close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. మంత్రిని చేస్తానని మాట తప్పారు

తనకు మంత్రి పదవి, అల్లుడికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్‌ మాట తప్పారని మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. 2018 శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పానని, సీఎం ఒప్పుకోకుండా మండలిలోనే ఉండాల్సిందిగా సూచించి.. మంత్రి పదవి ఇస్తానన్నారని తెలిపారు. ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్‌ టికెట్‌ను నాకు గాని, మా అల్లుడికైనా ఇవ్వాలని కేసీఆర్‌ను కోరాను. ముఠా గోపాల్‌ను గెలిపించుకు వస్తే మళ్లీ మంత్రిని చేస్తానని చెప్పి, ఆ తర్వాతా పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తారంటున్నారు. అది ఎవరికి కావాలి?’ అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రెండు రోజుల్లో  చెప్పండి

పోలవరం వ్యవహారంలో ప్రధాని కార్యాలయం రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2 రోజుల్లోగా సమాధానం పంపాలని రాష్ట్రానికి గుర్తు (రిమైండర్‌) చేసింది. పోలవరం ప్రాజెక్టు విషయమై రాష్ట్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలకు, 2018 జనవరిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మధ్య తేడాకు కారణాలను తెలపాలంటూ పీఎంవో గత నెల 29వ తేదీన లేఖ రాసింది. దానిపై ఈనెల 3వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నా కుమార్తెకూ దోమ కాటు తప్పలేదు

రాష్ట్రంలో జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. సీజనల్‌ వ్యాధుల కేలండర్‌ను రూపొందించి వచ్చే సంవత్సరం నుంచి రెండునెలల ముందుగానే నివారణ, అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సాధారణంగా వర్షాకాలంలో వైరల్‌ జ్వరాలు, మలేరియా, డెంగీ వచ్చినట్లు వేసవి, చలికాలంలోనూ రకరకాల సమస్యలొస్తాయన్నారు. తన కుమార్తెనూ దోమ కుట్టిందని, స్వైన్‌ ఫ్లూ అనుకుని ఆందోళనపడినట్లు కేటీఆర్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వైకాపా దాడుల బాధితులకు భరోసా కల్పించి గ్రామాల్లోకి తీసుకెళ్లడానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ‘చలో ఆత్మకూరు’కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం వైపు నుంచి దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్‌, గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌, గ్రామీణ ఎస్పీ జయలక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించి బాధితులకు రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. గ్రామీణ జిల్లా అదనపు ఎస్పీ చక్రవర్తి, గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి బాధితుల శిబిరానికి వచ్చారు. వారి బాధలు తెలుసుకున్నారు. అన్నివిధాలా రక్షణ కల్పించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దేశానికే ఆదర్శం తెలంగాణ

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. దేశం గర్వించదగ్గ ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులను ఏర్పాటు చేసుకుందని చెప్పారు. కొత్త రాష్ట్రమైనా అన్నివర్గాల ప్రజలకు మేలు కలిగించేలా స్థిరమైన ఆర్థిక వృద్ధితో ముందుకు సాగుతోందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధులాంటి అద్భుత పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గవర్నర్‌ ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మానవ నిర్మిత అద్భుతమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పలాస ఎమ్మెల్యేకు ‘నాణ్యమైన బియ్యం’

తెల్లరేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం అందజేసే నాణ్యమైన బియ్యం సంచి శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడు డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు అందింది. వాలంటీరు వచ్చి 20 కిలోల బియ్యం సంచిని ఇచ్చారు. బియ్యం సంచితోపాటు కుటుంబసభ్యులు దిగిన చిత్రాన్ని తన ‘ఫేస్‌బుక్‌’ ఖాతాలో ఎమ్మెల్యే ఉంచారు. ‘నాకు బియ్యం అప్పగించిన విధానం ప్రకారం.. వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. గుమ్మం వద్దకే వచ్చి వారు సేవలందిస్తున్నారు. ఇదే పాలనలోని పారదర్శకత’ అని ఆయన పోస్టు చేశారు. ఇది విస్తృతం కావడంతో ఆయనకు తెల్ల రేషన్‌కార్డు ఎలా వచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏడాదిలో 100 లినెన్‌ హౌజ్‌ విక్రయ కేంద్రాలు

ప్రస్తుత సంవత్సరంలో 100 లినెన్‌ హౌజ్‌ విక్రయ కేంద్రాలు తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో లినెన్‌ హౌజ్‌ బిజినెస్‌ కాన్సెప్ట్‌ను ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, సంస్థ వెబ్‌సైట్‌, యాప్‌లను యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ప్రారంభించారు. లినెన్‌ ఫియస్టా సీఈఓ ఆదిత్య అగర్వాల్‌ మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా విక్రయ కేంద్రాలు ప్రారంభించామని.. త్వరలో ఖమ్మం, విజయవాడ, గుడివాడ, ఒంగోలు, విశాఖపట్నం, తణుకు, విజయనగరం, రాజమహేంద్రవరం, తిరుపతిలోనూ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పాక్‌లో ఆడలేం

పాకిస్థాన్‌లో పర్యటించాలనే నిర్ణయం తీసుకున్న శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు ఆ దేశ ఆటగాళ్లు షాకిచ్చారు. మలింగ, మాథ్యూస్‌, కరుణరత్నె, తిసార పెరీరా సహా పది మంది లంక ఆటగాళ్లు భద్రతా కారణాల రీత్యా పాక్‌ సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. 2009లో పాక్‌ పర్యటనకు వెళ్లిన లంక క్రికెట్‌ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ దేశంలో పర్యటించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ జట్లు వెనకడగు వేస్తున్నాయి. అయితే లంక బోర్డు ఈ నెల 27 నుంచి పాక్‌లో మూడేసి వన్డేలు, టీ20లు ఆడేందుకు నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చాలాసార్లు మోసపోయాను

‘‘చిత్రసీమలో అడుగుపెట్టి పదహారేళ్లయ్యింది. తొలి నాళ్లలో తెలిసీ తెలియనితనంతో అనేకమంది చేతిలో చాలాసార్లు మోసపోయాను. ఆ తర్వాత నా తప్పుల్ని తెలుసుకుని సరైన దిశలో ప్రయాణం చేయడం నేర్చుకున్నా’’ అన్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఆయన 97 చిత్రాల్ని నిర్మించారు. 98వ చిత్రంగా ‘శివ 143’ రూపుదిద్దుకుంటోంది. నటుడిగానూ 75 చిత్రాల్లో మెరిశారు. మంగళవారం ఆయన పుట్టిన రోజు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 20వ సారి.. గర్భం దాల్చిన మహిళ

ఒకట్రెండు కాదు.. ఏకంగా 17వసారి ప్రసవానికి సిద్ధమైన మహిళ ఉదంతమిది. ఇప్పటిదాకా అన్ని కాన్పులూ ఇంట్లోనే జరగగా, తొలిసారి ఆస్పత్రిలో పురుడు పోసుకునేందుకు సిద్ధమయింది. సంచార జాతికి చెందిన ఆ మహిళ 20వ సారి గర్భందాల్చినట్లు గుర్తించిన స్థానిక వైద్య సిబ్బంది హతాశులయ్యారు. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా మజల్‌గావ్‌ తహసీల్‌ పరిధిలోని కేశపురి ప్రాంతంలోని సంచార గోపాల్‌ కమ్యూనిటీకి చెందిన 38 ఏళ్ల లంకాబాయి ఖరత్‌ అనే మహిళకు ఇప్పటిదాకా 16 సార్లు విజయవంతంగా ప్రసవం జరిగింది. మూడుసార్లు గర్భస్రావమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.