close

తాజా వార్తలు

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల ఇకలేరు

హైదరాబాద్‌: తెదేపా సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. 

ఉదయం 10 గంటలకు భార్యతో కలిసి టిఫిన్‌ చేసిన ఆయన అనంతరం మొదటి అంతస్తులో ఉన్న తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత డోర్‌ లాక్ చేసినట్టు గుర్తించిన ఆయన కుమార్తె తలుపులు తెరవాలంటూ పిలిచారు. కోడెల ఎంత సేపటికీ తలుపు తీయకపోవడంతో ఆయన వ్యక్తిగత గన్‌మెన్‌ సహాయంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్న కోడెలను కారులో బసవతారకం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కోడెల చనిపోయినట్లు నిర్థారించారు. 

వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయిన కోడెల శివ ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఎన్నికైన తొలి శాసనసభాపతి. 1983లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 2004 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించారు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు.

బాల్యం.. చదువు
కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. దిగువ మధ్యతరగతి కుటుంబం. కోడెల అయిదో తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివారు. కొద్దిరోజులు సిరిపురంలో, ఆ తర్వాత నర్సరావుపేటలో పదో తరగతి అభ్యసించారు. అనంతరం విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ చదివారు. 

డాక్టర్‌ కావడానికి అదే కారణం 
చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలచివేచింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. తాతయ్య ప్రోత్సాహంతో కోడెల వైద్య విద్యనభ్యసించడానికి ముందడుగు వేశారు. గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్లీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.  రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వారణాసిలో ఎం.ఎస్ చదివారు.  నరసరావుపేటలో ఆస్పత్రి నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు. అనతి కాలంలోనే తిరుగులేని సర్జన్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి..
పల్నాడులో అప్పటికే రాజ్యమేలుతున్న రాజకీయ అరాచకాలకు అడ్డుకట్టకు డాక్టర్ కోడెల శివప్రసాదరావే సరైన వ్యక్తి అని భావించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఇష్టం లేకపోయినప్పటికీ ఎన్టీఆర్‌ పిలుపు మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల ఒత్తిడిలో ఉంటూనే.. మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. కోడెల భార్య శశికళ గృహిణి కాగా, వీరికి ముగ్గురు పిల్లలు విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యనారాయణ. వీరు కూడా వైద్యులే. అమ్మాయి గైనకాలజిస్టు. పెద్ద కుమారుడు క్యాన్సర్ సర్జన్ కాగా, రెండో కుమారుడు ఎముకల స్పెషలిస్టు. అయితే, ప్రమాదవశాత్తూ రెండో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు.

కోడెల మృతి..  లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.