close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. మంత్రివర్గ విస్తరణపై సీఎం దృష్టి

శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రమంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. ఒకటి లేదా రెండు దఫాల్లో దసరా నాటికి దీనిని చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి దఫా దసరా లోపు కాగా.. రెండో విడత సంక్రాంతి నాటికి చేపట్టవచ్చని తెలిసింది. వచ్చే నెలలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలున్నాయి. వినాయక చవితి ఉత్సవాలు, ఆ తర్వాత బతుకమ్మ పండుగ ఉన్నాయి. ఇవన్నీ ముగిసిన తర్వాత కొత్త మంత్రులు వస్తారనే భావన తెరాస వర్గాల్లో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. పథకాల సొమ్ము..పాత అప్పులకొద్దు

ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు చేరే సొమ్ము వారి పాత అప్పులకు జమకాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ‘స్పందన’ కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన దృశ్యశ్రవణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ పథకం నుంచి అందే ఏ సొమ్మయినా నేరుగా లబ్ధిదారులకే   చేరాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారని, సోమవారం దిల్లీలో భేటీ సందర్భంగా ఈ అంశాన్ని నేను లేవనెత్తినప్పుడు ఆమె స్పష్టత ఇచ్చారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రాజకీయ కేసులకు ప్రత్యేక ట్రైబ్యునల్‌

రాజకీయాల్లో ప్రత్యర్థులుగానే ఉండాలి తప్ప శత్రుత్వం ఉండకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పదవి చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘రాజకీయ నాయకులపై హత్య.. అత్యాచారం.. అవినీతి ఆరోపణల కేసులను త్వరగా విచారించి చర్యలు తీసుకోవాలి. రాజకీయ కేసుల్లో తీర్పు వచ్చేందుకు 25 ఏళ్లు పడుతోంది. ఇలాంటి కేసుల విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్స్‌ ఉండాలి. ఏడాదిలోగా తీర్పు వచ్చేలా చేయాలి’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ!

జమ్మూ-కశ్మీర్‌లో అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 106కుపైగా కేంద్ర చట్టాల అమలుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు, వివిధ పథకాల అమలుకు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని త్వరలోనే ప్రకటించనుంది. ఈ దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. పత్రికా స్వేచ్ఛ వన్‌ వే ట్రాఫిక్‌ కాదు: సుప్రీంకోర్టు

మనదేశంలో పాత్రికేయం సాగుతున్న తీరుపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. పత్రికా స్వేచ్ఛ ఏకపక్షం(వన్‌ వే ట్రాఫిక్‌) కాకూడదని పేర్కొంది. తప్పుడు-కల్పిత కథనాలకు పాత్రికేయంలో స్థానం లేదని వ్యాఖ్యానించింది. ‘ది వైర్‌’ వార్తా పోర్టల్‌తోపాటు ఆ సంస్థకు చెందిన కొందరు పాత్రికేయులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తనయుడు జయ్‌ షా దాఖలు చేసిన పరువు నష్టం కేసులపై విచారణ సందర్భంగా జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ గవయీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. పొద్దూ మాపూ ఓపీ

సర్కారు దవాఖానాల్లో ఇకనుంచి పొద్దూ మాపూ ఓపీ సేవలు అందనున్నాయి. రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తుండటంతో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఓపీ సేవలు నిర్వహించాలని తెలంగాణ  వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. కొద్దిరోజులుగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, డయేరియా సహా వైరల్‌ జ్వరాలు పెద్దఎత్తున నమోదవుతున్నాయి. దీంతో ఆరోగ్యశాఖ అప్రమత్తత ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. పదేళ్లలో 40,000 ఉద్యోగాలు: వివో

దేశీయ తయారీప్లాంటు కోసం మొత్తం రూ.7500 కోట్ల పెట్టుబడి పెడతామని, రాబోయే 10 ఏళ్లలో 40,000 ఉద్యోగాలు సృష్టించాలన్నది తమ లక్ష్యమని చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో ప్రకటించింది. భారత్‌లో ప్లాంటు నెలకొల్పేందుకు రూ.4,000 కోట్ల ప్రణాళికను వివో గతంలోనే ప్రకటించగా, ఇప్పుడు మరో రూ.3,500 కోట్లు అదనంగా పెడతామని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. 7 సీట్ల కారు తయారీకి కియా సన్నాహాలు

దేశీయంగా గిరాకీ పెరుగుతున్న 7 సీట్ల కారును అనంతపురం ప్లాంటులో తయారు చేయడానికి కియా మోటార్‌ సన్నద్ధమవుతోందని సమాచారం. సెప్టెంబరు 15 నుంచే ఆ కారు ప్రయోగాత్మక తయారీ చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొరియా రోడ్లపై పరుగులు పెడుతున్న కియా కార్నివాల్‌ మోడల్‌లో కొన్ని మార్పులు చేసి ఇక్కడ తీర్చిదిద్దనున్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. 14 రోజుల్లోగా సొమ్ము వాపసు

వినియోగదార్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇ కామర్స్‌ ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. వీటిపై సంబంధీకులు సెప్టెంబరు 15 లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. డిసెంబరు కల్లా వినియోగదారుల భద్రతా చట్టం నిబంధనావళి రూపకల్పనకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇకపై వస్తువులు వాపసు ఇచ్చినపుడు, గరిష్ఠంగా 14 రోజుల్లోపు తిరిగి చెల్లింపులు చేయాలని ముసాయిదాలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. టార్గెట్‌ టోక్యో

2020 టోక్యో ఒలింపిక్సే తన లక్ష్యమని భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ ఛాంపియన్‌   పి.వి.సింధు ప్రకటించింది. ఒలింపిక్స్‌కు సరికొత్త అస్త్రాలతో సిద్ధమవుతానని తెలిపింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి మంగళవారం హైదరాబాద్‌కు తిరిగొచ్చిన సింధు.. గోపీచంద్‌ అకాడమీలో విలేకరులతో మాట్లాడింది. ‘‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నా. ఇన్నాళ్లకు నిరీక్షణ ఫలించింది. 2 కాంస్యాలు.. 2 రజతాలు.. చివరికి స్వర్ణం సాధించా. గర్వంగా అనిపించింది’’ అని సింధు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.