close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. నల్గొండలో కుంభవృష్టి

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్గొండలో కుంభవృష్టి, హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ పట్టణంలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా 6 గంటల్లో 200.8 మిల్లీమీటర్ల వర్షం కురిసి సరికొత్త రికార్డు నమోదైంది. ఈ పట్టణంలో గత 119 ఏళ్ల వాతావరణ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి వర్షం పడటం ఇదే తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బోటు ప్రమాద బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వాలి

గోదావరి నదిలో పర్యాటకుల బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో చాలామంది ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం ప్రభుత్వ అసమర్థ, చేతకానితనానికి నిదర్శనమని మంగళవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై న్యాయవిచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ తీరును చూస్తుంటే వరదలొచ్చినా, తుపానులొచ్చినా ప్రజలను పట్టించుకునే నాథుడేలేరని భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. యురేనియం తవ్వకాలపై స్పష్టత ఇవ్వాలి

పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రపంచ వేదికలపై ప్రకటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. మరోవైపు నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతిస్తున్నారని జనసేన నాయకుడు పెంటపాటి పుల్లారావు విమర్శించారు. తెలంగాణలో ‘సేవ్‌ నల్లమల’ పేరుతో సాగుతున్న ఉద్యమానికి బాసటగా పలువురు దిల్లీ వాసులు, పాత్రికేయులు మంగళవారం ఇండియాగేట్‌ వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. నల్లమలను రక్షించాలి... యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని నినాదాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాటలినా ఛానెల్‌ను ఈదిన తెలుగుతేజం

అమెరికాలోని కాటలినా ఛానల్‌ను ఈదిన తెలుగు రాష్ట్రాల తొలి స్విమ్మర్‌గా విజయవాడకు చెందిన మోతుకూరి తులసీ చైతన్య చరిత్ర సృష్టించారు. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆయన ఈ నెల 16న కాటలినా ద్వీపం నుంచి రాంఛొపాలొ వెర్డిస్‌ వరకు 35 కి.మీ.పైగా ఉన్న దూరాన్ని 12 గంటల 40 నిమిషాల వ్యవధిలో అధిగమించారు. కాటలినా ఛానల్‌ను ఈదే సమయంలో పలు అవాంతరాలను ఎదుర్కొన్నా.. చివరికి లక్ష్యం సాధించడం ఆనందంగా ఉందని తులసీ చైతన్య పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పోరాట విలువల్ని నేటి తరానికి వివరించాలి

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను కొందరు మతోన్మాదులు వక్రీకరించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న తరుణంలో గత పోరాటాలు, త్యాగాలను నేటి తరానికి వివరించాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుందాం.. అనే నినాదంతో బహిరంగసభ నిర్వహించారు. నారాయణ ప్రసంగిస్తూ కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగానే తెలంగాణ విమోచనం జరిగిందన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంతో గానీ, తెలంగాణ సాయుధ పోరాటం, విమోచనంతో భాజపాకు సంబంధం లేదని, అధికారం కోసం అబద్దాలు పలుకుతోందని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గ్రహాంతర జీవి కాదు.. మత్స్యరాజమే!

ఉత్తర నార్వేలోని అండోయా ద్వీపం సమీపంలో సముద్రంలో ఆస్కార్‌ లుంధాల్‌ అనే చేపల వేట శిక్షకుడి గాలానికి చిక్కిన వింత చేప ఇది. గుండ్రటి పెద్ద కళ్లతో గ్రహాంతర జీవిని పోలి ఉన్న ఈ చేపను చూడగానే తనకు పడవ నుంచి దూకేయాలన్నంత భయం వేసిందని ఆయన చెప్పారు. ఈ ర్యాట్‌ఫిష్‌ లాటిన్‌ పేరు ఛిమోరా మోన్‌స్ట్రొసా లినియాస్‌. గ్రీకు ఇతిహాసాల ఆధారంగా ఈ పేరు వచ్చింది. అత్యంత లోతైన సముద్రాల్లో అట్టడున ఈ చేపలు ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. డ్రైవర్‌ లేకుండానే రైలు పరుగులు

