close

తాజా వార్తలు

హైదరాబాద్‌లో ఆంక్షలు..పోలీసుల సూచనలు

దూర ప్రాంతాల వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు
ఈనాడు - హైదరాబాద్‌

హా నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధమైంది. హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో సుమారు 40వేల వరకు గణనాథుడి ప్రతిమలను గురువారం నిమజ్జనం చేయనున్నారు. ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగనున్న దృష్ట్యా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచే అమలవుతున్న దృష్ట్యా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగత వాహనాలు తీసుకొస్తే ఇబ్బందులు పడే అవకాశముందని వివరిస్తున్నారు. ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, కూకట్‌పల్లి, గచ్చిబౌలీ వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు.

ఎవరెలా చేరుకోవాలి
* విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చేవారు ఎల్బీనగర్‌ వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి మెట్రోరైలును ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
* కర్నూలు, కడప, బెంగళూరు నుంచి నగరంలోకి ప్రవేశించాలంటే బాహ్య వలయ రహదారి మీదుగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ వరకు చేరుకోవచ్చు.
* బీదర్‌, మెదక్‌, సంగారెడ్డి నుంచి నగరానికి వచ్చే వారు ఊరేగింపు మార్గాలు మినహాయించి కూకట్‌పల్లి నుంచి ఖైరతాబాద్‌ వరకు చేరుకోవచ్చు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
దూర ప్రాంతాల నుంచి గణేశ్‌ నిమజ్జనం చూసేందుకు వచ్చేవారు ఉప్పల్‌, కూకట్‌పల్లి నుంచి మెట్రోలో ఖైరతాబాద్‌ వరకు చేరుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ఖైరతాబాద్‌ వరకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

అంబులెన్స్‌లకు మినహాయింపు

త్యవసర వైద్య సేవలు, అంబులెన్స్‌లకు ట్రాఫిక్‌ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు.అత్యవసర పరిస్థితులు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు వీలుగా పోలీసులు ప్రత్యేక సహాయవాణిని ఏర్పాటు చేశారు. 24 గంటలు ఈ ఫోన్లు పనిచేస్తాయి.
040- 2785 2482
94905 98985
90102 03626
94906 16555 (వాట్సాప్‌ మాత్రమే)

శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు: డీజీపీ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా పండగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గణేష్‌ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. అదనపు డీజీపీ జితేందర్‌తో కలిసి బుధవారం డీజీపీ విలేకరులతో మాట్లాడారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు. నిమజ్జనాలు జరిపేందుకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 50 ప్రాంతాలను గుర్తించి, సెక్టార్లుగా విభజించి... ఒక్కో అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామన్నారు. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. దాడులకు సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదన్నారు. ఎవరైనా పుకార్లు సృష్టించి ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.

విద్యుత్తు ఏర్పాట్లివీ..

 గణేశ్‌ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనానికి విద్యుత్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) తెలిపింది. 42 కిలోమీటర్ల ఎల్‌టీ, భూగర్భ కేబుల్స్‌ ఏర్పాటు చేశామని పేర్కొంది.

* గ్రేటర్‌లోని 44 చెరువులు, కుంటల వద్ద నిరంతర విద్యుత్తు సరఫరా కోసం ఇలా...
* 500 కేవీఏ సామర్థ్యం కలిగిన పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు: 27
* 315 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు: 38
* 160 కేవీఏలు: 12
* 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు: 4
* కంట్రోల్‌ రూంలు: 9
* క్కడెక్కడంటే..: ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌మార్గ్‌, సర్దార్‌మహల్‌, బషీర్‌బాగ్‌, గాంధీనగర్‌, సరూర్‌నగర్‌ తదితర ప్రాంతాలు.

హైటెన్షన్‌ సరఫరా నిలిపివేత
నగరంలో గురువారం శోభాయాత్ర జరిగే మార్గంలో ముందుజాగ్రత్త చర్యగా వినాయక విగ్రహాలు రహదారి దాటే చోట్లలో హైటెన్షన్‌ విద్యుత్తు లైన్లకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్‌కో తెలిపింది. అవసరమైన చోట అక్కడక్కడ సరఫరాలో కొంత సమయం అంతరాయాలు ఉంటాయని పేర్కొంది.

నేడు, రేపు మద్యం దుకాణాల బంద్‌
రాయదుర్గం: నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం 6 నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని మద్యం దుకాణాలను మూసి వేయాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కల్లు దుకాణాలు, వైన్‌షాపులు, బార్లు, రెస్టారెంట్లు బంద్‌ చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 వాహనాలు సమకూర్చిన ఆర్టీఏ

వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఆర్టీఏ అధికారులు భారీగా వాహనాలను సమకూర్చారు. బుధవారం గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా ఆర్‌టీఏ అధికారులు.. లారీలు, డీసీఎం వ్యాన్లు, ఆటోలు వెరసి మొత్తం 100 వాహనాలను రప్పించి వాటి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం వాటిని నానాల్‌నగర్‌లోని ఆర్‌టీఏ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ఆ వాహనాలను కేటాయించనున్నట్లు ఎంవీఐ సత్యనారాయణ తెలిపారు.

