close

తాజా వార్తలు

అప్పటి నుంచి నాన్న మాట్లాడలేదు!

తెలంగాణకు కొత్త గవర్నర్‌ వస్తున్నారు... కుటుంబమంతా కాంగ్రెస్‌ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకుంటే... ఆమె మాత్రం బీజేపీవాదానికి దగ్గరయ్యారు. అనర్గళంగా మాట్లాడుతూ తమిళ ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంతో మంది హృదయాల్లో నిలిచారు. ఆమే తమిళిసై సౌందరరాజన్‌. రాజ్యాంగబద్ధ పదవి చేపడుతున్న సందర్భంగా ‘వసుంధర’తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు తమిళిసై మాటల్లోనే.
ఆ రోజు ఉదయం నేను అమ్మవారి ఆలయంలో పూజలో ఉన్నా. అప్పుడే రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. పూజలోంచి బయటకు వచ్చిన తరువాత నా రక్షణ సిబ్బంది ఫోను విషయం చెప్పారు. వెంటనే దిల్లీకి ఫోను చేశా. నన్ను తెలంగాణ గవర్నరుగా నియమిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, చీఫ్‌ జస్టిస్‌ నాతో మాట్లాడతారని వివరించారు. గవర్నర్‌గా నియామకం జరిగినట్టు ప్రకటన వెలువడిన వెంటనే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక పార్టీ కార్యకర్తల నుంచీ అభినందనలు వెల్లువెత్తాయి.

అందరూ కాంగ్రెస్‌ నాయకులే...
మా ఇంట్లో ఎప్పుడూ రాజకీయవాతావరణమే ఉండేది. మా తాత, నాన్న కాంగ్రెస్‌ పార్టీలో ప్రముఖ నాయకులు. నాన్న పీసీసీ అధ్యక్షుడిలా చేశారు. వారి సభలు, సమావేశాలు చూస్తూ పెరిగా. 1996లో నాన్నతో కలిసి కన్యాకుమారికి వెళ్లా. అక్కడ బీజేపీ పార్టీ పెద్ద కార్యక్రమం నిర్వహిస్తోంది. కార్యకర్తలు, నాయకులంతా ఒకే చోట గుమిగూడి గంజి తాగారు. తరువాత భారత్‌మాత కీ జై అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. ఆ సన్నివేశం నాలో తెలియని ఉత్తేజాన్ని కలిగించింది. అప్పుడే కావచ్చు నాలో బీజేపీలో చేరాలనే ఆలోచన వచ్చి ఉంటుంది. అదే తరువాత నన్ను బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టే వరకు తీసుకెళ్లింది.

ఆయనే నడిపించారు...
ఇంట్లో వాళ్లెవరికీ నేను గవర్నర్‌ పదవి గురించి చెప్పకముందే అంతా టీవీలో చూసి తెలుసుకున్నారు. మావారు సౌందరరాజన్‌ స్పందన కన్నా ముందు... ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఎంబీబీఎస్‌ చదువుతున్నప్పుడే మాకు పెళ్లైంది. ఆ తరువాత చదువులో నేను మరింత మెరుగ్గా రాణించానంటే కారణం మావారే. ఆయన నన్నెంతో ప్రోత్సహించారు. వైద్యరంగం నుంచి బీజేపీలో చేరతానని చెప్పినప్పుడూ నా అభిప్రాయానికి ఆయన విలువనిచ్చారు. ఆ తరువాత నేను ప్రతిక్షణం పార్టీ కోసం పడే కష్టం చూసి ‘నువ్వు డాక్టరుగానే ఉండిపోతే బాగుండేదేమో’ అని అనేవారు. ఆయన నన్ను అంతగా ప్రేమించారు. నాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. మావారి సహకారంతోనే నేను రాజకీయాల్లో చురుగ్గా ఉండగలిగా. ఇక నేను గవర్నర్‌ అవుతున్నానన్న విషయం తెలియగానే నాకంటే ఎక్కువగా సంతోషించింది ఆయనే.

