close

తాజా వార్తలు

పెట్టుబడుల ఆకర్షణలో వైకాపా విఫలం: జనసేన

మంగళగిరి: రాష్ట్రంలో ఇసుక విధానం, పెట్టుబడులు ఆకర్షించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని జనసేన విమర్శించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యం పడకేసిందని, పోలవరం నిలిచిపోయిందని ఆరోపించింది. వైకాపా 100 రోజుల పాలనపై రూపొందించిన నివేదికను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. వైకాపా పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించినట్లు తమ నివేదిక తేల్చింది. వంద రోజుల పాలన ప్రణాళికబద్ధంగా లేదని, డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో సన్నద్ధత లోపించిందని విమర్శించింది.  ఇసుక విధానం, పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమైందని.. రాష్ట్రంలో  శాంతి భద్రతలు క్షీణించినట్లు జనసేన తన నివేదికలో చెప్పుకొచ్చింది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన లేదని, ప్రజారోగ్యం పడకేసిందని, ప్రభుత్వ చర్యల కారణంగానే పోలవరం నిలిచిపోయిందని నివేదిక వెల్లడించింది.

ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత లోపించింది

ఈ నివేదిక విడుదల కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. వైకాపా 100 రోజుల పాలనపై 9 అంశాలకు సంబంధించి 33 పేజీలను నివేదిక రూపొందించి విడుదల చేశామన్నారు. ఇసుక దొరక్కపోవడంతో పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ కార్మికుల కష్టాలు ప్రభుత్వానికి చేరుతున్నాయో, లేదో తెలియట్లేదు. ఈ మూడున్నర నెలల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో పారదర్శకత లోపించింది. ఇసుక మాఫియాను నిలువరిస్తామని చెప్పి.. ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. భీమవరంలో పర్యటించిన సమయంలో భవన నిర్మాణ కార్మికులు నన్ను కలిశారు. ఇసుక దొరక్కపోవడంతో పనులు లేక ఇబ్బంది పడుతున్నామని ఆ కార్మికులు చెప్పారు. సరైన ఇసుక విధానం లేకపోవడంతో ఎంతో మంది రోడ్డున పడ్డారు’’ అని ప్రభుత్వ తీరుపై పవన్‌ మండిపడ్డారు. 

వైకాపాను అదే దెబ్బతీస్తుంది!

 దిగజారిపోతున్న  విలువలు లేని రాజకీయాలు చూసి చలించిపోయానని, సమాజం కోసం సర్వస్వం ఇచ్చే శక్తి మా వద్ద ఉందని పవన్‌ అన్నారు. వైకాపా మేనిఫెస్టో జనహితంగా ఉంది.. కానీ, పాలనే అందుకు విరుద్ధంగా ఉందని పవన్‌ అభిప్రాయపడ్డారు. ‘ వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం వైకాపా కార్యకర్తలను వాలంటీర్లుగా తీసుకొచ్చారు. తెదేపాను జన్మభూమి కమిటీలు దెబ్బతీసినట్లే.. వైకాపాను వాలంటీర్ల వ్యవస్థ దెబ్బతీస్తుంది’ అని పవన్‌ అభిప్రాయపడ్డారు.

తెదేపా ఇవ్వలేదు సరే.. మరి మీరెందుకివ్వలేదు!

కిడ్నీ వ్యాధిగ్రస్థులకు రూ.15వేలు పింఛనిస్తామన్నారని, ఈ మూడు నెలల్లో ఎన్ని పింఛన్లు అందాయో తెలియదని పవన్‌ ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణ పనులు నిలిచిపోవడం ప్రభుత్వ తప్పిదమేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయడం రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టడమేనన్నారు. ప్రాజెక్టులో అవినీతి జరిగితే తప్పకుండా విచారణ చేయాలని కోరారు. కృష్ణా నదికి వరదలు వచ్చినపుడు ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పవన్‌ ఆరోపించారు. ఇంత వరద వచ్చినా రాయలసీమకు చుక్క నీరు ఇవ్వలేకపోయారని అన్నారు. మంత్రులు మాత్రం మాజీ సీఎం ఇంటి చుట్టూ తిరిగారని ఎద్దేవా చేశారు. అమరావతికి తెదేపా వాళ్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారని,  అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా గెజిట్ నోటిఫికేషన్‌ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రధాని, అన్ని పార్టీలు రాజధానిని గుర్తిస్తే ఇప్పడు మార్పు సంకేతాల ఉద్దేశమేంటని అన్నారు. గెజిట్‌ విషయంలో వైకాపా ప్రభుత్వ సమర్థత ఏది? అని ప్రశ్నించారు.

రైతుల కన్నీరు రాష్ట్రానికి చేటు

రైతులు విత్తనాల విషయంలో చాలా అందోళనలో ఉన్నారని, రైతుల ఆవేదనపై సంబంధిత మంత్రి మాటలు చాలా బాధ కలిగిస్తున్నాయని పవన్‌ అన్నారు. రైతుల కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదని చెప్పారు. ఈ మూడు నెలల్లో అభివృద్ధి ఉందంటే మద్యపానంలోనేనని పవన్‌ ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధమన్నారని, కానీ, బీరు వినియోగం 13 శాతం పెరిగిందని విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రశ్నార్థకంగానే ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను భయభ్రాంతులకు గురి చేస్తోందని, కోడి కత్తి విషయంలో రాద్ధాంతం చేశారని ఆరోపించారు. జగన్‌ ప్రమాణం చేసిన తర్వాతిరోజే దాడి చేసిన వ్యక్తి బయటకి వచ్చాడని చెబుతూ.. సీఎం జగన్‌ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఎక్కడివరకు వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే అఖిలపక్షం పెట్టి సీబీఐ విచారణకు పట్టుపబడతామని పవన్‌ అన్నారు. 

100 రోజుల గడువు ముగిసింది

వైకాపాకు ఇచ్చిన 100 రోజుల గడువు పూర్తయిందని, ప్రభుత్వంలోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నామని పవన్‌ చెప్పారు. ఇదేవిధంగా పాలన కొనసాగితే రాజకీయ ఉద్యమాలు వస్తాయని తెలిపారు. తాము కర్నూలును రాజధాని చేస్తామని చెప్పలేదని, రాజధానికి దీటుగా కర్నూలును అభివృద్ధి చేస్తామని చెప్పామని గుర్తు చేశారు. తమ పోరాటం ఫలితంగానే ఉద్దానంలో ఆస్పత్రులు ఏర్పాటవుతున్నాయని అన్నారు. పోరాటాల విషయంలో తెలంగాణా, ఏపీ ప్రజలకు  చాలా బలమైన తేడా ఉందన్న పవన్‌.. హోదా విషయంలో ప్రజలు ముందుకొస్తేనే అది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో జనసేన పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.