close

తాజా వార్తలు

 కాళ్లు పట్టుకున్నా కుమార్తెను కాపాడుకోలేకపోయా!

విహారయాత్రలో విషాద గాథ

ఇంటర్నెట్‌డెస్క్‌: అందమైన కొండల్లో....చాలా సాఫీగా సాగిపోతున్న ప్రయాణమది. ప్రకృతి అందాల నడుమ గోదారమ్మ పరవళ్ల మధ్యలో వెళ్తున్న  లాంచీలో...సరదాగా గీతాలకు నృత్యం చేస్తోన్న తమ చిన్నారి హాసినిని చూస్తూ మురిసిపోయారు ఆ తల్లిదండ్రులు. పడవలో ఎక్కడ చూసినా సంతోషమే కనిపిస్తున్న తరుణంలో ఒక్క సారిగా ఊహించని విషాదం. ఏం జరిగిందో తెలియదు. అప్పటి వరకూ ఆనందహేలలే వినిపించిన ఆ పడవలో ఒక్క సారిగా ఆర్తనాదాలు. అప్పటి వరకూ నవ్వుతూ.. తుళ్ళుతూ నృత్యం చేసిన తన కూతురు తన కాళ్లు పట్టుకుని వేలాడుతున్నా కాపాడలేని దుస్థితి ఆ తల్లిది. ఎలాగైనా తన వారిని కాపాడుకోవాలనే బాధ ఆ తండ్రిది. వెరశి పాపికొండల పడవ ప్రమాదంలో తిరుపతికి చెందిన ఓ కుటుంబాన్ని ఆవహించిన విషాద గాథ ఇది.

వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తిరుపతి అక్కారంపల్లికి చెందిన దుర్గం సుబ్రహ్మణ్యం....కుటుంబంతో కలిసి వినాయక్ సాగర్ రాధేశ్యాం అపార్ట్ మెంట్‌లో నివాసం ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తిలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండగా...మధులత గృహిణి. చిన్నారి హాసిని స్థానిక స్ర్పింగ్ డేల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఐదు నెలల క్రితం కాలం చేసిన తన తండ్రి గంగిశెట్టి అస్తికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు రెండు రోజుల క్రితం తన భార్య మధులత, కుమార్తె హాసిని(12)తో కలిసి సుబ్రహ్మణ్యం పాపికొండలకు వెళ్లారు. గోదావరిలో తండ్రి ఆఖరి క్రతువును నిర్వహించేందుకు వెళ్లిన ఆ కుటుంబం...తూర్పు గోదావరి జిల్లాలోని పాపికొండల సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర పడవ ప్రమాదంలో నీటిలో మునిగిపోయింది. మధులతను స్థానికులు కాపాడి మరో బోటులో తరలించగా....సుబ్రహ్మణ్యం, హాసిని నదీ ప్రవాహంలో గల్లంతయ్యారు. రంపచోడవరం ఆసుపత్రికి మధులతను చికిత్స నిమిత్తం తరలించగా....తన గారాలపట్టి హాసిని, భర్త సుబ్రహ్మణ్యం కోసం ఆమె పడుతున్న వేదన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.

రంపచోడవరం ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రి కన్నబాబు.....మధులతను పరామర్శించగా....ఘటన జరిగిన వైనాన్ని ఆమె మంత్రికి వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. పడవ బోల్తా పడిన వెంటనే తన చిన్నారి కూతురు తన కాళ్లను పట్టుకుని వేలాడుతున్నా కాపాడుకోలేకపోయానని గుండెల విసేలా రోదించారు. పడవ బోల్తా పడిన వెంటనే అప్రమత్తమైన తన భర్త సుబ్రహ్మణ్యం నీటిలో మునిగిపోతున్న చిన్నారి హాసిని, తనను నీటి పైకి నెట్టి కాపాడినా...సుబ్రహ్మణ్యం మాత్రం కళ్లముందే నీటిలోకి మునిగిపోయారంటూ మధులత పడుతున్న బాధ వర్ణనాతీతం. తన భర్త అంత ప్రయత్నించి ...చిన్నారి హాసినీని పైకి నెట్టినా...కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

మరో వైపు తిరుపతి అక్కారంపల్లిలోని మధులత నివాసం ఉంటున్న కాలనీలో విషాద వాతావరణం కనిపిస్తోంది. ఆడుతూ పాడుతూ తమ కళ్ల ముందే తిరిగే హాసినీ.. అందరితో కలివిడిగా ఉండే సుబ్రహ్మణ్యం ప్రమాదంలో గల్లంతవడాన్ని.. బంధువులు స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన తండ్రి అస్తికలను కలిపి వస్తామని వెళ్లిన సుబ్రహ్మణ్యం కుటుంబంలో ఇంతటి అలజడి రేగడం బాధాకరమని కన్నీటి పర్యంతమవుతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.