బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తుండటంతో ప్రజలు బంగారాన్నే సురక్షితమైన పెట్టుబడికి మార్గంగా ఎంచుకొంటున్నారు. భారత్‌లో బంగారం నిల్వలు కొండల్లా పెరిగిపోవడానికి బలమైన చారిత్రక సామాజిక కారణాలు ఉన్నాయి. 

మన దగ్గర ఎంత బంగారం ఉంది..?

ప్రపంచ గోల్డ్‌ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం భారతీయుల వద్ద 25,000 టన్నుల బంగారం ఉన్నట్లు తేలింది. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా (8,133 టన్నులు), జర్మనీ (3,373),ఐఎంఎఫ్‌ (2,814),ఇటలీ (2,450),ఫ్రాన్స్‌ (2,435), చైనా (1,842),రష్యా (1,778) మొత్తం రిజర్వుల కంటే ఇది చాలా ఎక్కువ. గత ఏడాది  వరకు 24వేల టన్నులు ఉన్న నిల్వలు ఈ ఏడాది 25వేల టన్నులకు చేరినట్లు వరల్డ్‌ గోల్డ్‌కౌన్సిల్‌ భారతీయ విభాగం ఎండీ శామ్‌ సుందర్‌ వెల్లడించారు. ఇది దేశ జీడీపీలో 40శాతం మొత్తానికి సమానం. 2019లో అత్యధికంగా భారతీయులు 850 టన్నుల బంగారం కొనుగోలు చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీనికి ఆర్థిక మాంద్యం తోడైతే ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది. 

జనవరి నుంచి మార్చిలోపే 159టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. 2010లో అత్యధికంగా 963 టన్నుల పుత్తడి భారతీయుల ఇళ్లల్లో చేరింది. 2016లో నోట్ల రద్దు సమయంలో కొనుగోళ్లకు కొంత బ్రేకు పడి 666 టన్నులకే పరిమితమైంది. ఇప్పటి వరకు 1,90,040 టన్నుల బంగారాన్ని భూగర్భం నుంచి వెలికి తీసినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటిల్లో 1950 తర్వాత 1.26లక్షల టన్నులను బయటకు తీశారు. 

కేరళ టాప్‌..

దేశంలో బంగారు నగల కొనుగోళ్లలో కేరళ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇక గోవా రెండో స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న గోవా కంటే కేరళ కొనుగోళ్లు ఆరురెట్లు అధికం కావడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారి కంటే పట్టణ ప్రాంతాల వారు నగలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సిక్కింలో అత్యల్పంగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. కేరళలో బంగారు గనులు లేకపోయినప్పటికీ బంగారం అధికంగా ఉండటానికి కారణం సుగంధద్రవ్యాల వ్యాపారం.  రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఐరోపా ఖండాలతో వాణిజ్యసంబంధాలుండేవి. అప్పట్లో కరెన్సీ లేకపోవడంతో వస్తుమార్పిడి పద్ధతి ఉండేది. దీంతో పాటు ఐరోపాలో శీతకాలం సుదీర్ఘంగా ఉండేది. ఐరోపాలో ఆహారపదార్థాలను నిల్వ చేసుకునేందుకు మిరియాలను వినియోగించేవారు. మిరియాలను మలబారు తీరం నుంచి దిగుమతి చేసుకునేవారు. సుగంధద్రవ్యాల కొనుగోళ్లకు బంగారు నాణేలనిచ్చేవారు. ఈ వాణిజ్యంతో కేరళ తీరంలోని పలు నౌకాశ్రయ నగరాలు అభివృద్ధి చెందాయి. ప్రజలు బంగారాన్ని ఒక అలంకారంగా కాకుండా ఆస్తిగా పరిగణించేవారు. దీంతో బంగారును సేకరించేవారు. ఇదే  పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుండటంతో బంగారు వాణిజ్యంలో కేరళ టాప్‌గా నిలిచింది

భారతీయులకు ఎందుకింత మోజు.. 

