close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. తితిదే బోర్డు సభ్యులుగా 28 మంది

తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 28 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది. వీరిలో నలుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు. మండలిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడుతోపాటు పలు ప్రాంతాలకు ప్రధాన్యం కల్పించారు. తితిదే సభ్యుల వివరాలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఇక ఇ-సిగరెట్లపై నిషేధం: కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఇ-సిగరెట్లపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇక నుంచి వీటి తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, విక్రయాలు, పంపిణీ, నిల్వ చేయడం, ప్రచారం వంటి అంశాలపై నిషేధం విధించినట్లు ఆమె వెల్లడించారు. ఇ-సిగరెట్ల వల్ల యువతపై తీవ్రమైన చెడుప్రభావం పడుతోందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఖాతాలు ఎందుకు నిలిపేశారు?: పవన్‌

జనసేన కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను ఎందుకు నిలిపివేశారని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘400 మంది జనసేన కార్యకర్తల ట్విటర్‌ ఖాతాలను ఎందుకు నిలిపివేశారో నాకు అర్థం కావడం లేదు. అవసరాల్లో ఉన్న సామాన్యుల తరఫున నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నందుకు ఖాతాలను నిలిపివేశారా? దీన్ని మేం ఎలా స్వీకరించాలి, అర్థం చేసుకోవాలి?’ అంటూ #BringBackJSPSocialMedia ట్యాగ్‌ను పవన్‌ జత చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కోడెల కాల్‌డేటాపై వార్తలు అవాస్తవం: ఏసీపీ

తెదేపా సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోందని బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావు తెలిపారు. కోడెల మొబైల్‌ ఫోన్‌ కాల్‌ డేటాపై ఆరాతీస్తున్నామని.. సీడీఆర్‌ఏ కాల్‌ లిస్ట్‌ రిపోర్టు పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. త్వరలో కోడెల కుమారుడు శివరామ్‌ను కూడా విచారిస్తామని ఏసీపీ తెలిపారు. మరోవైపు కోడెల కాల్‌డేటాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. రైల్వే ఉద్యోగులకు ఈసారి బోనస్‌ ఎంతంటే..

దసరాకు రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ అందించే కీలక నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 11 లక్షల పైచిలుకు రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ బుధవారం దిల్లీలో ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కశ్మీర్‌పై భారత్‌కు ఐరోపా సమాఖ్య మద్దతు

కశ్మీర్‌ అంశంపై ఐరోపా సమాఖ్య భారత్‌కు మద్దతుగా నిలిచింది. దాదాపు 12సంవత్సరాల తరవాత ఐరోపా సమాఖ్య పార్లమెంటులో కశ్మీర్‌ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా చాలా దేశాలు మన దేశానికి మద్దతుగా నిలిచినట్లు సమాచారం. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సమాఖ్య ఉపాధ్యక్షురాలు ఫెడెరికా మొగెరిని చర్చ ప్రారంభించగా.. సభ్య దేశాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వినేశ్‌

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అద్భుతం చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించాలన్న కల నెరవేరకున్నా టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ మాత్రం ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన రెపిఛేజ్‌ పోరులో అమెరికా క్రీడాకారిణి సారా హల్దెబ్రాండ్‌ 8-2తో ఓడించింది. సారా ప్రపంచ రజత పతక విజేత కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. దక్షిణాదిలో ‘హిందీ’ అంటే కుదరదన్న రజనీ

హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన ‘ఒకే దేశం-ఒకే భాష’ వ్యాఖ్యలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ విషయంపై స్పందించారు. కేంద్రమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. హిందీ భాష అమలు ఎక్కడైనా సాధ్యమవుతోందేమోగానీ దక్షిణ భారత దేశంలో సాధ్యం కాని పని అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. సొంతపార్టీ నేతలపై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు 14 రోజుల కంటే తక్కువగా జరిగితే అది చెల్లదని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.  అసెంబ్లీ రూల్స్‌ బుక్‌లోనే ఈ నిబంధన ఉందని చెప్పారు. రెండు పార్టీలు ఒప్పుకుంటే సరిపోదని.. సమావేశాలు 14 రోజులకు తక్కువ జరగడం నిబంధనలకు విరుద్ధమన్నారు. సభలో విద్యుత్‌పై చర్చ జరిగేటప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం సరికాదని.. ఆ విషయాన్ని తమ ఎమ్మెల్యేలకు అడిగేందుకే అసెంబ్లీకి వచ్చానని రేవంత్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కశ్మీర్‌ ప్రాధాన్య అంశం కాకపోవచ్చు: చైనా

వచ్చే నెల ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మధ్య జరగనున్న సమావేశంలో కశ్మీర్ విషయం కీలక అంశం కాకపోవచ్చునని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి హువా చునైంగ్‌ అభిప్రాయపడ్డారు. సరిహద్దు వివాదాలు, వ్యూహాత్మక సమాలోచనలు మాత్రమే చర్చకు రావచ్చునని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.