అప్పుడు బాధపడ్డా...
చిన్నప్పటి నుంచి నేను నాన్న గారాలపట్టిని. ఆయన కాంగ్రెస్‌పార్టీలో ప్రముఖ నేతగా ఉన్నప్పుడు ఎందరో మహానుభావులను చూశా. నాన్నకు ఎప్పుడూ తీరిక ఉండేది కాదు. చదువుకునేటప్పుడు నాన్నను మేం చాలా మిస్‌ అయ్యేవాళ్లం. పాఠశాలలో పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌ జరిగినా చెల్లికి నేనే గార్డియన్‌గా వెళ్లేదాన్ని. బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలినై, నాన్నకు తెలియకుండానే పార్టీ సభ్యత్వం తీసుకున్నా. రెండేళ్లవరకూ నాన్నకు ఆ విషయం చెప్పలేదు. పూందమల్లిలో జరిగిన మహానాడులో బీజేపీ నేత లలితాకుమారీమంగళం ప్రసంగిస్తూ... పార్టీ సభ్యత్వం తీసుకున్నవారిని వేదికపై పరిచయం చేశారు. అది టీవీల్లో ప్రసారమైంది. ఇలా విషయం నాన్నకు తెలిసింది. తరువాత ఆయన ‘మగళే’ అని కోపంతో గట్టిగా అరిచారు. అప్పటివరకూ ఎంతో ప్రేమగా పిలిచే ఆయన... అలా గట్టిగా అరిచేసరికి మౌనంగా ఉండిపోయా. ఆరునెలలపాటు నాతో మాట్లాడలేదు. నేను పార్టీలో ఎలా వ్యవహరించాలో మా ఆయనకు సలహాలు ఇచ్చేవారు. నాతో మాత్రం మొక్కుబడిగా ఉండేవారు. చాలా బాధేసేది. ఆయనపై ‘మగళే’ పేరుతో ఓ పుస్తకమూ రాశా. నేను గవర్నరు అవుతున్నానని ఆయనకు తెలిసి చాలా సంతోషించారు. అమ్మది ఎప్పుడూ ప్రశాంత మనస్తత్వం. నాకు చరిత్ర అంటే ఇష్టం. ఆరో తరగతి నుంచే నేను నాన్నలాగే రాజకీయాల్లోకి వెళ్తానని అమ్మకు చెప్పేదాన్ని. అప్పటి నుంచే వద్దని వారించేది. ‘ఇంట్లో ఉన్న రాజకీయవాతావరణం చాలు. నువ్వు వైద్యం చదివి నిరుపేదలకు సేవలందించు’ అని చెప్పేది. అమ్మ మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. వైద్యురాలినయ్యాక ఆమె ఆశయం మేరకు పేదలకు సేవలందించా. సునామీ వచ్చినప్పుడు తీరప్రాంతాల్లోని నిరుపేదల కోసం అక్కడే ఉండిపోయా. పార్టీలో తీరికలేకుండా గడిపేకొద్ది వైద్యవృత్తికి దూరమవుతున్నానని అనిపించేది. ఇప్పుడు అమ్మ సంతోషానికి అవదుల్లేవు.

మెట్టినింటికి వస్తున్నట్టుంది...
తెలంగాణకు వస్తుంటే మెట్టినింటికి వస్తున్నట్టుగా ఉంది. అతికొద్ది రోజుల్లో తెలుగు భాషను నేర్చుకుని ఇక్కడివారికి దగ్గరవుతా. గతంలో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లేదాన్ని. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాకు రావడం ఇదే తొలిసారి. ఇక్కడి రాజకీయాలు, సంస్కృతీసంప్రదాయాలపై అంతగా అవగాహన లేదు. అన్నీ తెలుసుకొని అందరితో మమేకమవుతా. ఒకసారి ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయా. గెలుపు కోసం వందశాతం కృషి చేసేదాన్ని. పరాజయం పాలైనా ప్రయత్నాలు మాత్రం మానుకునేదాన్ని కాదు.

ఆత్మవిశ్వాసంతోనే ముందుకు...

తమిళనాట కొందరు నా శరీర రంగు, ఎత్తు గురించి అవహేళన చేశారు. ఇటువంటి భౌతిక విషయాలు నేను పట్టించుకోను. సేవాదృక్పథం, నా లక్ష్యాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే మనస్తత్త్వం నాది. ఇటువంటి వాటిని మనసుకు దగ్గరగా రానివ్వను. ఒక వేళ బాధపెట్టేలా ఉన్నా, దానికి పదింతలు శక్తిని కూడబలుక్కొని ముందుకు వెళ్తాను. మహిళాసాధికారత కోసం చాలా కృషి చేశా. మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలిచా. మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడా. అతివలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తప్పనిసరిగా వరిస్తుంది.


 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.