డ్రైవర్‌ లేకుండానే రాజస్థాన్‌లోని ఓ రైలు 40 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని సెంద్రా రైల్వేస్టేషన్‌లో ఆగిన ఓ గూడ్సు రైలు... డ్రైవర్‌ లేకుండానే ఉన్నట్టుండి కదిలింది. వేగమూ అందుకుంది. దీన్ని గమనించిన అధికారులు తర్వాతి స్టేషన్లను అప్రమత్తం చేశారు. దారిలో ఉన్న రైల్వే గేట్లన్నింటిని మూసేశారు. రైలు పట్టాలపై రాళ్లు, బస్తాలు వేసి ఆపే ప్రయత్నం చేశారు. అవేవీ ఫలించలేదు. మొత్తానికి సోజాత్‌ స్టేషన్‌ దగ్గర రైలు దానంతట అదే ఆగిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యమహా-హీరో ‘ఇ సైకిల్‌’

లెక్ట్రో ఇ-సైకిల్‌ శ్రేణిని దేశీయ విపణిలోకి విడుదల చేసేందుకు జపాన్‌కు చెందిన యమహా మోటార్‌ కంపెనీతో జత కట్టినట్లు హీరో సైకిల్స్‌ మంగళవారం వెల్లడించింది. యమహా కంపెనీకి చెందిన ‘లెక్ట్రో ఈహెచ్‌ఎక్స్‌20’ ఇ-సైకిల్‌ ధర రూ.1.30 లక్షలని కంపెనీ తెలిపింది. ఆరోగ్యకర జీవనం, దేహ దారుఢ్యం కోసం అధిక వ్యయం చేస్తున్న అధికాదాయ  వర్గాలను లక్ష్యంగా చేసుకుని మెట్రో నగరాలలో ఈ ఇ-సైకిళ్లను విక్రయిస్తామని హీరో సైకిల్స్‌ వెల్లడించింది. సెంటర్‌ మోటార్‌తో తయారైన తొలి ఇ-సైకిల్‌ ఇదే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కళ్లన్నీ కుర్రాళ్లపై

ఒక్క బంతి పడకుండానే తొలి మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోగా.. పొట్టి సమరంలో మరో పోరాటానికి సిద్ధమయ్యాయి టీమ్‌ ఇండియా, దక్షిణాఫ్రికా. మొహాలీలో నేడే రెండో టీ20. దృష్టంతా భారత కుర్రాళ్లపైనే. ముఖ్యంగా నిలకడ లోపించిన రిషబ్‌ పంత్‌కు ఈ సిరీస్‌ పరీక్షే. వర్షం కారణంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కాస్తా రెండు మ్యాచ్‌ల సిరీస్‌గా మారిపోయింది. సొంతగడ్డపై సత్తా చాటాలని తహతహలాడుతున్న భారత జట్టు బుధవారం జరిగే రెండో టీ20లో దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. అందరి దృష్టీ అవకాశాలను అంతగా సద్వినియోగం చేసుకోలేకపోతున్న పంత్‌పైనే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. డ్యూయెట్‌ ఒప్పుకుంటే బిందెలూ ఒప్పుకోవాలి

వరుణ్‌తేజ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘వాల్మీకి’. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. మంగళవారం హైదరాబాద్‌లో ‘ఎల్లువొచ్చె గోదారమ్మ’ పాటని కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘దేవత’ సినిమా విడుదలయ్యాక ఓ పాత్రికేయుడు ‘అప్పటికప్పుడు పాటలో అన్ని బిందెలు ఎక్కడి నుంచి వచ్చాయో’ అంటూ విమర్శించాడు. ఆ విలేకరిని పిలిచి ‘నువ్వుగానీ, నీ స్నేహితులు గానీ ఎప్పుడైనా ప్రేమించారా’ అని అడిగాను. ‘ప్రేమించాం’ అన్నాడు. ‘మరి డ్యూయెట్లు పాడుకున్నారా? సినిమాల్లో డ్యూయెట్‌ ఉండటం ఒప్పుకుంటే, బిందెలను కూడా ఒప్పుకోవాల్సిందే’ అన్నాను. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.