* భారతీయులు బంగారంపై మోజు పెంచుకోవడానికి చారిత్రక, సామాజిక కారణాలు చాలా ఉన్నాయి. మన సంస్కృతిలో బంగారాన్ని సంపదకు, హోదాకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారం ధరించడానికి ఆసక్తి కనబరుస్తారు.  వివాహ సందర్భంగా బంగారం నగలు కొనడం భారత్‌లో పరిపాటి. దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌ ఆకాశాన్నంటుతుంది. 
* వివిధ పండుగలకు, పర్వదినాలకు బంగారం కొనడాన్ని శుభసూచకంగా భావిస్తారు. థన్‌తేరస్‌, అక్షయతృతీయ వంటి పండుగలకు బంగారం కచ్చితంగా కొనుగోలు చేయాలని భావిస్తారు. 
* భారత్‌లో బంగారం నగదుతో సమానంగా చలామణి అవుతుంది. కష్టకాలంలో బంగారం విక్రయించుకుంటే తక్షణమే నగదు చేతికొస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. 
* నల్లధనం నిల్వ చేయడానికి బంగారం అనువైన మార్గంగా భావిస్తారు. కడ్డీలు, బిస్కెట్ల రూపంలో బంగారం నిల్వ చేస్తారు. దీనిని అవసరమైనప్పుడు మార్కెట్లో విక్రయించి నగదుగా మార్చేస్తుంటారు. 
* గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఉండే భారత్‌లో పెట్టుబడి మార్కెట్లపై పెద్దగా అవగాహన లేకపోవడం.. బంగారం ధర నిలకడగా పెరుగుతుండటంతో సరక్షితమైన పెట్టుబడి మార్గంగా మారింది. 
* తమ తర్వాతి తరాలకు సంపదను పంచడానికి భారతీయులు ఎంచుకునే మార్గాల్లో భూములు, బంగారం ప్రధానమైనవి. దీంతో చాలా వరకు సొమ్ము బంగారం రూపంలో భద్రం చేస్తారు. అంతేకాదు బంగారు నగలను వారసత్వ సంపదగా భావించే కుటుంబాలకు భారత్‌లో కొదవేలేదు. 

ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా..

బంగారాన్ని మృత ఆస్తిగా, అత్యవసర నిధిగా మాత్రమే ఆర్థిక వేత్తలు భావిస్తారు. బంగారం ధర ఆధారంగా దాని విలువలో మార్పులు ఉంటాయి. బంగారం నుంచి కొత్తగా ఉత్పాదకత ఏమీ ఉండదు. ముడి చమురును 114 బిలియన్‌ డాలర్లకు పైగా వెచ్చించి దిగుమతి చేసుకోగా.. బంగారం కోసం 30 బిలియన్‌ డాలర్ల వరకు విదేశీ మారకద్రవ్యం హరించుకుపోయింది. ఈ మేరకు విదేశీ మారకద్రవ్యం సంపాదించడానికి కొత్త మార్గాలేవీ అందుబాటులోకి రావడంలేదు. 

పెట్టుబడి రూపంలో ఉపయోగపడాల్సిన అమూల్యమైన నగదు బంగారం రూపంలో ఇనుప బీరువాల్లో కొన్నేళ్లపాటు మూలుగుతుంటే మార్కెట్లు మాత్రం పెట్టుబడుల కొరతతో అల్లాడిపోతున్నాయి. బంగారం కొనుగోళ్లను తగ్గిస్తే ఆ నిధులను పెట్టుబడుల్లోకి మళ్లించే అవకాశం ఉంది. 

మరోపక్క బంగారాన్ని పన్ను ఎగవేతకు బలమైన మార్గంగా ఎంచుకొంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయం పడిపోతోంది. చైనా వంటి దేశాలు ఈశాన్య భారతం నుంచి భారత్‌లోకి అక్రమంగా బంగారాన్ని పంపిస్తున్నాయి. దక్షిణాదిన కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విక్రయించే అక్రమ బంగారం చాలా వరకు ఈశాన్య భారతం నుంచి వచ్చేదే కావడం గమనార్హం.     

ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా మారని జనం..

భారత ప్రభుత్వం దేశప్రజలను బంగారం మోజు నుంచి మళ్లించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే బంగారం దిగుమతిపై 12.5శాతం పన్ను విధిస్తోంది. అయినా కానీ దిగుమతుల్లో పెద్దగా మార్పులేదు. దీనికి తోడు అక్రమ బంగారం రవాణ పెరుగుతోంది. 
* ప్రభుత్వం బంగారం ఎగుమతులను పెంచేందుకు 80:20 నిబంధన తీసుకొచ్చారు. దీనికింద దిగుమతి చేసుకొనే బంగారంలో 80శాతం దేశీయంగా విక్రయించి.. 20శాతం ఎగుమతి చేయాలి. కానీ ఆ తర్వాత ఈ నిబంధనను తొలగించారు. 
* పరిమితిని మించిన బంగారం కొనుగోళ్లకు పాన్‌ నెంబర్‌ తప్పని సరి చేశారు. 
* వజ్రాలు, నగల పరిశ్రమను ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌చట్టం పరిధిలోకి చేర్చారు.  
* వినియోగంలో లేని బంగారాన్ని నగదుగా మార్చేందుకు గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో వడ్డీరేట్లను 0.5శాతం-2.5శాతంగా నిర్ణయించింది. దీనిపై క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ను మినహాయించింది. మరికొన్ని పన్ను మినహాయింపులు ఇచ్చింది. ఇలా వచ్చిన బంగారంతో అదనపు దిగుమతులకు కళ్లెం వేయవచ్చని భావించింది. ఏప్రిల్‌ 2019నాటికి అందుబాటులో ఉన్న మొత్తం 12 గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారి సంఖ్య కేవలం 3.19 లక్షల మంది మాత్రమే. ఈ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మరోపక్క ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుండటంతో మళ్లీ అందరి చూపులు పుత్తడి పైనే ఉన్నాయి.  

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.