close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. 2-0తో టెస్టు సిరీస్‌ కైవసం

సంచలనమేమీ లేదు. గెలుపు సంబరాలు కాస్త ఆలస్యమైనా.. విజయం మాత్రం మళ్లీ టీమిండియా ఖాతాలోనే. ముందు ఊహించినట్లే నాలుగో రోజే తేలిన ఫలితం. వెస్టిండీస్‌ పర్యటనను కోహ్లీసేన సంపూర్ణంగా ముగించింది. ముందు టీ20, తర్వాత వన్డే.. తాజాగా టెస్టు సిరీస్‌నూ క్లీన్‌స్వీప్‌ చేసి పర్యటనను పరిపూర్ణం చేసుకుంది. ఆతిథ్య జట్టుకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మూడు సిరీస్‌ల్లోనూ అదరగొట్టింది. కింగ్‌స్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 257 పరుగుల భారీ తేడాతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. షూటింగ్‌లో మనుబాకర్‌-సౌరభ్‌ జోడికి స్వర్ణం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ సత్తా చాటింది. బ్రెజిల్‌లోని రియో డిజెనరోలో జరిగిన ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత్‌ మొత్తం 5 స్వర్ణ పతకాలు కొల్లగొట్టి టోర్నమెంట్‌ను ఘనంగా ముగించింది. 10 మీటర్ల ఎయిర్‌ ఫిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో మనుబాకర్‌-సౌరభ్‌ చౌదరీ జోడీ భారత్‌కే చెందిన యశస్వినీ దేశ్‌వాయ్‌- అభిషేక్‌ వర్మ జోడిని ఓడించి స్వర్ణ పతకం గెలిచింది. దీంతో ఓడిన యశస్వినీ దేశ్‌వాయ్‌‌- అభిషేక్‌ వర్మకు రజతం లభించింది. ఈ టోర్నీలో భారత్‌ 5 స్వర్ణాలు, 2 రజతం‌, 2 కాంస్యం పతకాలు సొంతం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆర్టీసీ విలీనంపై నేడు జగన్‌కు నివేదిక

ప్రభుత్వంలో ఏపీఎస్‌ఆర్టీసీ విలీనంపై అధ్యయన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3.30గంటలకు సీఎం జగన్‌కు నివేదికను సమర్పించనుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంపై కమిటీ ఛైర్మన్‌ ఆంజనేయరెడ్డి నేతృత్వంలో విలీనం విధివిధానాలపై కమిటీ అధ్యయనం చేసింది. పలు మార్గదర్శకాలతో నివేదికను రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. క్రికెటర్‌ మహ్మద్‌ షమీకి అరెస్టు వారెంట్‌

ముఖ క్రికెటర్‌ మహ్మద్‌ షమీపై అరెస్టు వారెంట్‌ జారీ అయింది. షమీ, ఆయన సోదరుడు హసీద్‌ అహ్మద్‌కు కోల్‌కతాలోని అలీపోర్‌ న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. షమీ భార్య హసీన్‌ జహాన్‌ పెట్టిన గృహ హింస కేసులో ఈ వారెంట్‌ జారీ అయింది. 15 రోజుల్లోగా కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అలాగే బెయిల్‌ దరఖాస్తు చేసుకొనేందుకు కోర్టు ఆయనకు 15 రోజులు గడువు ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్‌-2’ అత్యంత కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. ఈ వ్యోమనౌకలోని ఆర్బిటర్‌ నుంచి ‘విక్రమ్‌’ ల్యాండర్‌ విడిపోయే కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 1:15 గంటల మధ్య ఈ  ప్రక్రియ కొనసాగింది. ల్యాండర్‌ విడిపోయే దృశ్యాలను ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. ల్యాండర్‌ విడిపోయిన అనంతరం చందమామ ఉపరితలంపై ల్యాండింగ్‌ ప్రక్రియకు అది మరింత చేరువకానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కాబూల్‌లో కారు బాంబు పేలుడు

రాజధాని కాబూల్‌లో కారు బాంబు పేలి ఐదుగురు మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. ఈ సంఘటన సెంట్రల్‌ కాబూల్‌లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కాబూల్‌లోని గ్రీన్‌ విలేజ్ సమీపంలోని పలు అంతర్జాతీయ సంస్థలు నెలకొని ఉన్న నివాస ప్రాంతంలో ఆత్మాహుతి సభ్యుడు ఈ ఉదంతానికి పాల్పడ్డాడు. బాంబు తీవ్రతకు ఐదుగురు సాధారణ పౌరులు అక్కడికక్కడే మృతిచెందగా, 50 మంది గాయపడినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నస్రత్‌ రహిమి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జియోకు పోటీగా, ఎయిర్‌టెల్‌ మరో అడుగు

జియో ఫైబర్‌ పేరుతో ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో త్వరలో బ్రాడ్‌ బ్యాండ్‌, డీటీహెచ్‌ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో దిగ్గజ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ కూడా అందుకు దీటుగా ఓటీటీ సేవలను ప్రారంభించనుంది. ఇందుకోసం ఎయిర్‌టెల్‌ ప్రత్యేకంగా ఓ పరికరాన్ని ప్రకటించింది. ‘ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌’ పేరుతో దీన్ని తీసుకురానుంది. దీని ద్వారా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలను వీక్షించవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మోదీకి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం

దేశంలో పరిశుభ్రమైన పరిసరాల లక్ష్యంగా స్వచ్ఛభారత్‌ అభియాన్‌ను ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోదీకి మరో పురస్కారం లభించనుంది. ప్రముఖ బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సంస్థ ప్రధాని చొరవకు గానూ ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ సోమవారం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కుల్‌భూషణ్‌పై పాక్‌ తీవ్ర ఒత్తిడి!

గూఢచర్యం ఆరోపణలపై ప్రస్తుతం పాకిస్థాన్‌ చెరలో ఉన్న కుల్‌భూషన్‌ జాదవ్‌పై ఆ దేశం తీవ్ర ఒత్తిడి పెడుతోందని భారత విదేశాంగశాఖ సోమవారం వెల్లడించింది. తాను నిజంగా గూఢచర్యం చేశానని ఒప్పుకొనేలా పాకిస్థాన్‌ అధికారులు జాదవ్‌ను ఇబ్బంది పెడుతున్నారని వెల్లడించింది. సోమవారం కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్ కాన్సులర్‌ అనుమతి కల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పాక్‌లోని భారత రాయబారి గౌరవ్‌ అహ్లూవాలియా మొదటిసారి కుల్‌భూషణ్‌ను కలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రధాని మోదీ రష్యా పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు తేదీ ఖరారైంది. ఈ నెల 4న ఆయన రష్యాకు వెళ్లనున్నారు. 4 నుంచి 6 వరకు రష్యాలోని వ్లాదివోస్టోక్‌లో జరిగే తూర్పు దేశాల ఆర్థిక సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. అనంతరం భారత్‌ - రష్యా 20వ వార్షిక సదస్సులోనూ మోదీ పాల్గొని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కీలక భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు 25 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.