close

తాజా వార్తలు

హమ్మయ్య.. భారీ వడ్డింపులు తప్పినట్లే..

ప్రభుత్వ తాజా యోచనతో నగర వాహనదారులకు ఊరట
ఈనాడు, హైదరాబాద్‌

కేంద్రం రూపొందించిన మోటారు వాహనాల (సవరణల) చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడంపై.. సర్కారు నూతన ఆలోచన గ్రేటర్‌ పరిధిలోని వాహనదారులకు ఊరటనిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు ఎక్కువగా మూడు (హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ) పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లోనే నమోదవుతుంటాయి. నమోదవుతున్న జరిమానాల మొత్తం ప్రస్తుతం ఏటా రూ.170కోట్ల దాకా ఉంటోంది. కొత్త చట్టం అమలుతో అది ఏకంగా రూ.500కోట్లకు పెరిగే అవకాశమున్నా, ఆచరణలో ఎదురవుతున్న స్థితిగతులు రాష్ట్రప్రభుత్వ పునరాలోచనకు దారితీశాయి. ఇక ఎప్పటికప్పుడు ఎక్కడిక్కడ ఉన్నపళంగా భారీ వడ్డింపులు పడవన్న ఉపశమనం మాత్రం వాహన చోదకులకు లభించినట్లయింది. సాధారణంగా ట్రాఫిక్‌ పోలీసులంటేనే ‘జరిమానాల బాదుడు’ తప్పదన్న అభిప్రాయం ఉంది. ఆ వసూళ్లలోనే నిమగ్నులయ్యేవారు అదే సమయంలో ట్రాఫిక్‌ నియంత్రణ బాధ్యతలను పెద్దగా పట్టించుకోరన్నదీ పలువురి మనోగతం. చట్ట నిబంధనల అమలుకు సంబంధించి, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ఇటీవలే శ్రీకారం చుట్టిన ప్రక్రియ మాత్రం ఎంతైనా గమనార్హం. కొన్ని ఉల్లంఘనలకు పాల్పడుతూ చిక్కినవారికి జరిమానాలు విధించడమే ఏకైక  పనిగా పెట్టుకోకుండా, ఆ తప్పులను సరిదిద్దడం పైనే వారు దృష్టి పెడుతున్నారు.  ఉదాహరణకు: ఎవరైనా ద్విచక్రవాహనదారు శిరస్త్రాణం ధరించకుండా నడుపుతూ దొరికిపోతే జరిమానా రూ.వెయ్యి! అదే సొమ్ముకు సరిపడా ఐఎస్‌ఐ మార్క్‌ శిరస్త్రాణాన్ని అతడితో కొనిపించడమే ఆదర్శప్రాయంగా ఉంటోంది. జరిమానాల బాధ తప్పడంతో పాటు, ప్రమాదాల నుంచి కాపాడుకునే మంచి మార్గం లభించిందన్నదే చోదకుడికీ సంతృప్తి.

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఇలా..
రాచకొండ, సైబరాబాద్‌ జంట కమిషనరేట్లలో ఈ సంవత్సర ప్రథమార్థంలో నమోదైన ఉల్లంఘనల్ని ట్రాఫిక్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు విశ్లేషించారు. వాటిని పరిశీలిస్తే-

రాచకొండలో..
మొత్తం కేసులు : 7,67,699
శిరస్త్రాణం లేనివాటికి సంబంధించి: 5,76,130

సైబరాబాద్‌లో..
మొత్తం కేసులు : 11,97,435
శిరస్త్రాణం లేనివి: 6,91,007

నిఘాలో రాజీ లేదు
ఉన్న మూడు కమిషనరేట్ల పరిధుల్లోనూ ట్రాఫిక్‌ ఉల్లంఘనలంటే..శిరస్త్రాణం ధరించనివే ఎక్కువ. ఈ తరహా కేసులే రెండు నుంచి మూడొంతుల వరకు నమోదవుతున్నాయి. రాచకొండ పోలీసుల అమలు తీరు నేపథ్యంలో, ఈ ఏడాది జరిమానాల సంఖ్య తగ్గే అవకాశముందని భావిస్తున్నారు. ఉల్లంఘనలపై నిఘాను విస్తృతం చేసే ఆలోచనైతే పోలీసుశాఖకు మెండుగా ఉంటోంది. ఎలాగూ కొత్త చట్టం అమలుకావడం లేదు కాబట్టి రెచ్చిపోవచ్చనే కొందరి ధోరణికి అడ్డుకట్టలా ఇక కఠినంగా వ్యవహరించనున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.