close

తాజా వార్తలు

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

హైదరాబాద్‌: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణం చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ మంత్రిమండలి నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎర్రమంజిల్ భవనాలకు పరిరక్షణ నిర్మాణాల పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. వారసత్వ కట్టడాల పరిరక్షణ జాబితాను తొలగించేటప్పుడు.. ప్రభుత్వం అనేక అంశాలను విస్మరించిందని తప్పుపట్టింది. వారసత్వ భవనాలు కూల్చివేయడమంటే.. ప్రజల అస్తిత్వాన్ని, నగర గుర్తింపును దోచుకున్నట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. భవిష్యత్‌ కోసం ప్రణాళికలు ఎంత ముఖ్యమో.. గతాన్ని పరిరక్షించాల్సిన అవసరం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు చట్టబద్ధంగా ఉన్నాయా లేదా అనే న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టుకు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఎర్రమంజిల్‌లో భవనాలను కూల్చివేసి అసెంబ్లీ, శాసనమండలి, కమిటీ హాల్, స్పీకర్, మండలి ఛైర్మన్ నివాస సముదాయాలను నిర్మించాలన్న కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఎనిమిది ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. సుమారు 150 ఏళ్ల క్రితం నాటి ఎర్రమంజిల్ భవనాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్న పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఎర్రమంజిల్ భవనం పరిరక్షణ కట్టడాల పరిధిలోకి రాదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తప్పుపట్టింది.

పట్టణ ప్రాంతాల చట్టం ప్రకారం.. ఆ నిబంధనను తొలగించే అధికారం హెచ్ఎండీఏకే ఉంటుంది గానీ.. ప్రభుత్వానికి ఉండదని స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ జోన్ల ప్రకారం.. ఎర్రమంజిల్ ప్రత్యేక రిజర్వేషన్ జోన్‌లో ఉన్నందున.. పరిరక్షణ కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది. 13వ నిబంధన తొలగింపు ప్రక్రియే చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి.. దాని ఆధారంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించలేమని స్పష్టం చేసింది. చారిత్రక నిర్మాణాలు.. వారసత్వ కట్టడాలు వేరన్న అదనపు ఏజీ వాదనను తోసిపుచ్చింది. ఎర్రమంజిల్ భవనం నిజాం చరిత్రకు కీలక మైలురాయి అని.. హైదరాబాద్ నగర భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని పేర్కొంది. విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ పరిరక్షణ కట్టడాల పరిధిలోంచి తొలగించే 13వ నిబంధన రద్దు చేయడంలో ప్రభుత్వ చట్టబద్ధంగా వ్యవహరించలేదని పేర్కొంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.