close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. చంద్రబాబు గృహనిర్బంధం

తెదేపా, వైకాపాలు పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. ‘చలో ఆత్మకూరు’కు వెళ్లకుండా ఆయన నివాసం వద్ద అడ్డుకున్నారు. దీంతో నివాసంలోనే చంద్రబాబు నిరాహార దీక్షకు దిగారు. రాత్రి 8వరకూ దీక్షను కొనసాగించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆధార్‌ కోసం మరిన్ని గుర్తింపు పత్రాలకు అనుమతి

ఆధార్‌ కార్డు నమోదు, ఆ కార్డులోని వివరాలను మార్చుకొనేందుకు సమర్పించాల్సిన సమాచారానికి సంబందించి మరింత వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు నిబంధనలకు సవరణలు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇప్పటి వరకూ వ్యక్తిగత గుర్తింపు కోసం 18 రకాల పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించడానికి వీలుండేది. ఇప్పుడు ఆ సంఖ్యను 31కి పెంచారు. నివాస ధ్రువీకరణకు 33 రకాల పత్రాలను అనుమతించేవారు. ఇప్పుడు 43కి పెంచారు. బంధుత్వ నిరూపణ గుర్తింపు పత్రాల సంఖ్యను 9 నుంచి 14కి, జన్మ ధ్రువీకరణ పత్రాల సంఖ్యను 4 నుంచి 14కి పెంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రూ.10వేల సంక్షేమ పండగ

రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందించే పథకానికి దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబరు 15 నుంచి ప్రారంభంకానుంది. నవంబరు 30 వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఎంపికైన లబ్ధిదారులకు ఫిబ్రవరి చివరి వారంలో నగదు జమ చేస్తారు. ఈ పథకం కింద ఒకే కుటుంబం నుంచి ఎంత మందికి ఇవ్వాలి? సెలూన్లలో తాత్కాలికంగా పనిచేస్తున్న వారికి ఆర్థిక సాయం ఇస్తారా? లేదా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీసీ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఈ పథకానికి దాదాపు 2.5 లక్షల మంది ఎంపికయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాబోతోంది:  చింతా మోహన్‌

తెలంగాణలోని హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాబోతోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల తరువాత హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలో మెజారిటీ రాగానే హైదరాబాద్‌పై దృష్టి పెట్టబోతున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పేదవాళ్లకు రూ.7వేల కోట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మూగమ్మ మరణం... తెగిన పాతికేళ్ల బంధం

మూగమ్మ... ఆ పోలీసులకు అమ్మకాని అమ్మ. తనకు మాటలు రాకున్నా ఆత్మీయంగా మసలుకున్నారు. అప్పటికే ఆ స్టేషన్‌లో ఉద్యోగాలు చేస్తున్న వారు... కొత్తగా వచ్చిన వారు మూగమ్మను మాతృమూర్తిగా భావించారు. కొందరు అమ్మమ్మగా అభిమానించారు. ఒకటి కాదు రెండు కాదు 25 ఏళ్లపాటు ఆ అనుబంధం కొనసాగింది. 80 ఏళ్ల వయసున్న ఆ వృద్ధురాలు చనిపోతే పోలీసుల హృదయాలు మూగబోయాయి. తీవ్ర ఆవేదనతో వారి కళ్లు చెమర్చాయి. ఆమెకు అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. హైదరాబాద్‌ మెట్రో చంద్రయాన్‌

భారత అంతరిక్ష ప్రయోగాల్లో మైలురాయిగా నిలిచిన చంద్రయాన్‌ మిషన్‌కు గుర్తుగా ఒక మెట్రో రైలు స్టేషన్‌ను అంకితం ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది.  చంద్రయాన్‌ ప్రయోగాలకు సంబంధించిన చిత్రాలతో ప్రదర్శనశాల, ఇతరత్రా సమాచారాన్ని ఈ స్టేషన్‌లో పొందుపర్చనుంది. అలానే తార్నాక నుంచి నాగోల్‌ వరకు మెట్రో మార్గాన్ని సైన్స్‌ కారిడార్‌గా ఎంపిక చేసింది. పలు పరిశోధన సంస్థలు ఉన్న ఈ మార్గంలోని 150 మెట్రో స్తంభాలపై ప్రముఖ శాస్త్రవేత్తల చిత్రాలు కనిపించబోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నాఫెడ్‌ ద్వారా కశ్మీర్‌ యాపిళ్ల కొనుగోలు

జమ్మూ-కశ్మీర్‌ రైతుల నుంచి యాపిళ్లను నేరుగా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ ఫెడరేషన్‌(నాఫెడ్‌) ద్వారా కొనుగోలు చేసి రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తారు. యాపిళ్ల క్రయ విక్రయాలు చేయవద్దంటూ రైతులు, వ్యాపారులను ఉగ్రవాదులు బెదిరించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జమ్మూ-కశ్మీర్‌ నుంచి నిత్యం 750 ట్రక్కుల యాపిళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఐఫోన్‌ 11 వచ్చేసింది

ఐఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభతరుణం వచ్చేసింది. గతేడాది ఐఫోన్‌ టెన్‌ శ్రేణి ఫోన్లతో ఆకర్షించిన యాపిల్‌ సంస్థ, మంగళవారం ఇక్కడి తమ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని స్టీవ్‌జాబ్స్‌ థియేటర్‌లో ఆహ్లాదకరంగా జరిగిన కార్యక్రమంలో ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌లను ఆవిష్కరించింది. అత్యంత శక్తిమంతమైన ఏ13 బయోనిక్‌ సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఈ ఫోన్‌ల ప్రత్యేకతగా సంస్థ ప్రకటించింది. ఇదేవిధంగా సిరీస్‌ 5 యాపిల్‌వాచ్‌ను, 7వ తరం ఐప్యాడ్‌ను కూడా కూడా సంస్థ విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వార్నర్‌.. చేతి పట్టీతో టాంపరింగ్‌!

సాండ్‌ పేపర్‌తో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినందుకు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. అయితే అంతకుముందే వార్నర్‌కు టాంపరింగ్‌కు పాల్పడిన అనుభవం ఉందని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ అన్నాడు. ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో చేతికి వేసుకున్న పట్టీ సాయంతో బంతి రూపు మార్చినట్టుగా స్వయంగా వార్నరే చెప్పాడని తన ఆత్మకథ ‘ద ఆటోబయోగ్రఫీ’లో కుక్‌ పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విజయశాంతిలా పేరు తెచ్చుకోవాలి

తేజస్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. శంకర్‌ భాను దర్శకుడు. సి.కల్యాణ్‌ నిర్మాత. మంగళవారం హైదరాబాద్‌లో ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ ‘‘కథ బాగుంటే ఎంతైనా ఖర్చు పెడతారు సి.కల్యాణ్‌. భాను నాతో పాటే కలిసి పనిచేశాడు. తనకు ఈ సినిమాతో మంచి విజయం దక్కుతుందనిపిస్తోంది. విజయశాంతిలా పాయల్‌రాజ్‌పుత్‌ మంచి పేరు తెచ్చుకోవాల’’న్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.