జలమండలి సన్నద్ధత ఇలా...
 జంటనగరాల్లో శోభాయాత్రను తిలకించేందుకు వచ్చే వారి దాహార్తిని తీర్చేందుకు జలమండలి తాగునీటి ఏర్పాట్లు చేసినట్లు జలమండలి ఎం.డి. ఎం.దానకిషోర్‌ తెలిపారు. గణపతి విగ్రహాల నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు మంచినీటికి ఇబ్బంది కలగకుండా నగరవ్యాప్తంగా 115 ప్రాంతాల్లో తాగునీటి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో 30.52 లక్షల మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. శిబిరాల్లో నీటిని అందించేందుకు వీలుగా 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

జోరుగా లడ్డూ వేలం పాటలు

వినాయక నవరాత్రులు ముగియడం.. ఒక్కోటిగా గణనాథులు నిమజ్జనానికి తరలుతుండటంతో లడ్డూవేలం పాటలు జోరందుకున్నాయి. లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు. పాతికేళ్ల క్రితం బాలాపూర్‌ లడ్డూతో మొదలైన వేలం పాటలు.. క్రమంగా నగరమంతటా విస్తరించాయి. వ్యాపారులు, రాజకీయనాయకులు సైతం వేలం పాటలో పాల్గొంటుండటంతో లడ్డూ ధరలు రూ.లక్షల్లో పలుకుతున్నాయి. బుధవారం నగరంలోని పలు మండపాల్లో లడ్డూలు వేలం వేయగా భారీ ధరలు పలికాయి. నిమజ్జనం రోజూ బాలాపూర్‌ లడ్డూతో సహా చాలా మండపాల్లో ప్రసాదాన్ని వేలం వేయనున్నారు. ముషీరాబాద్‌ భోలక్‌పూర్‌ భగత్‌సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద రూ.5లక్షల వ్యయంతో 123 గ్రాముల బంగారంతో తయారు చేసిన లడ్డూను రూ.7.56 లక్షలకు వ్యాపారి విష్ణుప్రసాద్‌ దక్కించుకున్నారు. దుండిగల్‌ బౌరంపేటలో రాంరెడ్డి రూ.7 లక్షలకు, రహ్మత్‌నగర్‌ కూడలిలో త్రిమూర్తి యాదవ్‌ రూ.5.57 లక్షలకు లడ్డూలను సొంతం చేసుకున్నారు.

ఖైరతాబాద్‌లో మూడు స్టేషన్లు
మూడు రవాణా వ్యవస్థలకు ఖైరతాబాద్‌ స్టేషన్‌ ముఖ్యమైనదిగా మారింది. ఖైరతాబాద్‌ చౌరస్తాలోనే ఆర్టీసీ బస్సు స్టేషన్‌ ఉంది. దీనికి ఆనుకునే ఎంఎంటీఎస్‌, మెట్రో రైల్వే స్టేషన్లున్నాయి. నగర ప్రజలు ఈ మూడు రవాణా వ్యవస్థలను సమర్థంగా వినియోగించుకుంటున్నారు. కిటకిటలాడే జనంతో ఉంటున్న ఈ మూడు వ్యవస్థలు ఖైరతాబాద్‌ చేరుకునేసరికి ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం ఖైరతాబాద్‌లోని మహా గణపతిని చూస్తున్న నగర ప్రజలు.. ఈ నెల 12న గణేష్‌ నిమజ్జనోత్సవానికి కూడా ఇవే మార్గాల్లో.. ఖైరతాబాద్‌ స్టేషన్‌కు సులభంగా చేరుకోవచ్చు.

మెట్రో అందిస్తోంది కొత్త అనుభూతి..
నగరంలో గణేష నిమజ్జనం చూడాలంటే రెండేళ్ల కిందటి వరకు అదో పెద్ద ప్రయాస. రహదారులన్నీ భారీ గణేష్‌ ఊరేగింపులతో కిటకిటలాడితే.. ఇతర వాహనాలు వెళ్లాలంటే కుదరని పరిస్థితి. ఇప్పుడు కాలం మారింది. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. ఎల్‌బీనగర్‌ - మియాపూర్‌, నాగోల్‌ - రాయదుర్గం వరకు పైన మెట్రో రైలు పరుగులు పెడుతుంటే.. రోడ్డుపై గణపతులు కదులుతుంటారు. ఏ మెట్రో స్టేషన్‌ చెంతైనా దిగి సమీపంలోనే గణపతుల ఊరేగింపును చూడవచ్చు. మోజంజాహీ మార్కెట్‌ చౌరస్తాలో పాతబస్తీ నుంచి తరలివచ్చిన గణపతులను కనులారా తిలకించవచ్చు. గతేడాది గణేష్‌ నిమజ్జనం సమయానికి ఎల్‌బీనగర్‌ - మియాపూర్‌ మార్గం సిద్ధం కాలేదు. ఈ ఏడాది కొత్తగా ఈ మార్గంలో మెట్రో రావడంతో  ప్రయాణికులు ట్యాంక్‌బండ్‌కు చేరుకోవడానికి అనువుగా మారింది.

తెల్లవార్లూ సేవలు..
గణేష్‌ నిమజ్జనాన్ని కళ్లారా చూసేందుకు వీలుగా ట్యాంక్‌బండ్‌ పరిసరాలకు 550 ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా నడుపుతుండగా.. ప్రతి రోజు నడిచే 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులకు అదనంగా 8 ప్రత్యేక సర్వీసులు 12వ తేదీ రాత్రి నుంచి మరుసటి రోజు వేకువ జాము వరకు నడిచేలా చర్యలు తీసుకున్నారు. ఇక మెట్రోలో.. ప్రస్తుతం ప్రతి 6 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంది. గురువారం ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మెట్రో సర్వీసులు పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఆ రోజు అర్ధరాత్రి దాటే వరకూ నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.